ఇక ఈ–ఆఫీస్‌ పాలనే | Finance Department orders to manage files in OFMS system: Telangana | Sakshi
Sakshi News home page

ఇక ఈ–ఆఫీస్‌ పాలనే

Mar 6 2026 6:09 AM | Updated on Mar 6 2026 6:09 AM

Finance Department orders to manage files in OFMS system: Telangana

ఓఎఫ్‌ఎంఎస్‌ విధానంలోనే ఫైళ్ల నిర్వహణకు ఆర్థిక శాఖ ఆదేశం 

ఈ నెల 15 నుంచి నూరు శాతం అమలు చేయాలని ఉత్తర్వులు 

మాన్యువల్‌ ఫైళ్లను ఆమోదించబోమని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై పరిపాలన అంతా నూరు శాతం ఆన్‌లైన్‌ ఫైల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఓఎఫ్‌ఎంఎస్‌) ద్వారానే కొనసాగనుంది. ఈ నెల 15 నుంచి ఓఎఫ్‌ఎంఎస్‌ విధానంలోనే పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మాన్యువల్‌ పద్ధతిలో వచ్చే ఫైళ్లను ఎట్టిపరిస్థితిలోనూ ఆమోదించబోమని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రాయి రవి అన్ని శాఖలకు మెమో జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తుండగా ఆర్థిక శాఖ కూడా యుద్ధప్రాతిపదికన అమలుకు నిర్ణయించింది. తాజా ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ పూర్తిస్థాయిలో ఈ–ఆఫీస్‌లుగా అవతరించనున్నాయి. 

ప్రతి ఉద్యోగికి ప్రత్యేక లాగిన్‌...: రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం కాగితాలతో కూడిన ఫైళ్లను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కార్యాలయాల్లో కొన్నింటిని డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకువచి్చనప్పటికీ అర్జీలతో కూడిన వాటిని కాగితాల్లోనే నిర్వహిస్తున్నారు. కానీ ఇకపై కాగితాలతో కూడిన ఫైళ్లకు తప్పనిసరిగా స్వస్తి పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు ప్రతి అంశం ఆర్థికశాఖతో ముడిపడి ఉండటంతో ఫైళ్ల నిర్వహణ ఆన్‌లైన్‌ ఫైల్‌ మేనేజ్‌మెంట్‌ విధానంలోకి మార్పు చేయాల్సిందే. ప్రజల నుంచి లేదా ఉద్యోగుల నుంచి వచ్చే వినతులు కాగితాల్లో వస్తే వాటిని వెంటనే స్కాన్‌ చేసి డిజిటల్‌ రూపంలోకి మార్చాకే ఫైలును ప్రాసెస్‌ చేయాల్సి ఉంటుంది. 

ఎఫ్‌ఎంఎస్‌ విధానంలో భాగంగా శాఖలవారీగా ప్రతి ఉద్యోగికి త్వరలో ప్రత్యేకంగా లాగిన్‌ ఐడీలను కేటాయించనున్నారు. ఆన్‌లైన్‌ విధానం ద్వారా ఫైళ్ల నిర్వహణ సమయం తగ్గడంతోపాటు పారదర్శకత పెరగనుంది. ఒకవేళ ఫైలు నిర్వహణలో జాప్యం జరిగినా ఉన్నతాధికారులకు తెలియడంతోపాటు కారణాలను తెలుసుకొని చర్యలు తీసుకొనే వీలుంటుందని.. ఫలితంగా జవాబుదారీతనం మరింత మెరుగవుతుందని సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement