ఆలుమగల మధ్య ఆహారపుటలవాట్ల చిచ్చు..
‘ఘాటైన’ ముగింపు
ఆరోజు గుజరాత్ హైకోర్టు గది నిశ్శబ్దంగా ఉంది.. కానీ అక్కడున్న ప్రతి ఒక్కరి చెవుల్లో రెండు పేర్లే మారుమోగుతున్నాయి.. అవి ఉల్లి, వెల్లుల్లి. దశాబ్దానికి పైగా సాగిన వైవాహిక బంధం, విడాకులకు దారి తీయడానికి కారణం ఈ రెండు వంట గది పదార్థాలే అంటే ఎవరైనా నమ్ముతారా?.. వంట గదిలో మొదలైన ఈ ’ఘాటైన’ పోరు, దశాబ్దానికి పైగా సాగిన బంధానికి విడాకులతో తెరదించింది.
2002లో ఒక్కటైన ఓ జంటకు.. అప్పటి వరకూ తమ భోజన అలవాట్లలోని తేడా ఒక సమస్యగా అనిపించలేదు. భార్య స్వామినారాయణ్ భక్తురాలు కావడంతో, మత నిబంధనల ప్రకారం ఉల్లి, వెల్లుల్లిని దూరంగా ఉంచేది. కానీ, భర్త, అత్తగారు మాత్రం వాటిని యథావిధిగా తీసుకునేవారు. మెల్లగా.. ఈ ’రుచుల’ తేడా వారి బంధంలో చిచ్చు పెట్టింది. ఆలుమగల బంధంలో చీలిక తెచ్చింది. ఇంట్లో వేర్వేరుగా వంట చేసు కోవడం సర్వసాధారణమైంది. దాంతో ఆ ఇంట్లో ఆనందానికి బదులు అశాంతి పెరగడం మొదలైంది. అది ఉద్రిక్తతకు దారితీయడంతో భార్య బిడ్డను తీసుకుని అత్తారింటిని వీడింది.
2013లో భర్త ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేస్తూ, ఆమె రాజీ పడకపోవడం క్రూరత్వమని వాదించాడు. సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత, 2024లో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. భర్త భార్యకు భరణం చెల్లించాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ భార్య గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టులో జరిగిన విచారణలో భార్య తరపు న్యాయవాది వాదిస్తూ.. మతపరమైన ఆహార నియమాలను భర్త పట్టించుకోకుండా, వాటి ప్రభావాన్ని పెంచి చూపారని వాదించారు. కాగా, తాము, తమ తల్లి ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఉల్లి, వెల్లుల్లి లేని వంటలు వండి పెట్టినా.. ఆమె వైఖరి మారలేదని, అందుకే సమస్య కొనసాగిందని భర్త వివరించారు. ఒకానొక దశలో ఉద్రిక్తత కారణంగా ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశానని తెలిపారు.
ఇదీ చదవండి: పెళ్లి వేడుకలో అపశృతి : ఒక్కసారిగా కూలిన పైకప్పు
పదకొండేళ్ల బంధానికి బీటలు
ఒక చిన్న ఆహారపు అలవాటు..వ్యక్తిగత నమ్మకంగా మొదలై, రెండు కుటుంబాలను విడదీసింది. చివరికి, దశాబ్దానికి పైగా సాగిన బంధం.. శూన్యమైన అంగీకారంతో ముగిసింది. ఆ రోజు కోర్టు గదిలో ఒక్కసారిగా ఉద్వేగం అలముకుంది. అర్థంపర్థం లేని పోరాటంతో ఇద్దరు దంపతులు కోల్పోయిన 11 ఏళ్ల విలువైన జీవితం.. అక్కడున్న వారి మనసుల్ని భారంగా మార్చింది.
విడాకులకు సరే..
అయితే, హైకోర్టులో వాదనల సందర్భంగా భార్య అనూహ్యనిర్ణయం తీసుకుంది. తాను విడాకులను వ్యతిరేకించడం లేదని కోర్టుకు తెలియజేసింది. దాంతో భర్త కూడా..చెల్లించాల్సిన భరణం మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో.. కోర్టులో జమ చేయడానికి అంగీకరించారు. దంపతుల మధ్య పరస్పర అంగీకారం కుదరడంతో, హైకోర్టు భార్య పిటిషన్‌ను కొట్టివేసింది.ఫ్యామిలీ కోర్టిచ్చిన విడాకుల ఉత్తర్వును సమర్థించింది.
– సాక్షి, నేషనల్ డెస్క్


