ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో షమీ ప్రదర్శనలు..
బరోడాపై 4-0-31-1
గుజరాత్‌పై 3.3-0-31-2
పంజాబ్‌పై 4-0-61-1
హిమాచల్ ప్రదేశ్‌పై 4-0-31-1
సర్వీసెస్‌పై 3.2-0-13-4
పుదుచ్చేరిపై 4-0-34-3
ఇవాళ (డిసెంబర్ 8) హర్యానాపై 4-0-30-4
భారత క్రికెట్‌లో షమీ ఉదంతం ఇటీవలికాలంలో తరుచూ హాట్ టాపిక్‌గా మారుతుంది. అతను దేశవాలీ క్రికెట్‌లో రాణిస్తున్నా.. అతని అనుభవం టీమిండియాకు అవసరమైనా, సెలెక్టర్లు ఫిట్‌నెస్, ఇతరత్రా కారణాలు చెప్పి అవకాశాలు ఇవ్వడం లేదు.
షమీని పక్కకు పెట్టడానికి పై కారణాలు కాకుండా చర్చించుకోలేని వేరే కారణముందన్నది చాలా మందికి తెలుసు. అయినా ఎవరూ నోరు విప్పే సాహసం చేయలేరు. ఓ ఆటగాడి కెరీర్‌ను ఆటతో ముడిపెట్టకూడని విషయాల పేర్లు చెప్పి నాశనం చేయడం సమంజసం కాదని కొన్ని గొంతులకు వినిపిస్తున్నా, వాటిని పట్టించుకునే నాథుడు లేడు.
ఆటగాడిగా షమీకి అన్యాయం జరుగుతున్న విషయం బహిరంగ రహస్యమే అయినప్పటికీ.. భారత సెలెక్టర్ల వద్ద మాత్రం దాన్ని సమర్దించుకునేందుకు చాలా కారణాలు ఉన్నాయి.
సెలెక్టర్లు చెబుతున్న కారణాల్లో ప్రధానమైంది షమీ ఫిట్‌గా లేడని. వాస్తవానికి వారి ఈ సమర్దనలో అర్దమే లేదు. ఒకవేళ షమీ నిజంగా ఫిట్‌గా లేకపోతే దేశవాలీ టోర్నీల్లో ఎలా అనుమతిస్తారు. అనుమతించినా.. నిజంగా ఫిట్‌గా లేకపోతే అతనెలా రాణించలడు.
ఈ ఒక్క విషయం చాలు సెలెక్టర్లు వేరే ఏదో కారణం చేత షమీని టీమిండియాను ఎంపిక చేయడం లేదన్న విషయం అర్దం అవడానికి. సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటనకు కొద్ది గంటల ముందే షమీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన చేశాడు.
వాస్తవానికి షమీ కాకుండా వేరే ఏ బౌలర్ అయినా అలాంటి ప్రదర్శన చేసుంటే ఖచ్చితంగా టీమిండియాలో చోటు దక్కేది. కానీ అక్కడుంది షమీ కాబట్టి అలా జరగలేదు. అలాంటి ప్రదర్శనలు మరిన్ని పునరావృతం చేసినా షమీకి ఇప్పట్లో టీమిండియాలో చోటు దక్కదు. కారణం బహిరంగ రహస్యమే.
షమీని టీమిండియాకు ఎంపిక చేయకపోవడానికి సెలెక్టర్లు చూపిస్తున్న రెండో ప్రధాన కారణం వయసు. ప్రస్తుతం షమీ వయసు 35. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ వయసు దాటిన తర్వాత కూడా సంచలన ప్రదర్శనలు చేసిన పేసర్లు చాలామంది ఉన్నారు.
ఇంగ్లండ్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ ఇందుకు ప్రధాన ఉదాహరణ. ఆండర్సన్ 40 ఏళ్ల వయసులోనూ ఏం చేశాడో జగమంతా చూసింది. అలాంటిది షమీకి 35 ఏళ్లకే వయసైపోయిందనడం ఎంత వరకు సమంజసం.
వయసైపోయిన వాడికి అంతర్జాతీయ క్రికెట్ అయినా, దేశవాలీ క్రికెట్ అయినా ఒకటే కదా. దేశవాలీ క్రికెట్‌లో వయసైపోయినా రాణిస్తున్నవాడు, అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించలేడా..? ఏదో కారణం చెప్పాలని ఇలాంటి పొంతనలేని కారణాలు చెబుతున్నారు కానీ, అసలు కారణం వేరన్న విషయం చాలామందికి తెలుసు.
షమీని టీమిండియాకు ఎంపిక చేయకపోవడానికి సెలెక్టర్లు చెబుతున్న మరో కారణం యువకులకు అవకాశాలు ఇవ్వడం. వాస్తవానికి యువకులకు అవకాశాలు ఇస్తే ఎవ్వరూ కాదనరు. జట్టులో సీనియర్లు తురుచూ విఫలమవుతున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలకు పోవాలి.
అయితే ఇక్కడ పరిస్థితి వేరు. కావాలని షమీని పక్కకు పెట్టడానికి అనర్హమైన, టీమిండియాలో పెద్ద తలకాయ అండదండలున్న ఓ పేసర్‌ను యువత పేరుతో ఫ్రేమ్‌లోకి తెచ్చారు. అతని కంటే చిన్నవాడు, అతని కంటే వెయ్యి రెట్లు ఎక్కువ టాలెంట్ ఉన్నా మరో పేసర్‌కు మాత్రం అవకాశాలు ఇవ్వరు.
పెద్దల అండదండలున్న పేసర్ ఎన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనా, మళ్లీమళ్లీ తుది జట్టులో ప్రత్యక్షమవుతుంటాడు. వాస్తవానికి ఆటగాళ్ల శారీరక కదలికలు, ఫిట్‌నెస్, ఫామ్‌ను బట్టి వయసు ప్రస్తావన వస్తుంది. ఈ మూడు బాగుంటే వయసుతో పనేముంది. పై మూడు అంశాల్లో షమీ పర్ఫెక్ట్‌గా ఉన్నా వయసు పేరు చెప్పి టీమిండియాకు ఎంపిక చేయకపోవడం ఎంత వరకు సమంజసం.
ఇన్ని కారణాలు చెప్పి షమీని టీమిండియాకు ఎంపిక చేయకున్న సెలెక్టర్లు అంతిమంగా ఒక్క విషయం ఆలోచించాలి. షమీ స్థానంలో అతనిలా రాణిస్తున్న ఎవరినైనా ఎంపిక చేయకపోతే నష్టపోయే భారత జట్టే. అర్హులు జాతీయ జట్టులో లేకపోతే దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయి.
షమీ లాంటి ఉదంతాలు జరగడం భారత క్రికెట్‌కు మాయని మచ్చగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే హర్భజన్ సింగ్, ఛతేశ్వర్ పుజారా లాంటి టీమిండియా మాజీలు షమీకి మద్దతుగా గళం విప్పారు. షమీ చేసిన నేరం ఏంటని బహిరంగంగా ప్రశ్నించారు. భారత సెలెక్టర్లు ఇకనైనా పంతాలు పక్కకు పెడితే భారత క్రికెట్‌కు మరింత మేలు జరిగే అవకాశం ఉంది.


