హైదరాబాద్: నగర రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పెద్ద సంచలనం.. ప్రసిద్ధ స్టార్ హోటల్ ‘తాజ్ బంజారా’ చేతులు మారింది. అరోబిందో గ్రూప్‌కి చెందిన ఆరో రియాల్టీ తాజ్ బంజారా హోటల్‌ను రూ.315 కోట్లకు అధికారికంగా కొనుగోలు చేసింది.
గత అక్టోబర్ 31న పూర్తైన ఈ లావాదేవీ బంజారాహిల్స్ వంటి ప్రీమియం ప్రాంతంలో జరిగిన అత్యంత ముఖ్యమైన డీల్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ కొనుగోలుకు స్టాంప్ డ్యూటీ కింద రూ.17.3 కోట్లు చెల్లించినట్లు సమాచారం. సుమారు 3.5 ఎకరాల్లో ఉన్న తాజ్ బంజారా మొత్తం విస్తీర్ణం 16,645 చదరపు గజాలు. ఇందులో బిల్ట్-అప్ ఏరియా 1.22 లక్ష చదరపు అడుగులు. ఈ హోటల్లో మొత్తం 270పైగా గదులు ఉన్నాయి.
ఐకానిక్ తాజ్ బంజారా
ఒకప్పుడు తాజ్ గ్రూప్‌కి చెందిన ఫ్లాగ్‌షిప్ లగ్జరీ హోటల్‌గా తాజ్ బంజారా ప్రత్యేకమైన ప్రాధాన్యం కలిగిన హోటల్గా నిలిచింది. అయితే గత కొన్నేళ్లుగా ఆపరేషనల్ సమస్యలు, జీహెచ్ఎంసీ నుంచి క్లోజర్ నోటీసులు అందుకోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంది. ఈ కొనుగోలు తర్వాత ఆ ప్రాపర్టీ పునర్వ్యవస్థీకరణకు అవకాశాలు ఉన్నాయి.
ఆరో రియాల్టీ ఏం చేస్తుందో..
హైదరాబాద్‌లో భారీగా విస్తరిస్తున్న ఆరొ రియాల్టీ, రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్‌డ్-యూజ్ సెగ్మెంట్‌ల్లో నిరంతరం పెద్ద ప్రాజెక్టులు చేపడుతోంది. ఇప్పుడు తాజ్ బంజారా కొనుగోలు ఆ విస్తరణలో కీలకమైన మైలురాయిగా నిలిచింది. కాగా దీంతో ఆతిథ్య రంగంలోకి ప్రవేశించి తాజ్ బంజారా హోటల్ను కొనసాగిస్తుందా.. లేదా కూల్చేసి హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌కు తెరతీస్తుందా అన్నది చూడాలి.


