
అంతర్జాతీయంగా నేలచూపు
6.3 శాతం పతనమైన పసిడి
8.7 శాతం కుప్పకూలిన వెండి
దేశీయంగానూ నేడు ప్రభావం
సాక్షి, బిజినెస్ డెస్క్: కొద్ది నెలలుగా అప్రతిహతంగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఉన్నట్టుండి కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లలో గత 12 ఏళ్లలోలేని విధంగా పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 6.3 శాతం పతనంకాగా.. వెండి మరింత అధికంగా 2021 తదుపరి 8.7 శాతం పడిపోయింది. వెరసి యూఎస్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి ధర 4,082 డాలర్లకు చేరగా.. వెండి ఔన్స్ 47.89 డాలర్లను తాకింది. దీంతో దేశీయంగా బంగారం 10 గ్రాములు కనీసం రూ. 6,000 తగ్గవలసి ఉన్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.
దేశీయంగా ఇటీవల బంగారం 10 గ్రాములు రూ. 1,34,800ను తాకగా.. వెండి రూ. 1,85,000కు చేరిన విషయం విదితమే. అయితే డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, దిగుమతి సుంకం మదింపు తదుపరి ధరలు నిర్ణయమయ్యే సంగతి తెలిసిందే. ఈ బాటలో పలాడియం, ప్లాటినం ధరలు సైతం అంతర్జాతీయ మార్కెట్లో 7 శాతం చొప్పున పతనం కావడం గమనార్హం! కాగా.. 2025 డిసెంబర్ ఫ్యూచర్స్ పసిడి రాత్రి 10.30 ప్రాంతంలో 5.5 శాతం (237 డాలర్లు) క్షీణించి 4,122 డాలర్ల వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో గరిష్టంగా 4,393 డాలర్లకు చేరగా.. 4,095 డాలర్ల వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ 7.36 శాతం పడిపోయి 47.60 డాలర్ల వద్ద కదులుతోంది. ఒక దశలో 51.61 డాలర్ల వద్ద గరిష్టాన్ని, 47.14 డాలర్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
కారణాలేటంటే?
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన యూఎస్, చైనా మధ్య నెలకొన్న టారిఫ్ వార్ విషయంలో సానుకూల చర్చలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ విలువ పుంజుకోవడం, యూఎస్ ప్రభుత్వ షట్‌డౌన్ వంటి అంశాలు పసిడి, వెండి తదితర విలువైన లోహాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే వారం చైనా, యూఎస్ ప్రెసిడెంట్‌ల మధ్య సమావేశం జరగనుండటం సానుకూల అంశంగా తెలియజేశాయి.
మరోవైపు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండి ఈటీఎఫ్‌లకు ఇన్వెస్టర్ల నుంచి భారీస్థాయిలో పెట్టుబడులు ప్రవహించడం మెటల్స్‌లో భారీ ర్యాలీకి కారణమైంది. టెక్నికల్‌గా ఓవర్‌బాట్ పొజిషన్‌కు చేరడంతోపాటు.. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణలో భాగంగా అమ్మకాలు చేపట్టడం విలువైన లోహాలలో కరెక్షన్‌కు దారితీస్తున్నట్లు వివరించారు.