నాటి ప్రణాళికలే.. నేటి ప్రగతికి బాటలు | Harbour Bogapuram Coastal Corridor ready for completion | Sakshi
Sakshi News home page

నాటి ప్రణాళికలే.. నేటి ప్రగతికి బాటలు

Feb 26 2026 5:06 AM | Updated on Feb 26 2026 5:06 AM

Harbour Bogapuram Coastal Corridor ready for completion

హార్బర్‌–బోగాపురం కోస్టల్‌ కారిడార్‌ పట్టాలెక్కేందుకు సిద్ధం 

రూ.6,289 కోట్లతో విశాఖ తీరాన ఆవిష్కృతమవుతున్న మెగా ప్రాజెక్టు 

ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేతో మారనున్న తీరప్రాంత రూపురేఖలు 

గత ప్రభుత్వ హయాంలో డీపీఆర్, మాస్టర్‌ప్లాన్‌లో రూపకల్పన 

విశాఖ సిటీ: ఒక నగరం ప్రపంచస్థాయి మెట్రోపాలిటన్‌గా ఎదగాలంటే కేవలం ఆకాశహర్మ్యాలు ఉంటే సరిపోదు, పటిష్టమైన మౌలిక సదుపాయాలు ఉండాలి. సరిగ్గా ఇదే దూరదృష్టితో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చే కీలక ప్రాజెక్టులకు పునాదులు వేయగా, అవే ఇప్పుడు ప్రగతికి దిక్సూచిగా మారాయి. అందులో ప్రధానమైన ‘వైజాగ్‌ కోస్టల్‌ హైవే’ ప్రాజెక్టు ఇప్పుడు పట్టాలెక్కడానికి సిద్ధమవుతోంది. 

విశాఖ ఓడరేవు నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఆరు వరుసల ఎక్స్‌ప్రెస్‌కు అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టు కేవలం ట్రాఫిక్‌ సమస్యలను తీర్చడమే కాకుండా, పర్యాటక, పారిశ్రామిక రంగాలకు కొత్త ఊపిరి పోయనుంది. సుమారు 55 కిలోమీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో తీరం వెంబడి సాగే ఈ రహదారి అభివృద్ధికి త్వరలోనే అంకురార్పణ జరగనుంది. 

పట్టాలెక్కనున్న ప్రాజెక్టు 
ప్రస్తుతం ఈ ప్రాజెక్టు అమలు దశలోకి అడుగుపెడుతోంది. హార్బర్‌ నుంచి కైలాసగిరి వరకు ఉన్న 30 మీటర్ల రహదారిని 40 మీటర్లకు, అక్కడి నుంచి భోగాపురం వరకు 60 మీటర్లకు విస్తరించనున్నారు. రుషికొండ సమీపంలో ప్రతిపాదించిన ఎలివేటెడ్‌ కారిడార్‌ ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సముద్ర అందాలకు ఆటంకం కలగకుండా, భూసేకరణ సమస్యలు తలెత్తకుండా దీనిని రూపకల్పన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటికి దీనిపై దృష్టి సారించింది. 

గతంలో ఉన్న ప్లాన్‌కు చిన్న పాటి సాంకేతిక మార్పులు చేస్తోంది. ముఖ్యంగా ఎలివేటెడ్‌ కారిడార్‌ పొడవును పెంచడం, భీమిలిలో నేరేళ్లవలస కొద్దిగా ముందగానే రహదారిని మళ్లిస్తూ డిజైన్లను మార్పు చేసింది. ఈ మార్పుతో ఇంకా కొంత మేర భూ సేకరణ చేపట్టాల్సి వస్తోంది. భీమిలి నుంచి భోగాపురం వరకూ 19.66 కిలోమీటర్ల మేర గ్రీన్‌ ఫీల్ట్‌ కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం సుమారు 350 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. 

ఈ కోస్టల్‌ కారిడార్‌ ప్రాజెక్టు భూసేకరణకు రూ.4,315 కోట్లు, నిర్మాణాలకు రూ.1,974 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టును రెండు లేదా మూడు రీచ్‌లుగా విభజించి పనులు చేపట్టనున్నారు. వైజాగ్‌ కోస్టల్‌ హైవే కేవలం ఒక రోడ్డు ప్రాజెక్ట్‌ మాత్రమే కాదని, ఇది విశాఖను గ్లోబల్‌ సిటీగా మార్చే క్రమంలో ఒక కీలక అడుగుగా పారిశ్రామికవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఐటీ రంగానికి నిలయమైన రుషికొండ, పర్యాటక ప్రాంతమైన భీమిలి, అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం.. ఈ మూడింటిని కలిపే ఈ రహదారి ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేస్తుందని భావిస్తున్నారు. 

నాడు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపకల్పన
విశాఖను గ్లోబల్‌ హబ్‌గా మార్చాలనే సంకల్పంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ కోస్టల్‌ కారిడార్‌కు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ఈ ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళికలో చేర్చింది. విశాఖ నగరం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ‘సిక్స్‌ లేన్‌’ డిజైన్లను ఖరారు చేసింది. 

భారీ వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ విషయంలో గత ప్రభుత్వం సాహసోపేత అడుగులు వేసింది. వీఎంఆర్‌డీఏ ద్వారా సుమారు 55 కిలోమీటర్ల మేర సాగే ఈ కారిడార్‌ కోసం ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతిని అనుసరించి రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకుంది. 

క్షేత్రస్థాయిలో అడ్డంకులను తొలగించి ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించడమే కాకుండా, పారదర్శకమైన రీతిలో మ్యాపింగ్‌ ప్రక్రియను పూర్తి చేయించింది. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరిపి, రూ. 6,289 కోట్ల వ్యయం అయ్యే ఈ రహదారిని జాతీయ రహదారిగా గుర్తింపజేయడంలో సఫలీకృతమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement