వెస్టిండీస్ క్రికెట్ జట్టు చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేసింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ అసాధారణ పోరాటపటిమ ప్రదర్శించింది. చేతిలో 4 వికెట్లు ఉండి, గెలుపుకు 74 పరుగుల దూరంలో ఉన్న సమయంలో (457/6), ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో డ్రాతో సరిపెట్టుకుంది.
ఆట చివరి రోజు జస్టిన్ గ్రీవ్స్ అజేయ డబుల్ సెంచరీతో (202).. కీమర్ రోచ్ (233 బంతుల్లో 58 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో వీరిచిత పోరాటాన్ని చేశారు. ముఖ్యంగా గ్రీవ్స్ చేసిన పోరాటం టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ పోరాటాల్లో ఒకటిగా మిగిలిపోనుంది. తిమ్మిర్లతో బాధపడుతూ గ్రీవ్స్ ఆడిన ఇన్నింగ్స్ నభూతో నభవిష్యతి అన్నట్లు ఉంది.
37 ఏళ్ల వయసులో రోచ్ చేసిన పోరాటాన్ని విస్మరించలేము. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన తర్వాత ఏకంగా 233 బంతుల ఎదుర్కోవడం అంటే ఆషామాషీ విషయం కాదు. అంతకుముందు షాయ్ హోప్ అద్బుతమైన శతకంతో (140) వీరిలో స్పూర్తి నింపాడు.

72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గెలుపు అంచులకు వెళ్లిందంటే, ఈ విండీస్ యోధుల పోరాటం ఎలా సాగిందో అర్దం చేసుకోవచ్చు. అంత భారీ లక్ష్య ఛేదనలో విండీస్ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా ఏకంగా 163.3 ఓవర్లు ఎదుర్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదు.
ముఖ్యంగా గ్రీవ్స్ ఆటతీరును ఎంత పొగిడినా తక్కువే. ఇతగాడు 565 నిమిషాల పాటు క్రీజ్‌లో ఉండి, తన జట్టు మ్యాచ్‌ను కోల్పోకుండా కాపాడాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా పరోక్షంగా విండీస్ గెలిచినట్లే. విండీస్ యెధుల పోరాటాన్ని యావత్ క్రికెట్ ప్రపంచం కీర్తిస్తుంది.
ఈ యోధులు ఎదుర్కొన్నది సాధారణ బౌలింగ్ గణాన్ని కాదు. మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ లాంటి పేస్ బౌలింగ్ దిగ్గజాలను, బ్రేస్‌వెల్ లాంటి నాణ్యమైన స్పిన్నర్‌ను. వీరి తట్టుకొని నాలుగో ఇన్నింగ్స్‌లో అంత భారీ లక్ష్యానికి చేరువ కావడం ఊహకందని గొప్ప విషయం.
ఉనికి కోసం పోరాడుతున్న క్రమంలో..
గత మూడు దశాబ్దాలుగా ప్రభ కోల్పోయి ఉనికి కోసం పోరాడుతున్న విండీస్ లాంటి జట్టు నుంచి ఇలాంటి వీరోచిత పోరాటన్ని ఎవరూ ఊహించి ఉండరు. ఈ జట్టు షాయ్ హోప్ లాంటి ఆటగాడు ఇస్తున్న స్పూర్తితో ఇప్పుడిప్పుడే పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తుంది.
ఈ క్రమంలో ఇటీవల ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో.. పాకిస్తాన్‌ను పాకిస్తాన్‌లో ఓడించి, పూర్వ వైభవం దిశగా సాగుతున్నామన్న సంకేతాలు పంపింది.

సరికొత్త చరిత్ర అయ్యేది
ఈ మ్యాచ్ విండీస్ గెలిచి ఉంటే సరికొత్త చరిత్ర సృష్టించి ఉండేది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు 500కు మించి లక్ష్యాన్ని ఛేదించలేదు. గత రికార్డు కూడా విండీస్ పేరిటే ఉంది. 2003లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 418 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
లాథమ్, రచిన్ శతకాలు
అంతకుముందు టామ్ లాథమ్ (145), రచిన్ రవీంద్ర (176) భారీ శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (466/8) చేసి విండీస్ ముందు 531 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కీమర్ రోచ్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు.
చెలరేగిన డఫీ
దీనికి ముందు జేకబ్ డఫీ ఐదేయడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లోనూ హోప్ (56) రాణించాడు. తేజ్‌నరైన్ చంద్రపాల్ (52) అర్ద సెంచరీతో పర్వాలేదనిపించాడు.
కలిసికట్టుగా రాణించిన విండీస్ బౌలర్లు
విండీస్ బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకే ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (52) ఒక్కడే కివీస్ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.


