ఏదుల రిజర్వాయర్ నీటిమట్టం 440 మీటర్లు ఉంటేనే డిండి, పాలమూరుకు నీళ్లు
నీటిపారుదల శాఖ ఈఎన్సీ నేతృత్వంలోని కమిటీ సిఫారసు
ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతల నుంచి అభ్యంతరాలు
ఏదులలో 436 మీటర్ల నుంచి నీటి తరలింపునకు గతంలో డిండికి అనుమతి
సాక్షి, హైదరాబాద్: ఏదుల రిజర్వాయర్‌లో నీటిమట్టం కనీసం 440 మీటర్లు ఉన్నప్పుడే డిండి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు నీటిని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ సిఫారసు చేసింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుంచే డిండి ఎత్తిపోతల పథకానికి సైతం నీటిని తరలించడానికి అనుమతిస్తూ గతేడాది జనవరి 22న నీటిపారుదల శాఖ జీఓ 10 జారీ చేసింది.
ఏదుల రిజర్వాయర్‌లో 336 మీటర్లు నీటిమట్టం నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించడానికి పనులు చేపట్టాలని అప్పట్లో కోరింది. గత నెల 6న నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) నేతృత్వంలోని కమిటీ డిండి ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
నిల్వలు 440 మీటర్లు ఉంటేనే...
ఏదుల రిజర్వాయర్‌లో కనీసం 437.375 మీటర్ల నీటి మట్టం ఉంటేనే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నుంచి వీరాంజనేయ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని తరలించాలని గతంలో అనుమతులిచ్చారు. ఏదుల జలాశయ గరిష్ట నీటినిల్వ మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) 445 మీటర్లు కాగా, గరిష్ట నిల్వ సామర్థ్యం 6.59 టీఎంసీలు. జలాశయంలో 440 మీటర్ల మట్టంతో 4.16 టీఎంసీలు, 437 మీటర్ల మట్టంతో 3.04 టీఎంసీల నిల్వలు, 436 మీటర్ల మట్టంతో 2.72 టీఎంసీల నిల్వలు ఉంటాయి.
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించడానికి నిర్మిస్తున్న కాల్వ అడుగు (బెడ్ లెవల్) 21.643 కి.మీ.ల వద్ద 421.45 మీటర్ల మట్టాన్ని కలిగి ఉండగా, ప్రతిపాదనల ప్రకారం ఏదులలో 436.41 మీటర్ల మట్టం నుంచి నీటిని తరలించాల్సి ఉంది. డిండి ఎత్తిపోతలకు నీటిని తరలించడానికి ఏదుల రిజర్వాయర్‌లో ఉండాల్సిన నీటిమట్టం, డిండి ప్రాజెక్టు కాల్వ లోతు మధ్య 4.9 మీటర్ల వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో డిండి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలించడానికి ఏదుల రిజర్వాయర్‌లో ఉండాల్సిన కనీస నిల్వ మట్టాన్ని 440 మీటర్లకు పెంచాలని ఈఎన్సీ(జనరల్) నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
ఏదుల రిజర్వాయర్‌ను 440 మీటర్లకు నింపడానికి కేవలం 2 రోజులే పడుతుందని, దీని వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేసింది. ఏదులలో 440 మీటర్ల స్థాయిలో నిల్వలున్నప్పుడే డిండి, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని సూచించింది. ఈ మేరకు రెండు ప్రాజెక్టుల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరింది. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున మొత్తం 90 టీఎంసీలను తరలించడానికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మిస్తుండగా, రోజుకు 0.5 టీఎంసీల చొప్పున మొత్తం 30 టీఎంసీలను తరలించుకోవడానికి డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు.
డిండి ఎత్తిపోతల పథకం ద్వారా నాగర్‌కర్నూల్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని 21 మండలాల పరిధిలో 3.61 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు. ఏదుల రిజర్వాయర్ నీటిమట్టం 440 మీటర్లకు చేరినప్పుడే డిండి ఎత్తిపోతలకు నీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినట్టు మునుగోడు కాంగ్రెస్ నేత ఐలయ్య ‘సాక్షి’కి తెలిపారు.


