ఆసియా ఈక్వెస్ట్రియన్ పోటీల్లో వ్యక్తిగత స్వర్ణం సొంతం
మొత్తం ఐదు పతకాలతో భారత్ అత్యుత్తమ ప్రదర్శన
న్యూఢిల్లీ: కేంద్రం నుంచి ఆర్థికంగా చేయూత లభించడంతో... ఆసియా ఈక్వె్రస్టియన్ (అశ్విక క్రీడలు) చాంపియన్‌షిప్‌లో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. థాయ్‌లాండ్‌లోని పటాయా నగరంలో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో భారత్ ఒక స్వర్ణం, నాలుగు రజతాలతో కలిపి మొత్తం ఐదు పతకాలతో మెరిసింది. ఈవెంటింగ్ కేటగిరీలో టార్గెట్ ఏషియన్ గేమ్స్ గ్రూప్ (టీఏజీజీ) సభ్యుడైన ఆశిష్ లిమాయే స్వర్ణ పతకాన్ని సాధించాడు.
ఈ క్రమంలో ఆసియా ఈక్వె్రస్టియన్ పోటీల చరిత్రలో వ్యక్తిగత స్వర్ణం సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఆశిష్ లిమాయే, శశాంక్ సింగ్ కటారియా, శశాంక్ కనుమూరిలతో కూడిన భారత జట్టు ఈవెంటింగ్ టీమ్ విభాగంలో రజత పతకం సాధించింది. డ్రెసాజ్ ఈవెంట్, ఇంటర్మీడియట్ ఫ్రీస్టయిల్–1 వ్యక్తిగత విభాగాల్లో శ్రుతి వోరా రజత పతకాలు నెగ్గింది.
డ్రెసాజ్ టీమ్ విభాగంలో శ్రుతి వోరా, దివ్యకీర్తి సింగ్, గౌరవ్ పుందిర్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం హస్తగతం చేసుకుంది. ఆసియా చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ 16 మంది సభ్యులతో కూడిన భారత బృందం ఖర్చులన్నీ కేంద్ర ప్రభుత్వం భరించింది. జాతీయ క్రీడా సమాఖ్యలకు చేయూత పథకంలో భాగంగా భారత బృందంపై రూ. 2 కోట్ల 73 లక్షలు వెచ్చించారు.


