నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైలు స్టేషన్
2027 ఆగస్టులో తొలి హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ ట్రయల్ రన్
అధునాతన సౌకర్యాలతో సబర్మతిలో మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు హబ్
గుజరాత్ నుంచి సాక్షి ప్రతినిధి: అహ్మదాబాద్–ముంబై మధ్య భారతదేశంలో మొదటి హై స్పీడ్ రైల్ (బుల్లెట్ ట్రైన్) ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల మధ్య 508 కిలోమీటర్ల (మహారాష్ట్రలో 156 కి.మీ, గుజరాత్‌లో 352 కి.మీ) దూరాన్ని కేవలం 2 గంటల్లో పూర్తిచేయడానికి ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2027 ఆగస్టులో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ – బిలిమోరా మధ్య సుమారు 50 కి.మీ దూరంలో ఈ రైలుకు ట్రయల్ రన్ చేపట్టనున్నట్టు నేషనల్ హై–స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అహ్మదాబాద్ ప్రిన్సిపల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ రాజేష్ అగర్వాల్ సోమవారం ‘సాక్షి’కి వివరించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 2017 సెపె్టంబర్ 14న ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబేలు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. డిజైన్ స్పీడ్ గంటకు 350 కి.మీ కాగా ఆపరేటింగ్ స్పీడ్ గంటకు 320 కి.మీ ఉంటుంది. ఆధునిక డిజైన్, మల్టి–మోడల్ ఇంటిగ్రేషన్ (మెట్రో, బస్సు, రైలు, బుల్లెట్ రైలు ప్రయాణాలను అనుసంధానించే) అధునాతన వసతులతో 12 స్టేషన్లు నిర్మీస్తున్నారు. సబర్మతిలో మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌ను భారీ ఎత్తున నిర్మీంచారు.
వచ్చే ఏడాది ఇక్కడ వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి. తొమ్మిది అంతస్తుల్లో నిర్మీంచిన ఈ హబ్‌లో షాపింగ్ కాంప్లెక్స్, వివిధ ఆఫీసులతో ప్రయాణికులకు విందు, వినోదాలకు సకల వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ హబ్ నిర్మాణం పూర్తయింది. హెరిటేజ్ సిటీ అహ్మదాబాద్ సంస్కృతి, దేశ చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా హబ్‌ను డిజైన్ చేశారు.


