72 నిమిషాల్లో ప్రపంచ 24వ ర్యాంకర్ వతనాబెపై విజయం
మూడో గేమ్‌లో మ్యాచ్ పాయింట్ కాచుకున్న భారత స్టార్
తొలి రౌండ్‌లోనే ప్రణయ్, ఆయుశ్, కిరణ్ జార్జి అవుట్
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్, ప్రస్తుత భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించగా... హెచ్‌ఎస్ ప్రణయ్, కిరణ్ జార్జి, ఆయుశ్ శెట్టి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు.
ప్రపంచ 24వ ర్యాంకర్ కోకి వతనాబె (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 33వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–15, 21–23, 24–22తో గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌కు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. నిర్ణాయక మూడో గేమ్‌లో 20–21 స్కోరు వద్ద శ్రీకాంత్ ఓటమి అంచుల్లో నిలిచాడు.
అయితే సంయమనం కోల్పోకుండా ఆడిన శ్రీకాంత్ స్కోరును 21–21తో సమం చేశాడు. ఆ తర్వాత మళ్లీ స్కోరు 22–22తో సమమైంది. ఈ దశలో శ్రీకాంత్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి 24–22తో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. 2017లో ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన తర్వాత శ్రీకాంత్ మరో అంతర్జాతీయ టైటిల్‌ను సాధించలేకపోయాడు.
మరో మ్యాచ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 68 నిమిషాల్లో 21–13, 16–21, 21–14తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై గెలిచాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రణయ్ 19–21, 11–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో, కిరణ్ జార్జి 17–21, 14–21తో మో జకి ఉబైదుల్లా (ఇండోనేసియా) చేతిలో, ఆయుశ్ శెట్టి 8–21, 13–21తో అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు.
సింధు శుభారంభం
మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ అన్‌మోల్ ఖరబ్ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకోగా... తన్వీ శర్మ, మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. తొలి రౌండ్‌లో సింధు 53 నిమిషాల్లో 22–20, 21–18తో మనామి సిజు (జపాన్)పై, అన్‌మోల్ 21–16, 21–17తో పాయ్ యి పో (చైనీస్ తైపీ)పై గెలుపొందారు.
తన్వీ శర్మ 21–18, 18–21, 16–21తో టొమోకా మియజకి (జపాన్) చేతిలో, మాళవిక 21–23, 12–21తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో, ఆకర్షి 21–8, 20–22, 17–21తో జూలీ జేకబ్‌సన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం పాలయ్యారు.
రుత్విక జోడీ ఓటమి
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్)... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీలు తొలి రౌండ్‌లోనే ఓడిపోయాయి. రుత్విక–రోహన్ ద్వయం 9–21, 20–22తో థోమ్ గికెల్–డెల్ఫిన్ డెల్‌ర్యూ (ఫ్రాన్స్) జంట చేతిలో... తనీషా–ధ్రువ్ జంట 23–21, 20–22, 6–21తో జూలియన్ మాయో–లీ పలెర్మో (ఫ్రాన్స్) ద్వయం చేతిలో ఓటమి చవిచూశాయి.


