సంక్రాంతి వచ్చిందంటే..కోడి పందేల జోషే వేరు. పండుగ ముందుగానే బరులు సిద్ధమవుతాయి. పందెంకోళ్లు యుద్ధ క్షేత్రంలోకి దిగుతాయి. శిక్షణ పొందిన కోళ్లు హోరా హోరీగా పోట్లాడుతాయి. ఊపిరి ఆగేదాక రక్తం చిందించి మరీ పోరాడతాయి.బరిలో దిగిన కోడి గెలిస్తే ప్రపంచాన్ని జయించిన సంతోషం. ఈ పందేల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి. పందేలు నిర్వహించేందుకు పోలీసుల అనుమతి కోసం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సంక్రాంతి పండుగ సంబరాల్లో కోడి పందేలు ప్రత్యేకం. మూడు రోజుల ముందుగానే జిల్లాలో బరులు సిద్ధమయ్యాయి. తీరప్రాంతాల్లోని గ్రామాల్లో కోడి పందేల నిర్వాహకులు ఢీ అంటే ఢీ అంటున్నారు. కత్తి కట్టి కదనరంగానికి దూకేందుకు కోళ్లను దువ్వుతున్నారు. జిల్లాలోని తూర్పు ప్రాంతం, తీర ప్రాంతాలు, పశి్చమ ప్రకాశంలోని కొన్ని గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించనున్నట్లు సమాచారం. అధికార టీడీపీ నాయకులు బరులు తమ ఆ«దీనంలో ఉంచుకునేందుకు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు
సమాచారం.
పల్లెసీమల్లో కోడి పందేల జోష్...
జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించడానికి సన్నాహాలు పూర్తి చేసినట్లు సమాచారం. ప్రతిసారి కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లోని తీర ప్రాంతాల్లో ఎక్కువగా కోడి పందేలు నిర్వహిస్తుంటారని వినికిడి. ఈ ఏడాది కూడా ఆయా ప్రాంతాల్లో మూడు రోజులు ముందుగానే బరులు సిద్ధం చేసినట్లు చెప్పుకుంటున్నారు. కొత్తపట్నం మండలంలోని మోటుమాల, రాజుపాలెం, గవండ్లపాలెం, మడనూరు, రాజుపాలెం పట్టపుపాలెం, గుండమాల గ్రామాల్లో కోడి పందేలు నిర్వహిస్తుంటారని సమాచారం. ఒంగోలు మండలంలోని కరవది, గుండాయిపాలెం సముద్రం ఒడ్డున, చేజర్ల, పాతపాడు తదితర గ్రామాల్లో ఇప్పటికే బరులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సింగరాయకొండ మండలంలోని పాకల, పాత సింగరాయకొండ, ఊళ్లపాలెం, సోమరాజుపల్లి, జరుగుమల్లి మండలంలోని నర్సింగోలు, పొన్నలూరు మండలంలోని కె.అగ్రహారం గ్రామాల్లో పోటాపోటీగా పందేలు నిర్వహించేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం.
టంగుటూరు మండలంలోని కొణిజేడు, కొత్తపట్నం మండలంలోని రాజుపాలెం, గవళ్లపాలెం, సింగరాయకొండ మండలంలోని పాకల గ్రామాల్లో జరిగే పోటీలకు చుట్టు పక్కల గ్రామాల నుంచి జనాలు అత్యధికంగా వస్తుంటారని చెప్పుకుంటున్నారు. చీమకుర్తి మండలంలోని తొర్రగుడిపాడు, ఎర్రగుడిపాడు గ్రామాల్లో భారీ ఎత్తున పందేలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. అలాగే గుడ్లూరు సరిహద్దులోని రామాయపట్నం, కొండపి, సంతనూతలపాడు సరిహద్దుల్లోని మద్దలూరు వాగు ఒడ్డులో కోడి పందేలు నిర్వహించేందుకు గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామాల శివారు ప్రాంతాల్లో కోడి పందేలు పుంజుకుంటున్నాయి. అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి, జె.పంగులూరు, సంతమాగులూరు, కొరిశపాడు మండలాల్లో కూడా అక్కడక్కడా కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ....
జిల్లాలో పందెం కోళ్లను ప్రత్యేకంగా పెంచి అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం. చీమకుర్తి రోడ్డు, దర్శి దగ్గర రాజంపల్లి, తాళ్లూరు, తూర్పు గంగవరం, కొత్తపట్నం మండలంలోని మడనూరు గ్రామాల్లో పందెం కోళ్లను ప్రత్యేకంగా పెంచుతున్నట్లు తెలుస్తోంది. పందెం కోళ్లకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. కోడి పుంజులను వాటి రంగు, ఎత్తు, పోరాట పటిమ ఆధారంగా ధర నిర్ణయిస్తారు. ఒక్కో కోడి రూ.10 వేల నుంచి లక్ష రూపాయలు విక్రయిస్తుంటారని సమాచారం. ఈ కోళ్లను కొందరు ఇళ్ల వద్దనే పెంచితే మరికొందరు మాత్రం పొలాలు, చెరువుల వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంటారు. వీటికి బాదంపప్పు, పిస్తా, జీడిపప్పుతో పాటుగా కోడిగుడ్లు, మటన్ వంటి పౌష్టికాహారాన్ని తినిపిస్తారు. అలాగే పందేలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
రూ.కోట్లలో పందేలు...
జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించే కోడి పందేల్లో భారీగా చేతులు మారుతాయని ప్రచారం జరుగుతోంది. పందెంకాసిన దానికి రెట్టింపు లాభం వస్తుండడంతో బెట్టింగ్ రాయుళ్లు కొందరు అప్పులు చేసి మరీ పందెం కాస్తుంటారని ప్రచారం జరుగుతోంది. రెండు గ్రూపులను కలిపి జోళ్లు అని పిలుస్తుంటారని, జోళ్లు పందెం కాసినవాళ్లు లక్ష, రెండు లక్షల రూపాయలు కాస్తుంటారని చెబుతున్నారు. ఇలాంటి పోటీలకు నెల్లూరు, గుంటూరు నుంచి ఇక్కడకు వస్తుంటారని సమాచారం.
నెమలి...అబ్రాస్...సీతువా...
పందెం కోళ్లను చాలా మక్కువగా పెంచుతుంటారు. వాటికి ఖరీదైన ఆహారం ఇస్తుంటారు. అంతేకాకుండా ముద్దుగా నెమలి, అబ్రాస్, సీతువా వంటి పేర్లతో పిలుచుకుంటుంటారు. కాకిడేగ, కక్కెర, రసంగి, పింగల, కాశీ, కొక్కెరాయి వంటి పేర్లతో పిలుస్తుంటారు.
కత్తి కట్టి కదన రంగంలోకి...
కోడి పందేల సమయంలో పందెం కోళ్లకు కత్తి కట్టి బరిలోకి దింపుతారు. హోరాహోరీగా జరిగే పోరులో ఓటమిపాలైన కోడి కత్తి గాయాలతో తీవ్రంగా గాయపడి మరణిస్తుంటాయి. వన్యప్రాణి ప్రేమికుల విజ్ఞప్తి మేరకు పందెం సమయంలో కత్తి కట్టకూడదని ప్రభుత్వం ఆదేశాలున్నాయి. అయితే ప్రభుత్వం విధించిన నిబంధనలు పట్టించుకునే వారు లేరు. సంప్రదాయం ప్రకారం సరదాగా కోడి పందెం నిర్వహిస్తున్నట్లు చెబుతున్న నిర్వాహకులు దీన్ని ఫక్తు వ్యాపార ధోరణిలోనే సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో పందెం కోళ్లకు కత్తులు తయారు చేసేవారున్నారు. నగరంతో పాటుగా అనేక మండలాల్లో కత్తులు తయారు చేస్తున్న సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
పోలీసుల అనుమతి కోసం ఒత్తిళ్లు...
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లాలో కోడి పందేలు నిర్వహించుకోడానికి పోలీసుల అనుమతి కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో ఎస్పీ హర్షవర్థన్ రాజు విముఖంగా ఉండడంతో ప్రభుత్వ పెద్దల నుంచి చక్రం తిప్పేందుకు కొందరు ఎమ్మెల్యేలు ప్రయతి్నస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కోడి పందేలకు ఇలాగే అనుమతి తెచ్చుకున్నారు. ఈ ఏడాది కూడా పోలీసుల అనుమతి ఇప్పించాలని అధికార పార్టీకి చెందిన నిర్వాహకులు కోరుతున్నారు.


