ఇంటి కంటే స్పీడ్‌గా ఇంటీరియర్‌.. | Indias Home Interiors Market to go Rs 2 75 Lakh Crore by 2030 Report | Sakshi
Sakshi News home page

ఇంటి కంటే స్పీడ్‌గా ఇంటీరియర్‌..

Dec 9 2025 2:20 PM | Updated on Dec 9 2025 2:59 PM

Indias Home Interiors Market to go Rs 2 75 Lakh Crore by 2030 Report

దేశంలో ఇళ్ల ధరలు పెరుగుతున్నప్పటికీ, ఇంటీరియర్స్‌పై చేసే ఖర్చుల పెరుగుదల వేగం మరింత అధికంగా ఉంది. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో పెరుగుతున్న ఇంటీరియర్స్ మార్కెట్, గృహ ధరల వృద్ధిని మించిన వేగంతో ముందుకు సాగుతోంది.

భారతదేశ హోమ్ ఇంటీరియర్స్ మార్కెట్ వేగంగా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. 2024లోని రూ.1.27 లక్షల కోట్ల నుండి 2030 నాటికి ఇది రూ.2.75 లక్షల కోట్ల స్థాయిని చేరుకోనుందని మ్యాజిక్‌బ్రిక్స్ తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ వృద్ధికి ప్రధానంగా ప్రేరణనివ్వబోతున్నవి టైర్-2 నగరాలు. ఇవి 19% వార్షిక వృద్ధితో పెరుగుతాయని, టైర్-1 నగరాల (12%) కంటే దాదాపు రెట్టింపు వేగమని అధ్యయనం చెబుతోంది.

2024లో రూ.25,536 కోట్లుగా ఉన్న టైర్-2 మార్కెట్ విలువ, 2030 నాటికి దాదాపు రూ.72,500 కోట్లకు పెరగనుంది. ఇక్కడి ఇంటీరియర్ డిమాండ్‌లో 82% రీసేల్ ఇళ్ల నుంచే వస్తోంది. కొత్త తరహా మాడ్యులర్ ఫర్నిచర్, స్మార్ట్ స్టోరేజ్, ఆధునిక డిజైన్‌ల వైపు గృహయజమానులు మరింతగా ఆకర్షితులవుతున్నారు. టైర్-2 నగరాల్లో ఒక్క ఇంటికి సగటు ఇంటీరియర్ ఖర్చు రూ.3.9 లక్షలు, ఇది టైర్-1 సరాసరి ఖర్చులో 74 శాతానికి సమానం.

మ్యాజిక్‌బ్రిక్స్ సీఎంవో ప్రసూన్ కుమార్ మాట్లాడుతూ, “టైర్-2 నగరాల్లో హోమ్ ఇంటీరియర్స్ మార్కెట్ వేగంగా పెరగడం భారత వినియోగదారుల అభిరుచుల్లో పెద్ద మార్పునకు సంకేతం. ఇళ్లు మరింత వ్యక్తిగతీకరణ, ఫంక్షనల్, డిజైన్ ఆధారితంగా మారుతున్నాయి” అని అన్నారు.

వేగవంతమైన నగరీకరణ, పెరిగిన ఆదాయాలు, మారుతున్న జీవన శైలి, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రభావం ప్రధాన వృద్ధి కారకాలు. బెడ్‌రూమ్‌లు, లివింగ్ రూమ్‌లు ఖర్చులో పెద్ద వాటాను కలిగి ఉన్నాయి. లక్నో, జైపూర్, గోవా, కొచ్చి వంటి నగరాలు ఇంటీరియర్ డిమాండ్‌లో ముందంజలో ఉన్నాయి.

జాతీయ స్థాయిలో ఫర్నిచర్, మాడ్యులర్ భాగాలు మొత్తం ఇంటీరియర్ వ్యయంలో 45 శాతం వాటాను దక్కించుకున్నాయి. ఆన్‌లైన్ ఫర్నిచర్ కొనుగోళ్లు కూడా టైర్-2 నగరాలలో వేగంగా పెరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement