సాత్విక్–చిరాగ్ జోడి నిష్క్రమణ
ముగిసిన భారత పోరాటం
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. ఒకే ఒక్కడు లక్ష్యసేన్ మాత్రమే క్వార్టర్ ఫైనల్ చేరగా... అతనూ అంతకుమించి ముందంజ వేయలేకపోయాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్ 21–17, 13–21, 18–21తో చైనీస్ తైపీ ప్లేయర్ లిన్ చున్ యి చేతిలో పరాజయం చవిచూశాడు. 2021 ప్రపంచ చాంపియíÙప్ కాంస్య పతక విజేత అయిన లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్‌లో 21–19, 21–10తో జపాన్ ఆటగాడు కెంట నిషిమొతోపై అలవోక విజయం సాధించాడు.
సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్, మాళవిక బన్సోద్ గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లలో పరాజయంపాలయ్యారు. పురుషుల సింగిల్స్‌లో క్రిస్టో పొపొవ్ (ఫ్రాన్స్)తో జరిగిన పోరులో శ్రీకాంత్ 14–21, 21–17, 17–21తో ఐదో సీడ్ ఫ్రాన్స్ ప్లేయర్ ధాటికి పరాజయం చవిచూశాడు. ప్రణయ్ కూడా 21–18, 19–21, 14–21తో ఎనిమిదో సీడ్ లోహ్ కియన్ యూ (సింగపూర్) చేతిలో పోరాడి ఓడాడు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో మాళవిక బన్సోద్ 18–21, 15–21తో చైనాకు చెందిన ఐదో సీడ్ హన్ యూవ్ చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట 22–20, 22–24, 21–23తో ఏడో సీడ్ లి యిజింగ్–లూయో జుమిన్ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది.
వివాదాస్పద నిర్ణయంతో....
పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో మూడో సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 27–25, 21–23, 19–21తో ప్రపంచ 22వ ర్యాంకు జోడీ హిరోకి మిదొరికవ–క్యోహే యామషిత (జపాన్) చేతిలో ఓడింది. భారత, జపాన్ జోడీలు అప్పటికే చెరో గేమ్ గెలిచాయి. నిర్ణాయక గేమ్‌లో హోరీహోరీగా తలపడుతున్నాయి. ఇలాంటి దశలో స్కోరు 15–15 వద్ద దురదృష్టవశాత్తు నెట్‌కు సాత్విక్ తగిలాడు. దీంతో చైర్ అంపైర్ ప్రత్యర్థి జోడీకి పాయింట్ ఇచ్చాడు. వెంటనే దీనిపై అంపైర్‌కు సాత్విక్ వివరణ ఇచ్చాడు. చిరాగ్ వీడియో రిఫరల్‌ను పరిశీలించాలని కోరాడు. కానీ చైర్ అంపైర్ తన నిర్ణయానికే కట్టుబడి ఉండటంతో ఇది భారత జోడీ తిరిగి పుంజుకోకుండా చేసింది. ప్రతీ గేమ్‌లోనూ అసాధారణ పోరాటపటిమ కనబరిచిన అగ్రశ్రేణి భారత ద్వయం ఇంత జరిగినా కూడా తమ పరాజయానికి సాకుగా ఈ ప్రతికూలతను చెప్పనేలేదు. కీలకమైన సమయంలో ప్రత్యర్థి జోడీనే తమకన్నా మిన్నగా పాయింట్లు సాధించడం వల్లే ఓడిపోయామని సాత్విక్ జంట మ్యాచ్ ముగిసిన అనంతరం వెల్లడించింది.


