విరిగిన చక్రం.. ఆగిన రైలు | Wheel failure on Hisar Express near Jammikunta: Telangana | Sakshi
Sakshi News home page

విరిగిన చక్రం.. ఆగిన రైలు

Mar 6 2026 6:17 AM | Updated on Mar 6 2026 6:17 AM

Wheel failure on Hisar Express near Jammikunta: Telangana

విరిగిన హిస్సార్‌ సూపర్‌ఫాస్ట్‌ రైలు చక్రం 

లోకోపైలట్‌ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం 

7 గంటల పాటు ప్రయాణికుల పాట్లు 

జమ్మికుంట/కమలాపూర్‌: సికింద్రాబాద్‌ నుంచి హిస్సార్‌కు వెళ్తున్న హిస్సార్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (22737) ఇంజిన్‌ చక్రం హఠాత్తుగా విరిగిపోయింది. లోకో పైలట్‌ వెంటనే అప్రమత్తంగా వ్యవహరించి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. బుధవారం అర్ధరాత్రి కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామ సమీపంలో జరిగిన ఈ సంఘటనపై స్థానికులు, రైల్వే అధికారులు తెలిపిన వివరాలివి. సికింద్రాబాద్‌ జంక్షన్‌లో బుధవారం రాత్రి బయల్దేరిన హిస్సార్‌ ఎక్స్‌ప్రెస్‌.. జమ్మికుంట, ఉప్పల్‌ రైల్వేస్టేషన్ల మధ్య గల జమ్మికుంట మండలం మడిపల్లి సమీపంలోని నంబరు 18 గేట్‌ వద్దకు చేరుకుంది.

ఇక్కడ ఇటీవల నిర్మించిన మూడోలైన్‌లో రైలు వెళ్తోంది. వేకువజాము 2.30 గంటల ప్రాంతంలో  ఒక్కసారిగా రైలింజిన్‌ చక్రం విరిగినట్లు శబ్దం వచి్చంది. దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్‌ సడన్‌బ్రేక్‌ వేసి రైలు నిలిపి వేశారు. రైలు కుదుపునకు గురవడంతో ఏమైందో తెలియక ప్రయాణికులు కాస్త ఆందోళనకు గురయ్యారు. ఆ వెంటనే లోకోపైలట్‌ రైల్వే అధికారులకు సమాచారం అందించారు.

వారు మరో రైలింజిన్‌లో అదేలైన్‌లో వచ్చి వెనకాల ఉన్న బోగీలను ఉప్పల్‌ రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇంజనీర్లు రైలింజిన్‌ చక్రానికి మరమ్మతులు చేసి జమ్మికుంట వైపు తీసుకెళ్లారు. ఈ సమయంలోనే వస్తున్న దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఉప్పల్‌ వద్ద నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం గురువారం ఉదయం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. కాగా వేకువజాము 2.30 గంటల నుంచి సుమారు 7 గంటల పాటు హిస్సార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement