గణపతి కుమారుడి పేరిట ఆడియో వైరల్
యువతరానికి మార్గనిర్దేశనం చేసేందుకు రావాలంటూ భావోద్వేగం
మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు వార్తల సమయంలో ఆడియో రావడంపై చర్చ
సాక్షి, హైదరాబాద్/జగిత్యాల: ‘తండ్రి ప్రేమ తెలిసిన వాని మాటలు ఒకలా ఉంటాయి. తెలియని వాని మాటలు మరోలా ఉంటాయి. కానీ తండ్రి కోసం ఎదురు చూసే నాలాంటి వాని భావాలు ఎలా ఉంటాయి? మనం కలిసి ఉంటే బహుశా ‘నాన్నా’అని ఇప్పటికి కొన్ని లక్షల సార్లు మిమ్మల్ని పిలిచి ఉండేవాడిని. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని ‘నాన్నా..’అని సంబోధిస్తూ మొదలు పెడుతున్నాను..’అంటూ గణపతి కుమారుడు శ్రీనివాసరావు పేరిట ఓ ఆడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగుబాటుపై చర్చ జరుగుతున్న సమయంలో ఇలా ఆడియో విడుదల కావడం చర్చకు దారి తీసింది. ఎంతో భావోద్వేగంతో 4.18 నిమిషాల నిడివితో ఉన్న ఈ ఆడియోలో అనేక విషయాలు ప్రస్తావించారు. ఒకప్పటి పరిస్థితులతో పోలి్చతే ఇప్పటి పరిస్థితులకు చాలా మార్పే ఉందని, నేటి తరానికి మార్గనిర్దేశనం చేసేందుకు రావాలంటూ తన అభిలాషను బయటపెట్టారు. కాగా ఈ ఆడియో గణపతి కుమారుడిదేనని ఓ పోలీస్ ఉన్నతాధికారి నిర్ధారించారు. ఆ ఆడియోలో ఏముందంటే..
అమ్మ కన్నీటితో ఎన్ని మెత్తలు తడిచిపోయాయో..
ప్రతి కుటుంబం చిరునవ్వు వెనక కనబడని ఒక గొప్ప తండ్రి కష్టం దాగి ఉంటుందని పెరిగే కొద్దీ అర్థమైంది. ఆ విషయంలో నాకు తండ్రి లేని లోటును తెలియకుండా అన్నీ తానై పెంచింది నన్ను కన్నతల్లి. అమ్మా నీకు వందనం. మీరు ఎంచుకున్న గమ్యం వైపు అడుగులు వేస్తూ అజ్ఞాన జీవితం ప్రారంభించాక అమ్మ కన్నీటితో ఎన్ని మెత్తలు తడిచిపోయాయో తెలియదు. ఏ బట్ట కట్టిందో.. ఏ తిండి తిన్నదో కూడా ఎవరికీ తెలియదు.
సమాజానికి ఎదురుపడలేక ఇంటి గడప దాటలేదు. నన్ను పెంచుకుంటూ తన బాధను మరిచింది. నాకు తెలిసి అమ్మ పుట్టినప్పటి నుంచి ఏ సుఖమూ అనుభవించలేదు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా తన ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడుతూనే ఉంది. నాన్నా మీరు ఎంచుకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నించడం లేదు. మంచో, చెడో మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేయడం అంటే అది ఆత్మార్పణమే..
ఇది నా అభిలాష
ఓ మారుమూల గ్రామంలో ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మీరు మీకున్న మేధాశక్తితో పన్నెండు రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించి, మీ బంధాల్లో సేవ చేస్తూ మావోయిజం అంటే గణపతి, గణపతి అంటే మావోయిస్టు అనేంతగా ఎదిగి సమాంతర ప్రభుత్వం నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. సమాజంలో అంతర్గతంగా సమస్యలు చాలానే ఉండవచ్చు. కానీ నేటితరం ఎంతో అవగాహనతో ఉంటూ సామాజిక మార్పులకు అనుగుణంగా ప్రపంచంతో అనుసంధానమై ఉంటున్నారు.
నేటి తరం యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీవంటి వారి విజ్ఞానం, అనుభవం మార్గదర్శకాలుగా తోడైతే మన దేశం అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ఓ కొత్త నవభారతాన్ని నిర్మిస్తారని నా నమ్మకం. మీకు చెప్పగలిగే స్థానంలో నేను లేకపోవచ్చు. కానీ ఇది నా అభిలాష.


