సాక్షి,గుంటూరు: మంగళగిరి జనసేన కార్యాలయం దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. తమకు నష్టపరిహారం ఇప్పించాలని మల్లవల్లి రైతులు ధర్నా చేశారు. 10 రోజుల్లో న్యాయం చేస్తామని పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన ఆఫీస్‌కు ఇప్పటికి 27సార్లు వచ్చినా పట్టింపులేదంటూ రైతులు మండిపడ్డారు. పవన్ కల్యాణ్ తమను కలవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రైతులను పోలీసులు అడ్డుకున్నారు.
కాగా, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో నిన్న (నవంబర్ 24, సోమవారం) పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు ప్రజలు, కార్మీకుల నుంచి నిరసనల సెగ తగిలిన సంగతి తెలిసిందే. సమస్యలు చెప్పుకుందామని వచ్చిన తమ పట్ల డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వ్యవహరించిన తీరుపై శ్రీ సత్యసాయి గోదావరి తాగునీటి పథకం కార్మీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ప్రాంతంలో పనిచేస్తున్న 52 మంది కార్మీకులకు ప్రభుత్వం 20 నెలలుగా జీతాలు, 34 నెలలుగా ఈఎస్‌ఐ, పీఎఫ్ చెల్లించడం లేదు. మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో వారంతా పవన్‌కళ్యాణ్‌కు గోడు వెళ్లబోసుకునేందుకు విమానాశ్రయానికి వచ్చారు. కానీ, పవన్‌ను కలిసేందుకు కార్మీకులకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై మండిపడిన కార్మీకులు పవన్‌కళ్యాణ్ కాన్వాయ్ వెళ్లే మార్గంలో మధురపూడి సాయిబాబా ఆలయ సమీపాన ప్లకార్డులతో నిరసన తెలిపారు.


