లక్ష్యసేన్‌ సంచలనం | Lakshya Sen wins over world number one Shi Yuqi | Sakshi
Sakshi News home page

లక్ష్యసేన్‌ సంచలనం

Mar 4 2026 3:55 AM | Updated on Mar 4 2026 3:55 AM

Lakshya Sen wins over world number one Shi Yuqi

వరల్డ్‌ నంబర్‌వన్‌ షి యూకిపై విజయం 

ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌

బర్మింగ్‌హామ్‌: భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను పెను సంచలనంతో మొదలుపెట్టాడు. ప్రపంచంలోనే కొరకరాని ప్రత్యర్థి, చైనా గోడను తొలి రౌండ్లోనే బద్దలు కొట్టాడు. చైనాకు చెందిన టాప్‌ స్టార్, ప్రపంచ నంబర్‌వన్‌ షి యూకిపై భారత షట్లర్‌ చిరస్మరణీయ విజయాన్ని సాధించాడు. ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్, ప్రపంచ చాంపియన్‌షిప్, సుదిర్మన్‌ కప్, థామస్‌ కప్‌లాంటి ఎన్నో టోర్నీల్లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన షి యూకిని ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టించాడు. 

మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్‌ మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ 23–21, 19–21, 21–17తో టాప్‌ సీడ్, తాజా ప్రపంచ చాంపియన్‌ షి యూకిని కంగుతినిపించాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్‌కు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. ఆమె 11–21, 6–21తో వరుస గేముల్లో మూడో సీడ్‌ చెన్‌ యూ ఫె (చైనా) చేతిలో ఓడింది. మరో మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ పొర్న్‌పవీ చోచువాంగ్‌ (థాయిలాండ్‌) 21–12, 21–18తో ఉన్నతి హుడా (భారత్‌)ను ఓడించి ముందంజ వేసింది.   

డబుల్స్‌ జోడీలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల–తనీషా క్రాస్టో జోడీ 21–17, 21–19తో  హూ పాంగ్‌ రాన్‌–చెంగ్‌ సు యిన్‌ (మలేసియా) జంటపై గెలుపొందగా... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 15–21, 21–15, 18–21తో జపాన్‌కు చెందిన సయాక హిరోత–అయాకొ సకురమొతొ జంట చేతిలో పరాజయం చవిచూసింది. 

సింధు స్వదేశానికి... 
భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు స్వదేశానికి చేరుకుంది. ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ కోసం బయల్దేరిన సింధు తాజా యుద్ధ పరిణామాల కారణంగా ఫ్లయిట్‌లు ఆగిపోవడంతో దుబాయ్‌లో చిక్కుకుంది. ఇంగ్లండ్‌ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆమె తిరుగుముఖం పట్టింది. 

అయితే ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ నిబంధనల ప్రకారం ఆఖరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకుంటే 5 వేల డాలర్ల జరిమానా విధిస్తారు. అయితే సింధు ఇచి్చన వివరణ, ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆల్‌ ఇంగ్లండ్‌ ఆర్గనైజర్లు జరిమానాను రద్దు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement