డెఫ్ ఒలింపిక్స్‌లో సత్తా చాటిన తెలంగాణ షూటర్
ముర్తజాకు రజతం
న్యూఢిల్లీ: భారత బధిర షూటర్, తెలంగాణకు చెందిన ధనుశ్ శ్రీకాంత్ డెఫ్ ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డుతో పసిడి పతకం నిలబెట్టుకున్నాడు. టోక్యోలో ఆదివారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో 23 ఏళ్ల ధనుశ్ శ్రీకాంత్ 252.2 ప్రపంచ రికార్డు స్కోరుతో అగ్ర స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో గతంలో అతనే నెలకొలి్పన 251.7 స్కోరును తాజా బధిరుల ఒలింపిక్స్‌లో అధిగమించాడు.
ఇదే ఈవెంట్‌లో పోటీపడిన భారత సహచరుడు మొహమ్మద్ ముర్తజా వానియా 250.1 స్కోరుతో రెండో స్థానంలో నిలిచాడు. దీంతో ముర్తజా రజత పతకంతో సరిపెట్టుకోగా... దక్షిణ కొరియా బధిర షూటర్ బెక్ సెంగ్‌హక్ (223.6) కాంస్యం నెగ్గాడు. హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్ ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్‌కు చెందిన ‘గన్ ఫర్ గ్లోరీ’ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.
ముందుగా 630.6 స్కోరుతో శ్రీకాంత్ ఫైనల్స్‌కు అర్హత సాధించగా, ముర్తజా (626.3) కూడా మెరుగైన స్కోరుతో తుది పోరుకు చేరుకున్నాడు. 2022లో కాక్సియస్ డొ సుల్ (బ్రెజిల్)లో జరిగిన డెఫ్ ఒలింపిక్స్‌లో ధనుశ్ శ్రీకాంత్ వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో మహిత్ సంధు బంగారు పతకం గెలుచుకుంది. ఆమె 250.5 స్కోరుతో రజతం గెలుచుకోగా, సహచర షూటర్ కోమల్ వాఘ్‌మారె (228.3) కాంస్యంతో సరిపెట్టుకుంది.
రూ.1.20 కోట్ల నజరానా...
డెఫ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న రాష్ట్ర షూటర్‌కు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. శ్రీకాంత్‌కు రూ. 1 కోటి 20 లక్షల నగదు బహుమతిని అందజేయనున్నట్లు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌ను మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ ఘనత గురించి సమాచారం తెలుసుకున్న శ్రీహరి ఈ ప్రకటన చేశారు.


