స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్‌కు ట్రిపుల్ షాక్ తగిలింది. డిసెంబర్ 10 నుంచి వెల్లింగ్టన్ వేదికగా జరుగబోయే రెండో టెస్ట్‌కు ముందు ఏకంగా ముగ్గురు స్టార్ బౌలర్లు గాయపడ్డారు.
మ్యాట్ హెన్రీ కాఫ్ ఇంజ్యూరితో, నాథన్ స్మిత్ సైడ్ స్ట్రెయిన్‌తో, మిచెల్ సాంట్నర్ గ్రోయిన్ ఇంజ్యూరితో మిగతా రెండు టెస్ట్‌లకు దూరమయ్యారు. వీరి స్థానాల్లో ఆల్‌రౌండర్ క్రిస్టియన్ క్లార్క్, ఫాస్ట్ బౌలర్ మైఖేల్ రే, గ్లెన్ ఫిలిప్ జట్టులోకి వచ్చారు.
స్మిత్, హెన్రీ తొలి టెస్ట్ సందర్భంగా గాయపడగా.. సాంట్నర్ ఇదే గాయం కారణంగా తొలి టెస్ట్‌కు కూడా దూరంగా ఉన్నాడు. పై ముగ్గురితో పాటు కొత్తగా మరో ఎంపిక కూడా జరిగింది. తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన టామ్ బ్లండెల్‌కు కవర్‌గా మిచ్ హేను కూడా జట్టులోకి తీసుకున్నారు.
కాగా, క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. విండీస్ బ్యాటర్లు అసమాన పోరాటపటిమతో 531 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నారు.
షాయ్ హోప్ సూపర్ సెంచరీ (140).. జస్టిన్ గ్రీవ్స్ అజేయ డబుల్ సెంచరీ (202).. కీమర్ రోచ్ (233 బంతుల్లో 58 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో విండీస్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లారు.
72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గెలుపు అంచులకు వెళ్లిందంటే, ఈ విండీస్ యోధుల పోరాటం ఎలా సాగిందో అర్దం చేసుకోవచ్చు. అంత భారీ లక్ష్య ఛేదనలో విండీస్ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా ఏకంగా 163.3 ఓవర్లు ఎదుర్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదు.
చేతిలో 4 వికెట్లు ఉండి, గెలుపుకు 74 పరుగుల దూరంలో ఉన్న సమయంలో (457/6), ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఈ మ్యాచ్ డ్రాగా ప్రకటించారు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా పరోక్షంగా విండీస్ గెలిచినట్లే. విండీస్ యెధుల పోరాటాన్ని యావత్ క్రికెట్ ప్రపంచం కీర్తించింది.


