కుర్చీని మడత పెట్టినట్టుగానే ఇంటి పైకప్పునకు ఎక్కేందుకు ఉపయోగించే మెట్లు ఉంటే ఎంత బాగుంటుందో కదూ.. అవును.. ఫోల్డబుల్ స్టేర్‌కేస్‌లు మార్కెట్‌లోకి వచ్చేశాయి. తక్కువ స్థలంలో, అందంగా ఇమిడిపోవడం వీటి ప్రత్యేకత. తక్కువ స్థలం ఉన్న ఇళ్లకు, బాల్కనీలోకి వెళ్లేందుకు, చిన్న స్థలంలో నిర్మించే డూప్లెక్స్‌లకు ఈ మడత పెట్టే మెట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
మడతపెట్టే మెట్లు సురక్షితంగానే ఉంటాయి కానీ వీటిని సరిగ్గా బిగించాలి.. లేకపోతే ప్రమాదకరం. ఈ మెట్ల మీదుగా ఎక్కేటప్పుడు ఇరువైపులా హ్యాండ్ రెయిల్స్, యాంటీ స్లిప్ రింగ్‌లు వంటివి ఉండేలా చూసుకోవాలి. లేకపోతే పిల్లలు, వృద్ధులు కిందపడిపోయే ప్రమాదం ఉంటుంది.
ఇంటి విలువను పెంచే మెట్లు..
నిరంతరం, రోజువారి అవసరాలకు వినియోగించే మెట్ల స్థానంలో ఈ మడతపెట్టే మెట్లు అంత శ్రేయస్కరం కాదు. స్టోర్ రూమ్‌లు, చిన్న స్థలం ఉండే ఇళ్లు, బాల్కనీలోకి ఎక్కేందుకు, అప్పుడప్పుడు వినియోగించే ప్రాంతాలలో ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ఇంటి విలువను పెంచడంలో మెట్లు కూడా భాగస్వామ్యమే. కాబట్టి చిన్న స్థలంలో నిర్మించే డూప్లెక్స్ ఇళ్లలో ఈ మడత పెట్టే మెట్లను వినియోగించేటప్పుడు ఇంటీరియర్, రంగులకు అనుగుణంగా ఈ మెట్లను ఎంపిక చేసుకోవాలి. లేకపోతే
ఇంటి అందం దెబ్బతింటుంది.
నాణ్యమైన కలప లేదా అల్యూమీనియంతో ఈ మడతపెట్టే మెట్లను తయారు చేస్తారు. పిల్లల గది, చిన్న హాల్‌లో, ఇరుకైన స్థలంలో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి నిచ్చెనలు పాదాల కింద స్థిరంగా ఉండవు కాబట్టి బరువైన వస్తువులను మోసుకెళ్తూ ఈ మెట్లను ఎక్కకూడదు. సంప్రదాయ మెట్లతో పోలిస్తే ఇవి చౌక ధరల్లోనే లభిస్తాయి.


