ఏఎఫ్‌సీ మహిళల ఆసియాకప్ ఫుట్‌బాల్ టోర్నీ
పెర్త్: మైదానం లోపలా బయటా సమస్యలతో సతమతమవుతున్న భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు... ఆసియాకప్ టోర్నమెంట్‌లో తొలిపోరుకు సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం మొదటి మ్యాచ్‌లో మనకంటే మెరుగైన ర్యాంక్ గల వియత్నాంతో టీమిండియా తలపడనుంది. చైనీస్ తైపీ, జపాన్, వియత్నాంతో కలిసి గ్రూప్ ‘సి’నుంచి భారత్ పోటీ పడుతోంది. గతేడాది అక్టోబర్ తర్వాత భారత మహిళల జట్టు ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే.
చివరగా ఇరాన్, నేపాల్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మన అమ్మాయిలు పరాజయం పాలయ్యారు. మరి ఆ వైఫల్యాలను అధిగమించి బుధవారం మనవాళ్లు మైదానంలో ఆకట్టుకుంటారా చూడాలి. ఈ టోర్నమెంట్ కోసం గత నెల 11నే పెర్త్ చేరుకున్న భారత జట్టు... అక్కడ స్థానిక క్లబ్‌లతో మ్యాచ్‌లు ఆడి అనుభవాన్ని గడించింది. ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్‌లో వియత్నాం 36వ ర్యాంక్‌లో ఉండగా... భారత్ 67వ స్థానంలో కొనసాగుతోంది. ఫామ్ పరంగా చూసుకున్నా... వియత్నాం ఇటీవలే బలమైన ప్రత్యర్థులపై విజయాలతో సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉంది.
మరి అలాంటి జట్టుపై ఆధిక్యం కనబర్చాలంటే టీమిండియా శక్తికి మించి పోరాడక తప్పదు. 2003లో చివరిసారిగా ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ వియత్నాం విజయం సాధించింది. ఈ టోర్నమెంట్ మూడు గ్రూప్‌ల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన రెండేసి జట్లతో పాటు మూడో స్థానంలో నిలిచిన రెండు మేటి జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరనున్నాయి. అందులో విజయం సాధించిన జట్లకు 2027లో బ్రెజిల్ వేదికగా జరగనున్న మహిళల ఫిఫా వరల్డ్‌కప్ బెర్త్ దక్కనుంది.
‘2023 ఆసియాకప్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చలేకపోయాం. కానీ ఈ సారి మంచి సన్నద్ధతతో బరిలోకి దిగుతున్నాం. మా అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తాం. ఈ టోర్నీకి ముందు టర్కీలో ప్లేయర్ల కోసం ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఆసియాకప్‌లో సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం’ అని భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ అమేలియా వాల్‌వెర్డ్ పేర్కొంది.
సరైన్ కిట్‌లు లేక...
ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కోసం చాలా ముందుగానే ఆస్ట్రేలియా చేరుకున్న భారత జట్టుకు అనూహ్య ఇబ్బంది వచ్చి పడింది. జట్టు స్పాన్సర్ సరైన సమయానికి సరైన్ కిట్‌లు అందించకపోవడంతో ప్లేయర్లు ఇబ్బంది ఎదుర్కొన్నారు. దీనిపై ఆగ్రహించిన ప్లేయర్లు తమ సమస్యను అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) దృష్టికి తీసుకొచ్చారు. ‘అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ప్రొఫెషనల్ ప్రమాణాలు అవసరం. కనీసం కిట్‌లను కూడా సరిగ్గా సమకూర్చలేకపోతే కష్టం.
ప్రాక్టీస్ సమయంలోనే సరైన దుస్తులు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఇలాంటి కీలక టోర్నమెంట్ ఆడుతున్న సమయంలో కిట్‌లు సరిగ్గా లేకపోవడం అనేది ఎంతో బాధిస్తోంది. మ్యాచ్‌కు ముందు ఇలాంటి సమస్యలు మా ఏకాగ్రతను దెబ్బతీశాయి’ అని ప్లేయర్లు ఏఐఎఫ్‌ఎఫ్‌కు లేఖ రాశారు. కెపె్టన్ స్వీటి దేవి నాంగ్‌బమ్‌తో పాటు ఎనిమిది మంది ప్రధాన ప్లేయర్లు ఈ లేఖపై సంతకాలు చేశారు. అయితే దీనిపై స్పందించిన సమాఖ్య మంగళవారం ప్లేయర్లకు కొత్త కిట్‌లు అందించినట్లు తెలిపింది.


