ఇంటి కిచెన్‌లోకీ వచ్చేసిన ఏఐ.. | AI Steps Into Kitchen New Trend in Ultra Luxury Homes House Construction tips | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీలలో కొత్త ట్రెండ్‌..

Dec 7 2025 7:31 AM | Updated on Dec 7 2025 7:41 AM

AI Steps Into Kitchen New Trend in Ultra Luxury Homes House Construction tips

పిల్లలు లొట్టలేసుకొని తినే వంటకాలను రెడీ చేస్తుంది.. అత్తామామలకు ఆరోగ్యకరమైన భోజనాన్ని వడ్డిస్తుంది.. శ్రీవారిని పసందైన వంటలతో కట్టిపడేస్తుంది.. ..స్మార్ట్‌ ఇల్లాలి రహస్యం కాదండీ ఇదీ. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌–ఏఐ) వంటగది మహత్యం. అవును.. స్మార్ట్‌ కస్టమర్ల అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా కిచెన్స్‌ కూడా ఏఐ అవతారమెత్తాయి. హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాల్లో అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీలలో డెవలపర్లు ఈ స్మార్ట్‌ వంటగదులనే అందిస్తున్నారు.  

మెట్రో నగరాలలో ఏఐ కిచెన్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది. వంట గది అమ్మకు మాత్రమే కాదు.. ఇంటిల్లిపాదికీ అవసరమైన, ఆరోగ్యకరమైన ప్రాంతంగా మారిపోయింది. వినియోగదారుల ఆరోగ్య డేటా, వెల్‌నెస్‌ లక్ష్యాలను క్రోడీకరించి ఆహార పరిమితులను విశ్లేషించి భోజన ప్రణాళికలను రూపొందించడమే ఈ ఏఐ కిచెన్స్‌ ప్రత్యేకత. వినియోగదారుల ప్రవర్తన, అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా పోషకాహారాలు, వంటకాలను కూడా సూచిస్తుంది.

వంటలో సహాయం.. 
కృత్రిమ మేధ సాంకేతికతతో కూరగాయల్ని కోయడం, వాటిని వంట పాత్రలో వేయడం, గరిటె తిప్పడం, మంట, వేడి ఉష్ణోగ్రతలను నియంత్రించడం వంటి పనులను ఏఐ ఉపకరణాలు చేస్తాయి. రిఫ్రిజిరేటర్‌లో ఆహార పదార్థాల గడువు తేదీలను గుర్తించి, ముందుగానే హెచ్చరించడం, వ్యర్థాలను తగ్గించడం, సమయాన్ని ఆదా చేస్తుంది కూడా.. హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య సముదాయాలలో ప్రొఫెషనల్‌ కిచెన్‌లో హెడ్‌ చెఫ్‌కు రోజువారీ కార్యకలాపాలలో సహాయం చేసే ‘సౌస్‌ చెఫ్‌’ సిబ్బంది మాదిరిగా.. ఏఐ కూడా వంట గదిలో మనకు సహాయపడుతుంది. ప్రోగ్రామ్‌ చేసిన వంటకాలు లేదా వినియోగదారుల ఇన్‌పుట్‌ ఆధారంగా కూరగాయలు కత్తిరించడం, వేయించడం, తిప్పడం, ముద్దగా పిసుకుతూ కలపడం వంటి పనులు చేస్తాయి. అలాగే కొందరు కుటుంబ వంటకాలను అనుకరిస్తుంది కూడా.

ఆహార వ్యర్థాల తగ్గుదల.. 
స్మార్ట్‌ రిఫ్రిజిరేటర్లు: ఏఐ ఆధారిత రిఫ్రిజిరేటర్లు అందులోని ఆహార పదార్థాల గడువు తేదీలను ట్రాక్‌ చేస్తుంది. అందుబాటులో ఉన్న పదార్థాల ఆధారంగా వంటకాలను సూచిస్తుంది. ఆహార వ్యర్థాలు, శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది. ఏఐ ఆధారిత ఓవెన్లు, ఇండక్షన్‌ కుక్‌టాప్‌లలో ఉష్ణోగ్రత, సమయాన్ని సర్దుబాటు చేయడానికి సెన్సార్లు ఉంటాయి. దీంతో వంటకాలు మాడిపోకుండా, తక్కువ ఉడకకుండా ఉంటుంది.  

సవాళ్లున్నాయ్‌.. 
ఏఐ కిచెన్స్‌ శరవేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ.. ఈ రంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. స్మార్ట్‌ ఉపకరణాల ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు వినియోగదారుల డేటా గోప్యత, భద్రతలపై ఆందోళనలు ఉన్నాయి. కంపెనీలు బలమైన భద్రతా ప్రోటోకాల్స్‌ను రూపొందించడంతో పాటు వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందించేందుకు డేటా నిర్వహణ పారదర్శకంగా ఉండేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.  

మార్కెట్లో ఏఐ ఉపకరణాలు.. 
వంట గదిలో ఆటోమేటెడ్‌ కుకింగ్‌ అసిస్టెంట్లు, స్మార్ట్‌ రిఫ్రిజిరేటర్లు, ఓవెన్లు, ఎయిర్‌ ఫ్రైయర్లు వంటి వంట ఉపకరణాల ఏఐతో పనిచేస్తాయి. ఇవి అలెక్సా, సిరి, గూగుల్‌ హోమ్‌ వంటి వాయిస్‌ అసిస్టెంట్లతో అనుసంధానమై ఉంటాయి. సమయం, లైటింగ్‌లను సర్దుబాటు చేస్తూ శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తూ వంట గది వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తుంది. శామ్‌సంగ్, ఎల్జీ, జీఈ వంటి కంపెనీలకు చెందిన వాయిస్‌ బేస్డ్, విజువల్‌ గైడ్‌లు ఏఐ కిచెన్‌ ఉపకరణాలను విస్తృత శ్రేణి వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement