254 ఏళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పిన న్యూజిలాండ్‌ పేసర్‌ | Brett Randell Becomes The First Bowler In First Class History To Pick 5 Wickets In 5 Balls, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

254 ఏళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పిన న్యూజిలాండ్‌ పేసర్‌

Mar 8 2026 1:55 PM | Updated on Mar 8 2026 4:38 PM

Brett Randell becomes the first bowler in First Class history to pick 5 wickets in 5 balls

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. 254 ఏళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును న్యూజిలాండ్‌ పేసర్‌ బ్రెట్‌ రాండెల్‌ సాధించాడు. న్యూజిలాండ్‌లోని ప్లంకెట్ షీల్డ్ టోర్నీలో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఆడే బ్రెట్ రాండెల్.. నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్‌ ఈ ఫీట్‌ను సాధించలేదు.

ఈ మ్యాచ్‌లో రాండెల్‌ వరుసగా ఆరు బంతుల్లో ఆరు వికెట్లు సాధించలేకపోయినా, ఎనిమిది బంతుల్లో ఆరు వికెట్లు తీసి మరో రికార్డు సృష్టించాడు. మొత్తంగా 11 ఓవర్లలో 25 పరుగులకు 7 వికెట్లు తీసి తన కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. రాండెల్‌ ధాటికి నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులకే ఆలౌటైంది. రాండెల్‌ ధాటికి 4-0గా ఉన్న నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ స్కోర్‌ స్వల్ప వ్యవధిలో 11-7కి చేరింది.

గతంలోనూ ఉన్నా..!
ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన ఉదంతాలు గతంలో ఉన్నా.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో నమోదు కావడం మాత్రం ఇదే మొదటిసారి. 2021లో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్‌ బౌలర్‌ కర్టిస్‌ క్యాంఫర్‌ ఈ రేర్‌ ఫీట్‌ను సాధించాడు. 2024లో జింబాబ్వే మహిళా క్రికెటర్ కెలిస్ న్ద్లోవు ఓ అండర్‌-19 మ్యాచ్‌లో ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీశారు.  

కాగా, తాజా ఉదంతంలో ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన రాండెల్‌కు ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం అనుకోకుండా వచ్చింది. సీనియర్ బౌలర్లు గాయాల కారణంగా అందుబాటులో లేకపోవడంతో రాండెల్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఆ అవకాశాన్ని ఆయన చరిత్రాత్మక ప్రదర్శనగా మార్చి, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.  
 

Advertisement
 
Advertisement
Advertisement