దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ చేసి టీమిండియా మేనేజ్‌మెంట్‌కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడటంతో ఆ స్థానాన్ని తాత్కాలికంగా భర్తీ చేసేందుకు జట్టులోకి వచ్చిన జైస్వాల్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కెప్టెన్‌నే పోటీదారుగా మారాడు. ఇప్పటికే జట్టు కూర్పు విషయంలో తలలు పట్టుకున్న భారత మేనేజ్‌మెంట్‌కు జైస్వాల్ మరో సమస్యగా మారాడు.
గిల్ వస్తే పరిస్థితి ఏంటన్నది ఎవరికీ అర్దం కావట్లేదు. కెప్టెన్ కోసం జైస్వాల్‌ను తప్పిస్తారా లేక కెప్టెన్‌నే పక్కకు కూర్చోబెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గిల్ రూపేనా జైస్వాల్‌కు అన్యాయం జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. విజయవంతమైన రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ ప్రకారం రోహిత్తో పాటు జైస్వాల్కు అవకామివ్వాలి. అయితే కెప్టెన్ అయిన కారణంగా మేనేజ్మెంట్ గిల్‌వైపే మొగ్గు చూపుతుంది.
అలాగనీ గిల్ను అత్యుత్తమ వన్డే బ్యాటర్ కాదని అనలేం. గిల్ ఈ ఫార్మాట్లో చాలా అద్భుతంగా ఆడతాడు. అతనితో సమానంగా జైస్వాల్ కూడా ఆడతాడు. సాధారణంగా ఏ జట్టైన రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కోసం చూస్తుంది. ఈ కోటాలో జైస్వాల్కే అవకాశాలు రావాలి. కానీ కెప్టెన్ కావడంతో జైస్వాల్పై వివక్ష తప్పలేదు. పోనీ జైస్వాల్ను కానీ గిల్ను కానీ మిడిలార్డర్లో ఆడిద్దాదా అంటే, ఆ ఛాన్సే లేదు. మిడిలార్డర్లో బెర్త్‌ల కోసం ఇప్పటికే పదుల సంఖ్యలో పోటీ ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో జైస్వాల్ సెంచరీ చేసి మేనేజ్మెంట్ను ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలోకి నెట్టాడు. పక్షపాతాలకు పోకుండా ఉంటే సెంచరీ చేశాడు కాబట్టి జైస్వాల్కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. జైస్వాల్ క్రమంగా రాణిస్తే మాత్రం గిల్ వన్డేల నుంచి బ్రేక్ తీసుకోవాలి. రోహిత్ శర్మ రిటైరయ్యే వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. రోహిత్ చూస్తే 2027 వరకు తగ్గేదేలేదంటున్నాడు. తదుపరి వన్డే సిరీస్ సమయానికి మేనేజ్మెంట్ ఏం చేస్తుందో చూడాలి.
వన్డే ఫార్మాట్లో గిల్ ప్రస్తుత పరిస్థితి ఇది. ఈ పంజాబీ కుర్రాడికి టీ20 ఫార్మాట్లోనూ పరిస్థితి అంత మెరుగ్గా లేదు. ఏదో, లాబీయింగ్ జరిగి వైస్ కెప్టెన్ అయ్యాడే కానీ ఈ ఫార్మాట్ జట్టులో స్థానానికి అతడు అర్హుడే కాదు. అతను ఆడితే ఓపెనర్గా ఆడాలి. లేదంటే లేదు. ఈ ఫార్మాట్లో గిల్కు అవకాశం ఇవ్వడం కోసం మేనేజ్మెంట్ ఇద్దరిని బలిపశువులను చేస్తుంది.
ఈ ఫార్మాట్లో రోహిత్ శర్మ రిటైరయ్యాక ఓ ఓపెనింగ్ స్థానాన్ని అభిషేక్ శర్మ భర్తీ చేశాడు. గత కొద్ది కాలంగా మరో ఓపెనింగ్ బెర్త్‌కు సంజూ శాంసన్ న్యాయం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో గిల్కు ఆఘమేఘాల మీద వైస్ కెప్టెన్సీ కట్టబెట్టి జట్టులో స్థానం కల్పిస్తున్నారు.
దీని వల్ల సంజూ మిడిలార్డర్కు వెళ్లాల్సి వస్తుంది. వైస్ కెప్టెన్ కోటాలో గిల్కు ఓపెనింగ్ స్థానాన్ని కట్టబెట్టినా ఏమైనా న్యాయం చేయగలుగుతున్నాడా అంటే అదీ లేదు. వరుస అవకాశాలను వృధా చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో గిల్ను టీ20 జట్టు నుంచి తప్పించాలని మేనేజ్మెంట్పై ఒత్తిడి ఎక్కువైంది. త్వరలో ఈ ఫార్మాట్లో అతను స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది.
వన్డేలు చూస్తే అలా. టీ20లు చూస్తే ఇలా. ఇక గిల్ స్థానం పదిలంగా ఉండేది టెస్ట్ల్లో మాత్రమే. ఈ ఫార్మాట్ నుంచి కూడా రోహిత్ రిటైర్ కావడంతో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్లో గిల్-జైస్వాల్ టెన్షన్ లేకుండా ఆడుకుంటున్నారు.
వన్డేల్లో జైస్వాల్.. టీ20ల్లో సంజూ (అవకాశాలు వచ్చి ఓపెనర్గా) క్రమంగా రాణిస్తూ ఉంటే గిల్ వన్డేల్లో కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు టీ20ల్లో స్థానం గల్లంతై, టెస్ట్లకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.


