breaking news
Taj Banjara Hotel
-
హైదరాబాద్ తాజ్ బంజారా హోటల్ సీజ్
-
HYD: తాజ్ బంజారా హోటల్ సీజ్.. కారణం ఇదే
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ప్రముఖ హోటల్ తాజ్ బంజారా హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. పన్ను బకాయిలు చెల్లించని నేపథ్యంలో సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.హైదరాబాద్‌లో ప్రముఖ హోటల్ తాజ్ బంజారాను జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం ఉదయం సీజ్ చేశారు. గత రెండేళ్లుగా హోటల్ యాజమాన్యం పన్నులు బకాయిలు చెల్లించకపోవడంతో సీజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. రూ.1.40కోట్లు పన్ను బకాయిలు ఉన్నట్టు అధికారులు చెప్పుకొచ్చారు. గడిచిన రెండు సంవత్సరాలుగా హోటల్ నిర్వాహకులు పన్ను బకాయలు చెల్లించలేదు. దీనిపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా హోటల్ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఈ క్రమంలో సీజ్ చేసినట్టు తెలిసింది. ఇక ఈ ఘటనపై తాజ్ హోటల్ యాజమాన్యం స్పందించింది. సీజ్‌చేసి వారెంట్ ఇష్యూ చేయడంతో హుటాహుటిన హోటల్ నిర్వాహకులు స్పందించారు. జీహెచ్ఎంసీకి బకాయి పడిన కోటీ 43 లక్షల రూపాయల పన్నులో సగం చెల్లించినట్టు తెలిపారు. మిగతా బకాయిలను వారంలోగా చెల్లించేందుకు ఒప్పుకున్నట్టు స్పష్టం చేశారు. అయితే తాజా బంజారానే కాకుండా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్లో భాగంగా డిఫాల్టర్స్ అందరికీ నోటీసులు పంపింది జీహెచ్ఎంసీ. మూడేళ్లుగా పన్ను చెల్లించనివాళ్లకు వారెంట్స్ ఇష్యూ చేశారు. అందులో భాగంగానే తాజ్ బంజారాకి కూడా నోటీసులు ఇచ్చారు. రెడ్ నోటీస్ ఇష్యూ చేయడంతో తప్పని పరిస్థితుల్లో సగం పన్ను చెల్లించింది తాజ్ బంజారా యాజమాన్యం.హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్‌లో బంజారాహిల్స్‌లోని తాజ్ బంజారా కూడా ఒకటి. ఈ హోటల్‌కు సెలబ్రెటీలు ఎక్కువగా వస్తుంటారు. క్రికెటర్లు ఎప్పుడు వచ్చినా ఈ హోటల్లోనే ఎక్కువగా బస చేస్తుంటారు. అలాగే దేశంలోని కీలక రాజకీయనేతలు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేస్తారు. పార్టీ సమావేశాలకు అనుకూలంగా ఉండడంతో ఎక్కువ మంది దీని వైపు మొగ్గుచూపుతారు. -
స్టార్ హోటల్లో దిగాడు.. లక్షల్లో బిల్లు ఎగ్గొట్టాడు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని తాజ్‌బంజారా హోటల్‌కు ఓ వ్యాపారి లక్షల్లో బిల్లు ఎగ్గొట్టి పరారయ్యాడు. తాజ్‌బంజారా హోటల్ జీఎం హితేంద్రశర్మ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. విశాఖపట్నం వినాయకటెంపుల్ సమీపంలోని కిర్లంపుడి లేఅవుట్లో ఉన్న సాగర్ దీప అపార్ట్‌మెంట్స్‌లో నివసించే అక్కింశెట్టి శంకర్ నారాయణ్ గతేడాది ఏప్రిల్ 4న తాజ్‌బంజారా హోటల్‌కు వచ్చి తాను ఏడాదిపాటు వ్యాపారనిమిత్తం ఇక్కడ బస చేయడానికి ఉంటున్నానని ఒకేగదిని దీర్ఘకాలిక ప్రాతిపదికన కేటాయించాల్సిందిగా కోరాడు. దీంతో గతేడాది ఏప్రిల్ 4న ఆయనకు హోటల్లో రూమ్ నెంబర్ 405 కేటాయించారు. మధ్యలో రూ.13.62 లక్షలు బిల్లు చెల్లించాడు. దీంతో హోటల్ నిర్వాహకులను నమ్మిస్తూ తర్వాత బిల్లులు వాయిదాలు వేస్తూ వచ్చాడు. గత ఏప్రిల్ 15వ తేదీన ఆయన గదికి తాళం వేసి వెళ్ళిపోయాడు. రోజులు గడిచినా రాకపోవడంతో నిర్వాహకులు సంప్రదిస్తూ వచ్చారు. మొత్తం 102 రోజులకుగాను హోటల్ బిల్లు రూ. 25,96,693 కాగా అందులో రూ. 13,62,149 చెల్లించాడు. మిగతా రూ. 12,34,544 బాకీ పడ్డాడు. ఈ మొత్తాన్ని చెల్లించకుండానే గది విడిచి పరారయ్యాడు. జూన్ 26వ తేదీన ఆయనకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. వెతికినా ఫలితం లేకుండా పోయింది.దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సాక్షి ఎక్స్‌లెన్స్
గత ఏడాది విభిన్న రంగాల్లో ప్రతిభా నైపుణ్యాలు ప్రదర్శించిన విజయవంతమైన వ్యక్తులను గుర్తించి సత్కరించేందుకు సాక్షి మీడియా గ్రూప్.. ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2014’ కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు నిర్వహించింది. నగరంలోని తాజ్ బంజారా హోటల్ ఇందుకు వేదికైంది. అవార్డులకు సంబంధించిన నామినేషన్ల వడపోత ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు పాపులర్ కేటగిరీలుగా స్పోర్ట్స్, టీవీ సీరియల్స్, సినిమా రంగాలకు సంబంధించి తమకు అందిన నామినేషన్లను జ్యూరీ సభ్యులు పరిశీలించారు. వీటిలో ఒక్కో కేటగిరీ నుంచి ఫైనలిస్ట్‌లుగా కొందరిని ఎంపిక చేశారు. వీరిలో నుంచి విజేతలను ఓటింగ్ ద్వారా ఎంపిక చేస్తారు. యంగ్ అఛీవర్ ఇన్ సోషల్ సర్వీస్ కేటగిరీ నుంచి ఐదుగురిని టాప్ ఫైనలిస్ట్‌లుగా ఎంపిక చేశారు. ఈ విభాగంలో తుది విజేతను జ్యూరీయే స్వయంగా ఎంపిక చేస్తుంది. మొదటి రోజు ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ ఎంపిక కమిటీకి జ్యూరీ సభ్యులుగా సినీ, క్రీడా రంగ ప్రముఖులు రావి కొండలరావు, గీతాంజలి, అల్లాణి శ్రీధర్, పూర్ణిమారావు, ఎన్.ముఖేష్‌కుమార్, విక్టర్ అమల్‌రాజ్, నాటక రంగ ప్రముఖులు గుమ్మడి గోపాలకృష్ణ, నృత్యకారిణి స్వాతి సోమనాథ్ వ్యవహరించారు. రెండో రోజు.. రెండో రోజు గురువారం బెస్ట్ మూవీ, బెస్ట్ మేల్-ఫిమేల్ ఆర్టిస్ట్, బెస్ట్ ఫిమేల్-మేల్ సింగర్ల కేటగిరీలకు ఫైనలిస్ట్‌లను సెలక్ట్ చేశారు. ఈ ప్రక్రియకు జ్యూరీ సభ్యులుగా సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ్, చంద్రబోస్, కవిత, రాశి, సంగీత దర్శకుడు కె.ఎం.రాధాకృష్ణన్, సామాజిక ప్రముఖులు గోరటి వెంకన్న, దేవి వ్యవహరించారు. ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి పర్యవేక్షించారు. సంతోషంగా ఉంది: దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన వారిని సత్కరించేందుకు సాక్షి మీడియా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. ఈ తరహా సెలక్షన్స్ సినీఫీల్డ్‌లో సాధారణమే. అయితే ఓ మీడియా సంస్థ ఇంత జెన్యూన్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉంది. మరెందరికో స్ఫూర్తి: నటి కవిత ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సాక్షి మీడియాకు ధన్యవాదాలు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా ఇందులో పాలుపంచుకుంటున్నా. ఈ కార్యక్రమం మరెందరికో స్ఫూర్తి నివ్వాలని కోరుకుంటున్నా. కొత్తగా అనిపించింది: సంగీత దర్శకుడు రాధాకృష్ణన్ ఇలాంటి అవార్డ్ ప్రోగ్రామ్స్ బాలీవుడ్లో ఎక్కువ. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సాక్షి నుంచి నాకు కాల్ రాగానే కొత్తగా అనిపించింది. ఇటువంటికార్యక్రమాలు కొత్త స్ఫూర్తి నింపుతాయి. గొప్ప ఆలోచన: సినీ గేయ రచయిత చంద్రబోస్ కేవలం సినిమా నటీనటులు, గాయనీగాయకులు అని కాకుండా.. స్పోర్ట్స్ పర్సన్స్, సీరియల్స్, సామాజిక సేవకులు.. ఇలా పలు రంగాలకు చెందిన వారిని ప్రోత్సహించే ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు సాక్షికి కృతజ్ఞతలు. ప్రేక్షకులే నిర్ణేతలు: సినీ నటి రాశి ఎవరు ది బెస్ట్ అని నిర్ణయించడం అంత సులభమైన విషయం కాదు. సరైన న్యాయనిర్ణేతలు మాత్రం టీవీల ముందు కూర్చున్న ప్రేక్షక దేవుళ్లే. సాక్షి చేపట్టిన ఎక్స్‌లెన్స్ ఈవెంట్లో నా ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు హ్యాపీగా ఉంది. ఫ్యూచర్లో..: సామాజిక కార్యకర్త దేవి సాక్షి చేస్తున్న ఈ ప్రయత్నం బాగుంది. షార్ట్ ఫిలింస్, డాక్యుమెంటరీస్ మీద కూడా ఫోకస్ చేస్తే బాగుండేది. మంచి కథ, కథనం ఉండి పెద్దగా పేరు రాని మంచి మూవీస్ అనేకం ఉంటాయి. అలాంటి వాటిపై దృష్టి పెట్టి ఉంటే.. న్యూ టాలెంట్స్‌ను ప్రోత్సహించినట్టుండేది. ఫ్యూచర్లో ఆ కోణంలో ఆలోచిస్తే బాగుంటుంది.