వెండి ఆభరణాల నాణ్యతను ప్రామాణికంగా ధృవీకరించే దిశగా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలో 17.35 లక్షల ఐటమ్‌లను హాల్‌మార్కింగ్ (హెచ్‌యూఐడీ) చేసినట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
ఈ ప్రక్రియలో భాగంగా భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) ప్రామాణిక మార్కుకి అదనంగా ప్రతి ఉత్పత్తిపై విశిష్టమైన ఆరు అంకెల కోడ్‌ను, సిల్వర్ అనే పదం, స్వచ్ఛత గ్రేడ్ వివరాలను ముద్రిస్తారని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
సదరు ఉత్పత్తి ప్రమాణాలను ధృవీకరించిన అసేయర్–హాల్‌మార్కింగ్ సెంటర్‌ని కూడా ట్రాక్ చేసేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయి. బీఐఎస్ కేర్ మొబైల్ యాప్‌లో హెచ్‌యూఐడీని ఎంటర్ చేసి హాల్‌మార్క్ గల వెండి ఆభరణాల ప్రామాణికతను వినియోగదారులు తక్షణం తెలుసుకోవచ్చు.


