భారత షట్లర్లు సై
నేటి నుంచి మలేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీ
కౌలాలంపూర్: కొత్త ఏడాది కొత్త సీజన్‌ను ఘనంగా ఆరంభించాలని భారత షట్లర్లంతా మలేసియా ఓపెన్‌కు సై అంటున్నారు. అనుభవజు్ఞలైన స్టార్లు పీవీ సింధు, లక్ష్యసేన్ సహా భారత బలగమంతా ఈ టోర్నీ బరిలోకి దిగుతోంది. 14,50,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 13.09 కోట్లు) గల ఈ సూపర్–1000 టోర్నమెంట్‌ను ఆశావహ దృక్పథంతో ప్రారంభించాలని భారత షట్లర్లు భావిస్తున్నారు.
2025 సీజన్ భారత బ్యాడ్మింటన్‌కు ఓ చేదుగుళికగా ముగిసింది. స్టార్ ఆటగాళ్ల గాయాలు, నిలకడలేని ఆటతీరు, ప్రధాన టోర్నీలో చెత్త ప్రదర్శన ఇలా చెప్పుకుంటూ పోతే నిరుత్సాహకరంగానే గతేడాది ముగిసింది. దీనిని సాధ్యమైనంత తొందరగా మర్చిపోయి మలేసియా ఓపెన్‌లో మంచి రోజులను తెచ్చుకోవాలని... తద్వారా వచ్చే వారం సొంతగడ్డ (ఢిల్లీ)పై జరిగే ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నమెంట్‌లో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగాలని షట్లర్లంతా ఆశిస్తున్నారు.
జియా హెంగ్‌తో లక్ష్య పోరు
సింగిల్స్‌లో లక్ష్యసేన్ గుడ్డికంటే మెల్ల నయం అన్నచందంగా ఒకటి అర టోర్నీలో మెరిశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో టైటిల్ గెలిచాడు. హాంకాంగ్ ఓపెన్ ఫైనల్ చేరాడు. ఇప్పుడు తాజా టోర్నీ సింగపూర్‌కు చెందిన జియా హెంగ్ జాసన్‌తో 24 ఏళ్ల స్టార్ షట్లర్ ఈ సీజన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. యూఎస్ ఓపెన్ సూపర్–300 టైటిల్ గెలిచిన యువతార ఆయుశ్ షెట్టి ఈ సీజన్‌లో ప్రతీ టోర్నీలోనూ నిలకడైన ప్రదర్శన కనబరచడమే ధ్యేయంగా బరిలోకి దిగుతున్నాడు. తొలి మ్యాచ్‌లో ఇతనికి క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురవుతున్నాడు. తొలి రౌండ్లో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లీ జి జియా (మలేసియా)తో ఆయుశ్ పోటీపడతాడు.
గంపెడాశలతో సింధు
మహిళల సింగిల్స్‌లో రెండు వరుస ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు ఈ సీజన్‌పై గంపెడాశలు పెట్టుకుంది. గాయాల బెడదతోనే గడిచిన గత సీజన్‌ను మరిపించేలా ఈ ఏడాది తన ప్రదర్శన ఉండాలని గట్టి పట్టుదలతో ఉంది. తొలి పోరులో భారత స్టార్ షట్లర్ సింధు... చైనీస్ తైపీకి చెందిన సంగ్ షువో యున్‌తో తలపడుతుంది. అయితే ఉన్నతి హుడాకు తొలి రౌండ్లో చైనా గోడ ఎదురవుతోంది. ఆమె టోక్యో ఒలింపిక్స్ చాంపియన్, నాలుగో సీడ్ చెన్ యు ఫె (చైనా)ను ఢీకొట్టనుంది. మోకాలి గాయంతో ఆరు నెలలు పూర్తిగా ఆటకు దూరంగా ఉన్న మాళవిక బన్సోద్... మాజీ ప్రపంచ చాంపియన్, ఏడో సీడ్ రచనొక్ ఇంతనొన్ (థాయ్‌లాండ్)తో సీజన్‌ను ప్రారంభించనుంది.
సాత్విక్–చిరాగ్‌ల జోరు కొనసాగేనా...
గత ఏడాది ఓవరాల్‌గా భారత బ్యాడ్మింటన్‌లోనే అత్యంత మెరుగ్గా, ధీటుగా రాణించిన ఆటగాళ్లెవరైనా ఉంటే సాత్విక్–చిరాగ్‌లే! పెద్దగా కలిసిరాని 2025లో కూడా తమ ఉనికి చాటుకొని జోరు సాగించిన జోడీ... ఇప్పుడు ఇదే ఉత్సాహంతో 2026ను ఘనంగా మొదలుపెట్టాలని అనుకుంటుంది. గత నెల ముగిసిన వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో సెమీస్ దాకా పోరాడిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ... హాంకాంగ్ ఓపెన్, చైనా మాస్టర్స్ టోర్నీలలో రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మరెన్నో టోర్నీలో సెమీస్ చేరింది. తాజా టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం... లీ జె హుయ్–యంగ్ పొ సున్ (చైనీస్ తైపీ) జంటతో తొలి రౌండ్‌లో తలపడుతుంది. మరో డబుల్స్ జోడీ ఎమ్.ఆర్. అర్జున్–హరిహరన్.... హిరొకి మిడొరికవా–క్యోహి యమషిత (జపాన్) జంటతో పోటీపడుతుంది.
కొత్త ఉత్సాహంతో గాయత్రి–ట్రెసా
మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి
గోపీచంద్–ట్రెసా జాలీ జోడీ నూతనోత్సాహంతో మలేసియా టోర్నీలో దిగుతోంది. గత ఏడాది గాయత్రి భుజం గాయంతో ఇబ్బంది పడింది. ఇటీవల ట్రెసాతో కలిసి సయ్యద్ మోడి టోర్నీలో టైటిల్ నిలబెట్టుకోవడం ద్వారా రేసులోకి వచ్చారు. ఈ టోర్నీ తొలి రౌండ్లో గాయత్రి–ట్రెసా జోడీ ఇండోనేసియాకు చెందిన ఫెబ్రియానా ద్విపుజి కుసుమ–మెలిసా ట్రియాస్ పుస్పిటసరి జంటతో తలపడనుంది.


