పట్టుదల...పోరాటం...అద్భుతం | The success story of the Indian womens football team | Sakshi
Sakshi News home page

పట్టుదల...పోరాటం...అద్భుతం

Jul 8 2025 3:42 AM | Updated on Jul 8 2025 3:42 AM

The success story of the Indian womens football team

భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టు విజయగాథ

ప్రతికూలతలను దాటి ఆసియా కప్‌ టోర్నీకి అర్హత 

సభ్యులందరి సమష్టి ఘనత

జనవరి 2022... ఆతిథ్య దేశం హోదాలో భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టు ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైంది. అయితే ఒక్కసారిగా ప్రపంచాన్ని తలకిందులు చేసిన కోవిడ్‌ మహమ్మారి ప్రభావం ఈ జట్టుపై కూడా పడింది. చైనీస్‌ తైపీతో తొలి మ్యాచ్‌ సమయానికి కోవిడ్‌ కారణంగా మన జట్టుకు కనీసం 13 మంది ప్లేయర్లు కూడా అందుబాటులో లేకుండా పోయారు. దాంతో నిబంధనల ప్రకారం మొదటి మ్యాచ్‌ నుంచే కాకుండా మొత్తం టోర్నీ నుంచి టీమ్‌ తప్పుకోవాల్సి వచ్చింది. 

క్వాలిఫయింగ్‌ పోటీలు లేని సమయంలో 2003లో చివరిసారిగా ఆసియా కప్‌కు నేరుగా అర్హత సాధించిన మన జట్టు ఈసారి ఎంతో ఉత్సాహంతో, పట్టుదలతో సొంతగడ్డపై ఆసియా కప్‌కు సన్నద్ధమైంది. అయితే అనూహ్య పరిణామాలు ఎదురు కావడం మన మహిళలకు ఇది తీరని వేదన మిగిల్చింది. ఇప్పుడు మూడున్నరేళ్ల తర్వాత క్వాలిఫయింగ్‌ టోర్నీలో సత్తా చాటి మన మహిళలు దర్జాగా ఆసియా కప్‌కు అర్హత సాధించారు. అయితే గత టోర్నీ, ప్రస్తుత క్వాలిఫికేషన్‌కు మధ్య ఎంతో పోరాటం ఉంది. సవాళ్లు, ప్రతికూలతలు అధిగమించి అమ్మాయిలు సాధించిన ఈ గెలుపునకు ఎంతో ప్రత్యేకత ఉంది.  

సాక్షి క్రీడా విభాగం :  ఆసియా కప్‌లో ఆడకుండానే బరి నుంచి తప్పుకోవడం మొదలు ఇప్పుడు అర్హత సాధించడం వరకు భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టుకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. సరైన దిశా నిర్దేశం లేకుండా, అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) తమ బాధ్యతను మరిచి పట్టించుకోకపోవడంతో అనాథలా కనిపించింది. అసలు జాతీయ జట్టు ఉందనే విషయాన్ని కూడా అంతా మర్చిపోయారు. ఒకటా, రెండా ఎన్నో పరిణామాలు మహిళల ఫుట్‌బాల్‌ పతనానికి దారి తీశాయి. 

అండర్‌–17 జట్టు కోచ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు, ‘శాఫ్‌’ టోర్నీ సెమీస్‌లో నేపాల్‌ చేతిలో పరాజయం, అండర్‌–17 వరల్డ్‌ కప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓడి నిష్క్రమణ, ఆసియా క్రీడల్లో చివరి స్థానం, ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో ఆఖరి స్థానం, పేరుకే ఇండియన్‌ ఉమెన్‌ లీగ్‌ ఉన్నా కనీస సౌకర్యాలు కల్పించలేని ఫెడరేషన్‌... ఇలా మహిళల జట్టుకు సమస్యలు నిర్విరామంగా సాగుతూనే వచ్చాయి. 

ఇలాంటి స్థితి నుంచి పైకి లేచి మన టీమ్‌ ఆసియా కప్‌కు అర్హత సాధించడం చిన్న విషయమేమీ కాదు. నాలుగు మ్యాచ్‌లలో నాలుగూ గెలవడం అసాధారణ ప్రదర్శనగా చెప్పవచ్చు. ముఖ్యంగా కొంత మంది ప్లేయర్లకు వ్యక్తిగతంగా కూడా ఇది ఎంతో ప్రత్యేక ఘనత. అందుకే థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌ గెలవగానే వారంతా కన్నీళ్లపర్యంతమయ్యారు. వారి భావోద్వేగాలను నిలువరించడం ఎవరి వల్లా కాలేదు.  

వరుసగా కోచ్‌ల మార్పు... 
భారత మహిళల జట్టుకు ఎదురైన ఇటీవలి అనుభవాలు చూస్తే టీమ్‌ ఎలా నడుస్తోందో అర్థమవుతుంది. సంవత్సరాల తరపడి స్వయంగా ఫెడరేషన్‌ నిర్వహించే లీగ్‌లో కూడా ఆట జరుగుతుందా లేదా అనే సందేహాలు, జాతీయ శిబిరానికి వెళ్లినా తర్వాతి రోజు కోచ్‌ వస్తాడా లేదా అనుమానం, అసలు మహిళలుగా తమకు కనీస భద్రత కూడా ఉంటుందా లేదా అని పరిస్థితిని వారు దాటుకుంటూ వచ్చారు. ఏఐఎఫ్‌ఎఫ్‌ వరుసగా కోచ్‌లను మారుస్తూ పోయింది. డెనర్‌బై, సురేన్‌ ఛెత్రి, ఛోబా దేవి, సంతోష్‌ కశ్యప్, జోకిమ్‌ అలెగ్జాండర్సన్‌... ఇలా కోచ్‌లు రావడం, పోవడం జరిగిపోయాయి. చివరకు క్రిస్పిన్‌ ఛెత్రి చేతుల్లోకి కోచింగ్‌ బాధ్యతలు వచ్చాయి. 

అతనికి అసిస్టెంట్‌గా పీవీ ప్రియను తీసుకున్నారు. ఆసియా కప్‌ కోసం మన జట్టు థాయ్‌లాండ్‌లో అడుగు పెట్టినప్పుడు కూడా ఎలాంటి అంచనాలు లేవు. 2022లో కోవిడ్‌ కారణంగా టోర్నీకి దూరమైన జట్టులో ఉన్నవారిలో చాలామంది ఈ సారి కూడా టీమ్‌లో ఉన్నారు. నాటి గాయం వారి మనసుల్లో ఇంకా మిగిలే ఉంది.

కోచ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ వివాదం వచ్చినప్పుడు అండర్‌–17 టీమ్‌లో భాగమైన హేమమ్‌ షిల్కీ దేవి, లిండా కోమ్, మార్టినా తోక్‌చోమ్‌ ఇప్పుడు సీనియర్‌ టీమ్‌లో ఉన్నారు. పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు చిత్తుగా ఓడిన సందర్భాల్లోనూ వార్తల్లో ఉంటుండగా... మహిళల టీమ్‌ను అసలు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి స్థితిలో వారు తమ పోరాటాన్ని మొదలు పెట్టారు.  

పటిష్ట ప్రత్యర్థి ని పడగొట్టి... 
మంగోలియాపై 13–0తో, తిమోర్‌ లెస్టెపై 4–0తో, ఆపై ఇరాక్‌పై 5–0తో ఘన విజయం... అంచనాలకు భిన్నంగా చక్కటి ప్రదర్శనతో మన మహిళలు వరుసగా మూడు విజయాలు సాధించారు. అయితే సరే ఆసియా కప్‌ క్వాలిఫికేషన్‌పై ఇంకా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే చివరి లీగ్‌లో ఆతిథ్య థాయ్‌లాండ్‌ ప్రత్యరి్థగా ఎదురైంది. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో మనకంటే ఎంతో ముందుండటం మాత్రమే కాదు, ఈ టీమ్‌ గత రెండు ‘ఫిఫా’ వరల్డ్‌ కప్‌లు కూడా ఆడింది. 

పైగా పెద్ద సంఖ్యలో విదేశీ ఆటగాళ్లు ఉండటంతో పాటు ప్రముఖ జపాన్‌ కోచ్‌ ఫుటోషీ ఐకెడా కోచింగ్‌ ఇస్తున్నాడు. మనకంటే బలమైన థాయ్‌లాండ్‌ జట్టు ఆరంభంలోనే దూకుడుగా ఆడి గోల్‌పోస్ట్‌పై దాడులు చేస్తూ ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే భారత్‌ పదునైన డిఫెన్స్‌తో వాటిని నిలువరించగలిగింది. తాము ఇంత కాలంగా పడిన ఆవేదన, చేసిన పోరాటం వారిలో ఒక్కసారిగా స్ఫూర్తి నింపినట్లుంది. అంతే... ఆ తర్వాత జట్టులో ఒక్కసారిగా కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రత్యర్థి ఎవరనేది పట్టించుకోకుండా చివరి వరకు పట్టు విడవకుండా చెలరేగిన జట్టు విజయాన్ని అందుకుంది.

అన్ని రకాలుగా సన్నద్ధమై...
మ్యాచ్‌ ముగిశాక సంగీత బస్‌ఫోర్‌ ఆనందానికి హద్దుల్లేవు. రెండు గోల్స్‌తో ఆమె ఈ చిరస్మరణీయ విజయంలో కీలకపాత్ర పోషించింది. కోవిడ్‌ కారణంగా 2022 ఆసియా కప్‌కు జట్టుకు దూరంగా కాగా, అంతకుముందే గాయంతో సంగీత టోర్నీ నుంచి తప్పుకుంది. 2019 నుంచి జట్టులో ప్రధాన సభ్యురాలిగా ఉన్న ఆమె ఆపై కోలుకోవడానికి ఏడాది పట్టింది. అదే సమయంలో ఆమె తండ్రిని కూడా కోల్పోయింది. సీనియర్‌ ప్లేయర్‌ అయిన తనకు భవిష్యత్తులో మళ్లీ ఎప్పుడు ఈ స్థాయిలో విజయానందం వరిస్తుందో అంటూ ఆమె ఆనందభాష్పాలు రాల్చింది. 

టోర్నీకి ముందు తమదైన రీతిలో ప్లేయర్లు సన్నద్ధమయ్యారు. మనీషా కళ్యాణ్, జ్యోతి చౌహాన్, తెలంగాణ ప్లేయర్‌ గుగులోత్‌ సౌమ్య యూరోపియన్‌ క్లబ్స్‌ ట్రయల్స్‌కు వెళ్లి కాంట్రాక్ట్‌లు పొంది తమ ఆటకు పదును పెట్టారు. మిగిలిన వారు ఐ–లీగ్‌లో బరిలోకి దిగి సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టారు. ఈ విజయం కచ్చితంగా ఏఐఎఫ్‌ఎఫ్‌ది మాత్రం కాదు. తమ శక్తి, స్వేదం, కన్నీళ్లు ధారబోసిన 23 మంది మహిళా ఫుట్‌బాలర్లదే. వచ్చే ఏడాది ఆసియాకప్‌లో కూడా ఇదే రీతిలో సత్తా చాటితే వరల్డ్‌ కప్‌లో పాల్గొనే స్వప్నం కూడా సాకారమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement