యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగంలో హైదరాబాద్‌ను గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ఓ వైపు అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూనే... మరోవైపు స్కిల్లింగ్, రీ – స్కిల్లింగ్, అప్ – స్కిల్లింగ్ పై దృష్టి సారించిందన్నారు. గురువారం హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కు చెందిన ఐలైన్ స్టూడియోను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ కు నెట్ ఫ్లిక్స్ రాకతో సినిమా స్టోరీ టెల్లింగ్ లో ‘తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమవుతుందన్నారు. గ్లోబల్ ప్రొడక్షన్ పైప్‌లైన్‌లో నగరం ఓ నిర్ణయాత్మక కేంద్రంగా మారుతుందన్నారు. ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ స్టాండర్డ్స్, అడ్వాన్స్డ్ టూల్స్, ఇన్నోవేషన్-లెడ్ వర్క్ ఫ్లో ఇక్కడి ఎకో సిస్టంలో భాగమవుతాయని, ఇక్కడి యువతకు ఫ్యూచర్ రెడీ స్కిల్స్ లభిస్తాయన్నారు.
పరిశ్రమల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులను కోరారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో స్టూడియోను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు.


