సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు ఐసీసీ టీమిండియాకు ఝలక్ ఇచ్చింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 3న రాయపూర్‌లో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్‌రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ భారత ఆటగాళ్లకు జరిమానా విధించింది. ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లు నిర్దేశిత సమయంలోగా 2 ఓవర్లు వెనుకపడ్డారు. దీంతో ఓవర్‌కు 5 శాతం చొప్పున, రెండు ఓవర్లకు 10 శాతం మ్యాచ్ ఫీజ్‌ను టీమిండియాకు జరిమానాగా విధించారు.
ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఈ శిక్షను ఖరారు చేశారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఆర్టికల్ 2.22 ప్రకారం, ప్రతి ఓవర్ ఆలస్యానికి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధిస్తారు. ఈ జరిమానాను భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ స్వీకరించాడు. దీంతో ఫార్మల్ హియరింగ్ అవసరం లేకుండా కేసు ముగిసింది.
ఆ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా విజయవంతంగా ఛేదించి, సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అనంతరం విశాఖపట్నంలో జరిగిన నిర్ణయాత్మక వన్డేలో భారత్ విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఇదిలా ఉంటే, రేపటి నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లోని మిగతా టీ20లు డిసెంబర్ 11, 14, 17, 19 తేదీల్లో ముల్లాన్‌పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికలుగా జరుగనున్నాయి.
సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..
శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్


