విండీస్ టీ20 స్పెషలిస్ట్, స్పిన్ మాంత్రికుడు సునీల్ నరైన్ (Sunil Narine) పొట్టి క్రికెట్‌లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో భాగంగా అబుదాబీ నైట్‌రైడర్స్‌కు సారథ్యం వహిస్తున్న అతను.. నిన్న (డిసెంబర్ 3) షార్జా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ వికెట్ (టామ్ ఏబెల్) తీశాడు.
ఇదేం మైలురాయి అనుకుంటున్నారా..? ఆగండి. ఈ వికెట్ నరైన్‌కు టీ20 క్రికెట్‌లో 600వది. ఈ ఫార్మాట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ముగ్గురు (నరైన్‌తో కలుపుకొని) మాత్రమే ఈ ఘనత సాధించారు. నరైన్‌కు ముందు డ్వేన్ బ్రావో (631), రషీద్ ఖాన్ (681) 600 వికెట్ల క్లబ్‌లో చేరారు.
లివింగ్‌స్టోన్ ఊచకోత
షార్జా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Livingstone) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
కేవలం 38 బంతుల్లో 8 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో అజేయమైన 82 పరుగులు చేశాడు. అతనితో పాటు అలెక్స్ హేల్స్ (32), షరాఫు (34), రూథర్‌ఫోర్డ్ (45) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో వారియర్స్ చేతులెత్తేసింది. టిమ్ డేవిడ్ (24 బంతుల్లో 60; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) ఒక్కడే పోరాడినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 194 పరుగులకే పరిమితమై 39 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. సునీల్ నరైన్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు ఓ వికెట్ తీసి 600 వికెట్ల క్లబ్‌లో చేరాడు.


