breaking news
Indian womens football team
-
పట్టుదల...పోరాటం...అద్భుతం
జనవరి 2022... ఆతిథ్య దేశం హోదాలో భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు ఆసియా కప్‌లో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. అయితే ఒక్కసారిగా ప్రపంచాన్ని తలకిందులు చేసిన కోవిడ్ మహమ్మారి ప్రభావం ఈ జట్టుపై కూడా పడింది. చైనీస్ తైపీతో తొలి మ్యాచ్ సమయానికి కోవిడ్ కారణంగా మన జట్టుకు కనీసం 13 మంది ప్లేయర్లు కూడా అందుబాటులో లేకుండా పోయారు. దాంతో నిబంధనల ప్రకారం మొదటి మ్యాచ్ నుంచే కాకుండా మొత్తం టోర్నీ నుంచి టీమ్ తప్పుకోవాల్సి వచ్చింది. క్వాలిఫయింగ్ పోటీలు లేని సమయంలో 2003లో చివరిసారిగా ఆసియా కప్‌కు నేరుగా అర్హత సాధించిన మన జట్టు ఈసారి ఎంతో ఉత్సాహంతో, పట్టుదలతో సొంతగడ్డపై ఆసియా కప్‌కు సన్నద్ధమైంది. అయితే అనూహ్య పరిణామాలు ఎదురు కావడం మన మహిళలకు ఇది తీరని వేదన మిగిల్చింది. ఇప్పుడు మూడున్నరేళ్ల తర్వాత క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తా చాటి మన మహిళలు దర్జాగా ఆసియా కప్‌కు అర్హత సాధించారు. అయితే గత టోర్నీ, ప్రస్తుత క్వాలిఫికేషన్‌కు మధ్య ఎంతో పోరాటం ఉంది. సవాళ్లు, ప్రతికూలతలు అధిగమించి అమ్మాయిలు సాధించిన ఈ గెలుపునకు ఎంతో ప్రత్యేకత ఉంది. సాక్షి క్రీడా విభాగం : ఆసియా కప్‌లో ఆడకుండానే బరి నుంచి తప్పుకోవడం మొదలు ఇప్పుడు అర్హత సాధించడం వరకు భారత మహిళల ఫుట్‌బాల్ జట్టుకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. సరైన దిశా నిర్దేశం లేకుండా, అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) తమ బాధ్యతను మరిచి పట్టించుకోకపోవడంతో అనాథలా కనిపించింది. అసలు జాతీయ జట్టు ఉందనే విషయాన్ని కూడా అంతా మర్చిపోయారు. ఒకటా, రెండా ఎన్నో పరిణామాలు మహిళల ఫుట్‌బాల్ పతనానికి దారి తీశాయి. అండర్–17 జట్టు కోచ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు, ‘శాఫ్’ టోర్నీ సెమీస్‌లో నేపాల్ చేతిలో పరాజయం, అండర్–17 వరల్డ్ కప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓడి నిష్క్రమణ, ఆసియా క్రీడల్లో చివరి స్థానం, ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో ఆఖరి స్థానం, పేరుకే ఇండియన్ ఉమెన్ లీగ్ ఉన్నా కనీస సౌకర్యాలు కల్పించలేని ఫెడరేషన్... ఇలా మహిళల జట్టుకు సమస్యలు నిర్విరామంగా సాగుతూనే వచ్చాయి. ఇలాంటి స్థితి నుంచి పైకి లేచి మన టీమ్ ఆసియా కప్‌కు అర్హత సాధించడం చిన్న విషయమేమీ కాదు. నాలుగు మ్యాచ్‌లలో నాలుగూ గెలవడం అసాధారణ ప్రదర్శనగా చెప్పవచ్చు. ముఖ్యంగా కొంత మంది ప్లేయర్లకు వ్యక్తిగతంగా కూడా ఇది ఎంతో ప్రత్యేక ఘనత. అందుకే థాయ్‌లాండ్‌తో మ్యాచ్ గెలవగానే వారంతా కన్నీళ్లపర్యంతమయ్యారు. వారి భావోద్వేగాలను నిలువరించడం ఎవరి వల్లా కాలేదు. వరుసగా కోచ్‌ల మార్పు... భారత మహిళల జట్టుకు ఎదురైన ఇటీవలి అనుభవాలు చూస్తే టీమ్ ఎలా నడుస్తోందో అర్థమవుతుంది. సంవత్సరాల తరపడి స్వయంగా ఫెడరేషన్ నిర్వహించే లీగ్‌లో కూడా ఆట జరుగుతుందా లేదా అనే సందేహాలు, జాతీయ శిబిరానికి వెళ్లినా తర్వాతి రోజు కోచ్ వస్తాడా లేదా అనుమానం, అసలు మహిళలుగా తమకు కనీస భద్రత కూడా ఉంటుందా లేదా అని పరిస్థితిని వారు దాటుకుంటూ వచ్చారు. ఏఐఎఫ్ఎఫ్ వరుసగా కోచ్‌లను మారుస్తూ పోయింది. డెనర్‌బై, సురేన్ ఛెత్రి, ఛోబా దేవి, సంతోష్ కశ్యప్, జోకిమ్ అలెగ్జాండర్సన్... ఇలా కోచ్‌లు రావడం, పోవడం జరిగిపోయాయి. చివరకు క్రిస్పిన్ ఛెత్రి చేతుల్లోకి కోచింగ్ బాధ్యతలు వచ్చాయి. అతనికి అసిస్టెంట్‌గా పీవీ ప్రియను తీసుకున్నారు. ఆసియా కప్ కోసం మన జట్టు థాయ్‌లాండ్‌లో అడుగు పెట్టినప్పుడు కూడా ఎలాంటి అంచనాలు లేవు. 2022లో కోవిడ్ కారణంగా టోర్నీకి దూరమైన జట్టులో ఉన్నవారిలో చాలామంది ఈ సారి కూడా టీమ్‌లో ఉన్నారు. నాటి గాయం వారి మనసుల్లో ఇంకా మిగిలే ఉంది.కోచ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ వివాదం వచ్చినప్పుడు అండర్–17 టీమ్‌లో భాగమైన హేమమ్ షిల్కీ దేవి, లిండా కోమ్, మార్టినా తోక్చోమ్ ఇప్పుడు సీనియర్ టీమ్‌లో ఉన్నారు. పురుషుల ఫుట్‌బాల్ జట్టు చిత్తుగా ఓడిన సందర్భాల్లోనూ వార్తల్లో ఉంటుండగా... మహిళల టీమ్‌ను అసలు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి స్థితిలో వారు తమ పోరాటాన్ని మొదలు పెట్టారు. పటిష్ట ప్రత్యర్థి ని పడగొట్టి... మంగోలియాపై 13–0తో, తిమోర్ లెస్టెపై 4–0తో, ఆపై ఇరాక్‌పై 5–0తో ఘన విజయం... అంచనాలకు భిన్నంగా చక్కటి ప్రదర్శనతో మన మహిళలు వరుసగా మూడు విజయాలు సాధించారు. అయితే సరే ఆసియా కప్ క్వాలిఫికేషన్‌పై ఇంకా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే చివరి లీగ్‌లో ఆతిథ్య థాయ్‌లాండ్ ప్రత్యరి్థగా ఎదురైంది. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో మనకంటే ఎంతో ముందుండటం మాత్రమే కాదు, ఈ టీమ్ గత రెండు ‘ఫిఫా’ వరల్డ్ కప్‌లు కూడా ఆడింది. పైగా పెద్ద సంఖ్యలో విదేశీ ఆటగాళ్లు ఉండటంతో పాటు ప్రముఖ జపాన్ కోచ్ ఫుటోషీ ఐకెడా కోచింగ్ ఇస్తున్నాడు. మనకంటే బలమైన థాయ్‌లాండ్ జట్టు ఆరంభంలోనే దూకుడుగా ఆడి గోల్‌పోస్ట్‌పై దాడులు చేస్తూ ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే భారత్ పదునైన డిఫెన్స్‌తో వాటిని నిలువరించగలిగింది. తాము ఇంత కాలంగా పడిన ఆవేదన, చేసిన పోరాటం వారిలో ఒక్కసారిగా స్ఫూర్తి నింపినట్లుంది. అంతే... ఆ తర్వాత జట్టులో ఒక్కసారిగా కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రత్యర్థి ఎవరనేది పట్టించుకోకుండా చివరి వరకు పట్టు విడవకుండా చెలరేగిన జట్టు విజయాన్ని అందుకుంది.అన్ని రకాలుగా సన్నద్ధమై...మ్యాచ్ ముగిశాక సంగీత బస్ఫోర్ ఆనందానికి హద్దుల్లేవు. రెండు గోల్స్‌తో ఆమె ఈ చిరస్మరణీయ విజయంలో కీలకపాత్ర పోషించింది. కోవిడ్ కారణంగా 2022 ఆసియా కప్‌కు జట్టుకు దూరంగా కాగా, అంతకుముందే గాయంతో సంగీత టోర్నీ నుంచి తప్పుకుంది. 2019 నుంచి జట్టులో ప్రధాన సభ్యురాలిగా ఉన్న ఆమె ఆపై కోలుకోవడానికి ఏడాది పట్టింది. అదే సమయంలో ఆమె తండ్రిని కూడా కోల్పోయింది. సీనియర్ ప్లేయర్ అయిన తనకు భవిష్యత్తులో మళ్లీ ఎప్పుడు ఈ స్థాయిలో విజయానందం వరిస్తుందో అంటూ ఆమె ఆనందభాష్పాలు రాల్చింది. టోర్నీకి ముందు తమదైన రీతిలో ప్లేయర్లు సన్నద్ధమయ్యారు. మనీషా కళ్యాణ్, జ్యోతి చౌహాన్, తెలంగాణ ప్లేయర్ గుగులోత్ సౌమ్య యూరోపియన్ క్లబ్స్ ట్రయల్స్‌కు వెళ్లి కాంట్రాక్ట్‌లు పొంది తమ ఆటకు పదును పెట్టారు. మిగిలిన వారు ఐ–లీగ్‌లో బరిలోకి దిగి సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టారు. ఈ విజయం కచ్చితంగా ఏఐఎఫ్ఎఫ్ది మాత్రం కాదు. తమ శక్తి, స్వేదం, కన్నీళ్లు ధారబోసిన 23 మంది మహిళా ఫుట్బాలర్లదే. వచ్చే ఏడాది ఆసియాకప్‌లో కూడా ఇదే రీతిలో సత్తా చాటితే వరల్డ్ కప్‌లో పాల్గొనే స్వప్నం కూడా సాకారమవుతుంది. -
సత్తా చాటిన భారత అమ్మాయిలు
చియాంగ్ మై (థాయిలాండ్): భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు అసలు సమయంలో చెలరేగింది. క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తా చాటి ఆసియా కప్‌కు అర్హత సాధించింది. 2003 తర్వాత మన మహిళలు ఆసియా కప్ నేరుగా అర్హత సాధించడం ఇదే తొలిసారి. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–1 గోల్స్ తేడాతో ఆతిథ్య జట్టు థాయిలాండ్‌ను ఓడించింది. భారత్ తరఫున సంగీత బస్ఫోర్ రెండు గోల్స్ (28వ నిమిషం, 78వ నిమిషం) సాధించడం విశేషం. థాయిలాండ్ తరఫున చట్‌చవాన్ రాడ్థాంగ్ ఏకైక గోల్ (47వ నిమిషం) నమోదు చేసింది.ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల మధ్య గోల్ వ్యత్యాసం కూడా (+22) కూడా సమానంగా ఉండటంతో ఇరు జట్లూ తప్పనిసరిగా గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగాయి. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో భారత్‌కంటే 24 స్థానాలు ముందున్న థాయిలాండ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అయితే మన అమ్మాయిల పట్టుదలకు విజయం వరించింది. గతంలో భారత్ ఎప్పుడూ థాయిలాండ్‌ను ఓడించలేదు. క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రూప్ ‘బి’ నుంచి ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ భారత మహిళలు విజయం సాధించి అగ్రస్థానంతో ముందంజ వేయడం విశేషం. టోర్నీలో గత మూడు మ్యాచ్‌లలో ఇరాక్, మంగోలియా, తిమోర్ లెస్ట్లను భారత్ ఓడించింది. ఆసియా కప్ టోర్నీ 2026లో ఆస్ట్రేలియాలో జరుగుతుంది. -
ఉజ్బెకిస్తాన్‌తో భారత్ ‘ఢీ’
న్యూఢిల్లీ: ఈ నెలాఖరులో భారత సీనియర్ మహిళల ఫుట్‌బాల్ జట్టు ఉజ్బెకిస్తాన్‌తో రెండు అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. మే 30వ తేదీన తొలి మ్యాచ్... జూన్ 3వ తేదీన రెండో మ్యాచ్ జరుగుతుంది. బెంగళూరులోని పడుకోన్–ద్రవిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ ఈ రెండు మ్యాచ్‌లకు వేదిక కానుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం భారత జట్టు 69వ ర్యాంక్‌లో, ఉజ్బెకిస్తాన్ 50వ ర్యాంక్‌లో ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటి వరకు 13 సార్లు తలపడ్డాయి. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఉజ్బెకిస్తాన్, ఒక మ్యాచ్‌లో భారత్ గెలిచాయి. మరో మూడు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రస్తుతం భారత జట్టు హెడ్ కోచ్ క్రిస్పిన్ ఛెత్రి పర్యవేక్షణలో 2026 ఆసియా కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లకు సిద్ధమవుతోంది. మే 1 నుంచి జరుగుతున్న శిక్షణ శిబిరంలో భారత క్రీడాకారిణులు పాల్గొంటున్నారు. ఈ శిబిరంలో తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ కూడా ఉంది. ఈ సీజన్లో సౌమ్య నిలకడగా రాణించి 2025 సంవత్సరానికి భారత ఉత్తమ మహిళా ఫుట్‌బాలర్ అవార్డును గెల్చుకుంది. ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీ జూన్ 23 నుంచి జూలై 5వ తేదీ వరకు థాయ్‌లాండ్‌లో జరగనుంది. గ్రూప్ ‘బి’లో మంగోలియా, తిమోర్లెస్టె, ఇరాక్, థాయ్‌లాండ్ జట్లతో కలిసి భారత్ ఉంది. భారత ప్రాబబుల్స్: పాయల్, ఎలాంగ్బమ్ పంథోయ్ చాను, కీషమ్ మెలోడి చాను, మోనాలిసా దేవి, పూరి్ణమ కుమారి, నిర్మలా దేవి, మారి్టనా థోక్చోమ్, శుభాంగి సింగ్, సంజు, మాలతి ముండా, తోయ్జామ్ థోయ్బిసనా చ ఆను, రంజన చాను, స్వీటీ దేవి, వికసిత్ బరా, హేమం షిల్కీ దేవి, కిరణ్ పిస్డా, రత్నబాలా దేవి, ముస్కాన్ సుబ్బా, లిషామ్ బబీనా దేవి, కార్తీక అంగముత్తు, సిండీ కల్నే, సంగీత బస్ఫోరె, ప్రియదర్శిని, బేబీ సనా, సంతోష్, అంజు తమాంగ్, మౌసుమి ముర్ము, మాళవిక, సంధ్య రంగనాథన్, సౌమ్య గుగులోత్, సులాంజన రౌల్, లిండా కోమ్ సెర్టో, రింపా హల్దర్, మనీషా నాయక్, రేణు, కరిష్మా పురుషోత్తం, సుమతి కుమారి, మనీషా కల్యాణ్, గ్రేస్ డాంగ్మె. -
భారత్ శుభారంభం
షార్జా: ‘పింక్ లేడీస్ కప్–2025’లో భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు శుభారంభం చేసింది. గురువారం జరిగిన తమ తొలి పోరులో స్వీటీ దేవీ సారథ్యంలోని భారత జట్టు 2–0 గోల్స్ తేడాతో జోర్డాన్‌పై విజయం సాధించింది. భారత్ తరఫున ప్రియాంక దేవి (23వ నిమిషంలో), మనీషా (54వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే భారత మహిళల జట్టు దూకుడు కనబర్చింది. తొలి అర్ధభాగంలో వచ్చిన అవకాశాన్ని ప్రియాంక దేవి సద్వినియోగ పర్చుకుంటూ... జోర్డాన్ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టించి భారత్ ఖాతా తెరిచింది. కాసేపటికే స్కోరు పెంచే అవకాశం వచ్చినా... దాన్ని మనీషా సరిగ్గా వినియోగించుకోలేక పోయింది. ద్వితీయార్థంలో ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా మనీషా గోల్ కొట్టి జట్టుకు విజయం ఖాయం చేసింది.క్రిస్పిన్ ఛెత్రి భారత మహిళల కోచ్‌గా ఎంపికైన అనంతరం మన జట్టుకు ఇదే తొలి విజయం కావడం విశేషం. జోర్డాన్ పదే పదే ప్రతి దాడులకు ప్రయత్నించినా... స్వీటీ దేవి, పుర్ణిమ కస్తూరితో కూడిన రక్షణ శ్రేణి వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది. తెలంగాణ అమ్మాయి గుగులోతు సౌమ్య ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత యంగ్‌ప్లేయర్ లిషమ్ బబీనా దేవి అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. తదుపరి పోరులో ఆదివారం రష్యాతో భారత్ తలపడుతుంది. -
పసికూనపై ప్రతాపం.. సెమీస్‌లో భారత్
కఠ్మాండు (నేపాల్): దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్ (శాఫ్) చాంపియన్‌షిప్‌లో భారత్ వరుసగా రెండో విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 9–0 గోల్స్ తేడాతో పసికూనలైన మాల్దీవుల జట్టుపై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ (55వ ని.లో) ఒక గోల్... అంజు తమాంగ్ నాలుగు గోల్స్ (24వ ని.లో, 45+2వ ని.లో, 85వ ని.లో, 88వ ని.లో)... డాంగ్మే గ్రేస్ (53వ ని.లో, 86వ ని.లో) రెండు గోల్స్.. కష్మీనా (84వ ని.లో) ఒక గోల్ సాధించారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో 13న బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. -
పాక్‌ను చిత్తు చేసిన భారత్
కఠ్మాండు (నేపాల్): ఆరోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో (శాఫ్) బరిలోకి దిగిన భారత జట్టు శుభారంభం చేసింది. పాకిస్తాన్‌తో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున డాంగ్మే గ్రేస్ (23వ ని.లో), తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ (90+4వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... అంతకుముందు పాకిస్తాన్ జట్టు చేసిన సెల్ఫ్ గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో ఈనెల 10న మాల్దీవులు జట్టుతో ఆడుతుంది. -
‘డైనమో జాగ్రెబ్’ జట్టులో సౌమ్య
భారత ఫుట్‌బాల్ జట్టు సభ్యురాలు, తెలంగాణకు చెందిన గుగులోత్ సౌమ్యకు అరుదైన అవకాశం దక్కింది. క్రొయేషియాకు చెందిన ప్రతిష్టాత్మక క్లబ్ ‘డైనమో జాగ్రెబ్’ తరఫున ఆమె ఆడనుంది. దీనికి సంబంధించి ఏడాది పాటు ఒప్పందం కుదుర్చుకుంది. సౌమ్యతో పాటు మరో భారత ప్లేయర్ జ్యోతి చౌహాన్‌ను కూడా జాగ్రెబ్ క్లబ్ ఎంచుకుంది. ఈ టీమ్‌తో జత కట్టిన తొలి విదేశీ ఆటగాళ్లుగా వీరిద్దరు గుర్తింపు పొందారు. క్రొయేషియాలోనే జరిగిన ట్రయల్స్‌లో సత్తా చాటి వీరిద్దరు ఆ అవకాశం దక్కించుకున్నారు. ఇద్దరూ కూడా భారత దేశవాళీ మహిళల లీగ్‌లో గోకులమ్ ఎఫ్‌సీకే ప్రాతినిధ్యం వహించారు. క్రొయేషియాలో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన డైనమో జాగ్రెబ్ 46 ట్రోఫీలు గెలుచుకుంది. చదవండి: Japan Open 2022: ముగిసిన శ్రీకాంత్ పోరాటం.. బరిలో మిగిలింది ఒకే ఒక్కడు -
భారత మహిళల ఫుట్‌బాల్ జట్టుతో కూలీ నెం. 1
Varun Dhawan Met With Indian Women's Football Team: భారత మహిళల ఫుట్‌బాల్ జట్టును కలిసి బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కలిశాడు. నాలుగు దేశాల(ఇండియా, బ్రెజిల్, చిలీ, వెనిజులా)తో ఆడనున్నటోర్నమెంట్‌లో శనివారం బ్రెజిల్‌లోని మనాస్‌కు వెళ్తుండగా విమానాశ్రయంలో వరుణ్ ధావన్ తారసపడ్డాడు. ఈ సందర్భంగా మహిళల ఫుట్‌బాల్ టీం, వరుణ్ ధావన్ కలిసి కెమెరాను క్లిక్‌మనిపించారు. ఫొటోలో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోకు ఫోజులిచ్చారు. ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 57వ ర్యాంక్‌లో ఉన్న భారత మహిళ జట్టు, నవంబర్ 25న ఏడో ర్యాంక్‌లో ఉన్న బ్రెజిల్‌తో, నవంబర్ 28న చిలీ (37వ ర్యాంక్), డిసెంబర్ 1న వెనిజులా (56వ ర్యాంకు)తో తలపడనుంది. ఇప్పటికే బ్రెజిల్‌కు కాన్ఫెడెరాకో బ్రెజిలీరా డి డిస్పోర్టోస్ (CBF) పేరుతో పూర్తి జట్టుగా మారింది. ఇందులో మార్టా డా సిల్వా, ఫార్మిగా మోటా వంటి దిగ్గజాలు కూడా ఉన్నారు. జనవరి 2022 నుంచి ముంబై, పూణెలలో జరిగే ఆసియా కప్ కోసం భారత జట్టు ప్రాక్టీస్‌లో భాగంగా ఎక్స్పోజర్ టూర్ ఉంది. ఇదిలా ఉంటే, తన రాబోయే చిత్రం ఫ్యామిలీ డ్రామా అయిన 'జగ్ జగ్ జీయో' విడుదల తేదిని శనివారం వరుణ్ ప్రకటించాడు. వరుణ్ ధావన్, కియారా అద్వాని, నీతూ కపూర్, అనిల్ కపూర్, మనీష్ పాల్, ప్రజక్తా కోలీ నటిస్తున్న ఈ చిత్రం జూన్ 24, 2022న థియేటర్లలోకి రానుంది. View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) చదవండి: వరుణ్ ధావన్ షాకింగ్ లుక్, అనిల్ కపూర్ స్పందన! -
భారత మహిళల ‘హ్యాట్రిక్'
ఇస్లామాబాద్: పాత ప్రత్యర్థి. కొత్త వేదిక. అయినా అదే ఫలితం. దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) మహిళల చాంపియన్‌షిప్‌లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ భారత జట్టు మరోసారి విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో టీమిండియా 6-0 గోల్స్ తేడాతో నేపాల్‌ను చిత్తు చేసి వరుసగా మూడోసారి ఈ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకొని ‘హ్యాట్రిక్’ సాధించింది. 2010 (బంగ్లాదేశ్‌లో), 2012 (శ్రీలంకలో) ఫైనల్స్‌లోనూ నేపాల్‌నే ఓడించిన భారత్‌కు ఈసారీ పోటీ ఎదురవలేదు. ఈ టోర్నీలో ఆద్యంతం దూకుడుగా ఆడిన భారత్ మొత్తం 36 గోల్స్ చేసి, కేవలం ఒక గోల్ మాత్రమే ప్రత్యర్థికి సమర్పించుకుంది. టైటిల్ పోరులో ఫేవరెట్‌గా దిగిన టీమిండియాకు 26వ నిమిషంలో కమలా దేవి తొలి గోల్‌ను అందించింది. ఆ తర్వాత బాలా దేవి నాలుగు గోల్స్ (31వ, 34వ, 51వ, 90+2వ నిమిషాల్లో) చేయగా, రోమీ దేవి (46వ నిమిషంలో) ఒక గోల్ సాధించింది. ఈ టోర్నీలో బాలా దేవి మొత్తం 16 గోల్స్ చేసి ‘టాప్ స్కోరర్’గా నిలిచింది.