కడప: మెడికల్ కాలేజీ ఉద్యోగులపై మరోసారి కక్ష సాధింపు చర్యలకు దిగింది కూటమి ప్రభుత్వం. మెడికల్ కాలేజ్ ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి బదిలీ చేసింది. .పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి 100 సీట్లు రావడంతో పీపీపీ కింద ప్రైవేట్ పరం చేయనున్న కాలేజీల్లో ఉద్యోగుల బదిలీ చేస్తోంది ప్రభుత్వం. వారిని పొమ్మనలేక పొగబెట్టినట్లు చేస్తోంది కూటమి ప్రభుత్వం. పులివెందుల, మదనపల్లి, మార్కాపురం, ఆదోని కాలేజీల నుంచి 600 మంది ఉద్యోగుల బదిలీ చేసింది.
తక్కువ జీతంతో పనిచేస్తున్న చిరు ఉద్యోగులకు ఈ బదిలీలు శరాఘాతంగా మారాయి. మరొకవైపు 600 మంది ఉద్యోగుల బదిలీతో ప్రశ్నార్థకంగా మారింది ఆయా మెడికల్ కాలేజీల భవితవ్యం. వైఎస్ జగన్ హయాంలో వారి నియామకం జరిగిందనే అక్కసుతోనే ఈ బదిలీలు అనే విమర్శ వినిపిస్తోంది.
ఆయా మెడికల్ కాలేజీల నుంచి జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యాధునిక పరికరాలు తరలింపు ఇప్పటికే జరిగిపోగా, ఇప్పుడు ఉద్యోగుల బదిలీ కార్యక్రమం చేపట్టింది కూటమి సర్కారు.
పులివెందుల మెడికల్ కాలేజీకి వచ్చిన 50 సీట్లను కూటమి సర్కార్ వెనక్కి పంపగా, పలువురు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సైతం బదిలీ చేస్తూ వస్తుంది. మరో వైపు పీపీపీ టెండర్లలో ఆయా మెడికల్ కాలేజీలను తీసుకునేందుకు సంస్థలు ముందుకు రాకపోగా, బదిలీలతో పులివెందుల, మదనపల్లి, ఆదోని, మార్కాపురం మెడికల్ కాలేజీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.


