డిజిటల్ యుగంలో వర్క్-లైఫ్ సమతుల్యత తీవ్రంగా ప్రభావితమవుతోందనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆఫీసు పనివేళల తర్వాత పని సంబంధిత కాల్స్, ఈమెయిల్స్ లేదా ఇతర కమ్యూనికేషన్ల నుంచి దూరంగా ఉండే హక్కును కల్పించే ఒక ముఖ్యమైన ప్రైవేట్ మెంబర్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP-శరద్‌చంద్ర పవార్) ఎంపీ సుప్రియా సూలే ఈ ‘రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు, 2025’ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పని భారం పెరిగి, వ్యక్తిగత సమయం కరువవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని, శ్రేయస్సును కాపాడటమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని చెప్పారు.
రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు, 2025
పనివేళలు ముగిసిన తర్వాత, అలాగే సెలవు దినాల్లో పని సంబంధిత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లకు (కాల్స్, ఈమెయిల్స్, మెసేజ్‌లు) స్పందించకుండా ఉండే చట్టబద్ధమైన హక్కును ఉద్యోగులకు కల్పించడం దీని ఉద్దేశం. ఈ హక్కును వినియోగించుకున్నందుకుగాను ఉద్యోగిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు లేదా ప్రతికూల శిక్షలు ఉండకుండా ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది.
ఈ బిల్లు ఉద్యోగుల సంక్షేమ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. 10 మందికి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీలు పనివేళల తర్వాత కమ్యూనికేషన్ నిబంధనలపై ఉద్యోగులతో చర్చలు జరపడం, నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై జరిమానా (ఉద్యోగుల మొత్తం వేతనంలో 1% వరకు) విధించడం వంటివి కూడా ఈ బిల్లులో ఉన్నాయి.
ప్రైవేట్ మెంబర్ బిల్లు మాత్రమే..
ఇది ప్రైవేట్ మెంబర్ బిల్లు. కేంద్ర మంత్రులు కాకుండా సాధారణ పార్లమెంట్ సభ్యులు ప్రవేశపెట్టే ఈ బిల్లులు చట్టాలుగా మారడం భారతదేశంలో చాలా అరుదు. అయినప్పటికీ, ఇది ఉద్యోగుల వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఇదీ చదవండి: ‘యూరప్ కంటే మనం చాలా నయం’


