ముంబై.. దేశంలో అత్యంత కీలకమైన నగరం. దీన్ని దేశ ఆర్థిక రాజధానిగా కూడా పేర్కొంటుంటారు. దేశంలోని అనేక కార్పొరేట్ సంస్థలు, కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. ఆర్థికపరమైన కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో విదేశాలతోపాటు, దేశ నలుమూలల నుంచి ప్రముఖులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభం ముంబై నగరాన్ని ప్రభావితం చేసింది.
ఇండిగో విమాన అంతరాయాల ప్రభావం ముంబై విమానాశ్రయంలో వారం రోజులుగా ప్రయాణికులను సతాయించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, డిసెంబర్ 1 నుంచి 8 వరకు 905 విమానాలు రద్దు అయ్యాయి. 1,475 విమానాలు 30 నిమిషాలకు పైగా ఆలస్యమయ్యాయి. ఈ అంతరాయాల వల్ల సుమారు 40,789 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
డిసెంబర్ 4, 5 తేదీల్లో అయితే..
ముంబై ఎయిర్పోర్ట్లో ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఎనిమిది రోజులలో 3,171 విమానాలు నడపాల్సి ఉండగా కేవలం 2,266 మాత్రమే నడిపగలిగింది. డిసెంబర్ 4, 5 తేదీల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారింది. డిసెంబర్ 1న 14గా ఉన్న విమాన రద్దులు డిసెంబర్ 5న 295కి పెరిగాయి. ఆలస్యాలు కూడా ఎక్కువయ్యి, డిసెంబర్ 3న 281 విమానాలు గరిష్ట ఆలస్యాన్ నమోదు చేశాయి.
స్తంభించిన ప్రయాణికుల బ్యాగేజీ
అంతరాయాలు పెరుగుతూనే ఉండటంతో టెర్మినళ్లలో కార్యకలాపాలు క్రమంగా స్తంభించాయి. రద్దయిన విమానాల కారణంగా సుమారు 780 చెక్-ఇన్ బ్యాగులు ప్రయాణికులకు అందకుండా నిలిచిపోయాయి. వీటిలో 90% బ్యాగులను బుధవారం నాటికి పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.
ఎక్కువగా ప్రభావితమైన మార్గాలు ఇవే..
ముంబై నుంచి బయలుదేరే అనేక దేశీయ మార్గాలు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. ప్రధానంగా అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, కొచ్చి, గోవా, లక్నో నగరాలకు రాకపోకలు సాగించాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అంతర్జాతీయంగా ఆమ్స్టర్డామ్, ఇస్తాంబుల్ మార్గాలలో కూడా పెద్ద ఎత్తున ఆలస్యాలు, రద్దులు చోటుచేసుకున్నాయి.


