వేదిక మారిన హార్దిక్ పాండ్యా మ్యాచ్
సాక్షి, హైదరాబాద్: భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా జట్టు తరఫున ఆడుతున్నాడు. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అతని మెరుపు ప్రదర్శనను అభిమానులు ప్రత్యక్షంగా చూశారు. షెడ్యూల్ ప్రకారం గురువారం సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో జరిగే మ్యాచ్‌లో గుజరాత్‌తో బరోడా తలపడాల్సి ఉంది.
అయితే నగరం మధ్యన కీలక ప్రాంతంలో మైదానం ఉండటం... ఫెన్సింగ్ మినహా తగిన భద్రతా ఏర్పాట్లు లేని జింఖానా మైదానంలో మ్యాచ్‌పై పోలీసులు సందేహం వ్యక్తం చేశారు. పాండ్యా ఆట కోసం జనం ఎగబడితే వారిని నిలువరించడం కష్టం కావడంతో పాటు పరిస్థితి పూర్తిగా చేయి దాటే ప్రమాదం ఉండటంతో ఇదే విషయాన్ని బుధవారం రాత్రి హెచ్‌సీఏ అధికారులకు తెలియజేశారు. ఏదైనా అనుకోనిది జరిగితే హెచ్‌సీఏను పూర్తిగా బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. దాంతో ఈ మ్యాచ్‌ను మెరుగైన సౌకర్యాలు ఉన్న ఉప్పల్ స్టేడియానికి మార్చాల్సి వచ్చింది.
ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన బెంగాల్, సర్వీసెస్ మ్యాచ్‌ను జింఖానా మైదానంలో నిర్వహించారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బరోడా 8 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా గుజరాత్ 14.1 ఓవర్లలో 73 పరుగులకు ఆలౌటైంది. హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. అనంతరం బరోడా 6.4 ఓవర్లలో 2 వికెట్లకు 74 పరుగులు చేసి నెగ్గింది. హార్దిక్ పాండ్యా 6 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి అవుటయ్యాడు.
షమీకి 4 వికెట్లు: సర్వీసెస్‌పై బెంగాల్ గెలుపు
జింఖానా మైదానంలో సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది. సర్వీసెస్ 18.2 ఓవర్లలో 165 పరుగులకుఆలౌటైంది. బెంగాల్ జట్టుకు ఆడుతున్న భారత పేసర్లు షమీ 3.2 ఓవర్లలో 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... ఆకాశ్‌దీప్ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.
అనంతరం బెంగాల్ 15.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి నెగ్గింది. అభిషేక్ పొరెల్ (56; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), అభిమన్యు ఈశ్వరన్ (58; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేసి బెంగాల్ విజయంలో కీలకపాత్ర పోషించారు.


