వీడని కల్తీ పాల ఆందోళన | Lab reports yet to be released in adulterated milk incident | Sakshi
Sakshi News home page

వీడని కల్తీ పాల ఆందోళన

Feb 26 2026 4:40 AM | Updated on Feb 26 2026 4:40 AM

Lab reports yet to be released in adulterated milk incident

చౌడేశ్వరి నగర్‌లో కొనసాగుతున్న వైద్య శిబిరం

ఇప్పటికే ఆరుగురి మృతి

వివిధ ఆస్పత్రుల్లో 15 మందికి చికిత్స  

వారిలో 9 మంది పరిస్థితి విషమం 

ఐసీయూలో ఆరుగురు బాధితులు 

మరో 8 మందికి వెంటిలేటర్, డయాలసిస్‌ సేవలు 

వెంటిలేటర్‌కే పరిమితమైన మరొకరు

కల్తీ గుట్టు రట్టయ్యేదెప్పుడో 

ఇంకా వెలువడని ల్యాబ్‌ నివేదికలు  

ఇథలీన్‌ గ్లైకాల్‌ కలిసిందంటూ ప్రచారం 

యూరియా కలిసిందని మరికొందరి అనుమానం

సాక్షి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు (రాజమహేంద్రవరం):  రాజమహేంద్రవరంలో కల్తీపాల కలకలం కొనసాగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరు మృత్యువాత పడతారో అన్న ఆందోళన నెలకొంది. కల్తీ పాలు తాగి 21 మంది ఆస్పత్రుల్లో చేరగా.. ఇప్పటికే ఆరుగురు మృతి చెందిన విషయం విదితమే. ప్రస్తుతం 15 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. 

అధికారులు విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌  ప్రకారం.. శనివారం నుంచి ముగ్గురికి డయాలసిస్‌ చేస్తుండగా బుధవారం నాటికి ఆ సంఖ్య 6కు పెరిగింది. వెంటిలేటర్, డయాలసిస్‌ సేవలు పొందుతున్న వారు ముగ్గురు ఉండగా.. బుధవారం ఆ సంఖ్య 8కి చేరింది. మరొకరు వెంటిలేటర్‌ మీద ఉన్నారు.  

దయనీయ స్థితిలో ముగ్గురు చిన్నారులు 
రాజమహేంద్రవరంలోని కిమ్స్‌ ఆస్పత్రిలో 8 మంది బాధితులకు.. రెయిన్‌బో ఆస్పత్రిలో ముగ్గురు చిన్నారులకు వైద్యం అందిస్తున్నారు. వీరిలో 5 నెలల పసికందు పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. బొడ్డు నుంచి రోజుకు రెండుసార్లు డయాలసిస్‌ చేస్తున్నారు. అచేతనావస్థలో ఉన్న చిన్నారులను చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ‘ఎప్పటికి లేచి తిరుగుతారు కన్నా..’ అంటూ ఆందోళన చెందుతున్నారు.  

రక్త నమూనా నివేదికలు వచ్చేదెప్పుడో! 
నగరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్‌ నగర్, వెంకటేశ్వర నగర్‌ తదితర ప్రాంతాల్లో 110 కుటుంబాలకు కోరుకొండకు చెందిన గణేష్‌ పాలు పోశారు. ఈ కుటుంబాల పరిధిలో 315 రక్త నమూనాలు తీసుకున్నారు. పాల శీతలీకరణ యంత్రంలో లీకేజీ ఏర్పడి ఇథలీన్‌ గ్లైకాల్‌ పాలలో కలిసి ప్రమాదం జరిగిందంటూ ఆ పాలను, అస్వస్థతకు గురైన వారి రక్త నమూనాలు పరీక్షల నిమిత్తం ముంబైలోని ఫోరెనిక్స్‌ ల్యాబ్‌కు పంపారు. బాధితులకు అత్యవసరంగా ఇవ్వాల్సిన ఇంజెక్షన్లను రూ.లక్షలు వెచ్చించి ముంబై నుంచి హుటాహుటిన రప్పించారు. 

అయితే.. ఆ ఇంజెక్షన్లు నిరుపయోగంగా ఉన్నాయి. కల్తీపాలు తాగి ఆస్పత్రి పాలైన బాధితుల శరీరంపై ఇథలీన్‌ గ్లైకాల్‌ ప్రభావం ఉంటే మాత్రమే ఆ ఇంజెక్షన్లు చేయాలి. అలా కాకుండా కల్తీ జరిగి ఉంటే ఈ ఇంజెక్షన్లు పనిచేయవు. రక్త నమూనాలకు సంబంధించిన ల్యాబ్‌ రిపోర్టులు రావడంలో జాప్యం జరుగుతుండటంతో ఆ ఇంజెక్షన్లు ఉపయోగించలేని పరిస్థితి. ఈ సందిగ్ధ స్థితి బాధితులకు ప్రాణ సంకటంగా మారుతోంది. పాల కల్తీపై నేటికీ స్పష్టత రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.   

తిరుపతి ల్యాబ్‌కు రక్త నమూనాలు 
ముంబై ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి రిపోర్టులు రావడం ఆలస్యం అవుతుండటంతో అధికారులు బాధితుల నుంచి మరోసారి రక్త నమూనాలు సేకరించి తిరుపతిలోని ల్యాబ్‌కు పంపారు. వాటి నివేదిక గురువారం సాయంత్రానికి అందే అవకాశం ఉంది. దానిని బట్టి వైద్యం ఏవిధంగా చేయాలో నిర్ణయిస్తారు.   

భయం గుప్పిట్లో బాధితులు 
కల్తీ పాల ఘటన జరిగి ఇప్పటికే 10 రోజులు అవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. విషమంగా ఉన్న 8 మంది ఆరోగ్యంపై బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రిలో చేరిన వారే కాకుండా గణేష్‌ వద్ద పాలు వినియోగించిన వారినీ భయం వెంటాడుతోంది. తమపై కల్తీ పాలు దుష్ప్రభావం చూపిస్తాయా అన్న ఆందోళనతో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.  

నేతల కూలెంట్‌ లీకేజీ ప్రచారం 
ల్యాబ్‌ రిపోర్టులు ఇంకా బహిర్గతం కాలేదు. అయినా.. కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ ఒకే పాట అందుకున్నారు. వరలక్ష్మి డెయిరీలో ‘కూలెంట్‌ లీకేజీ’ జరిగి పాలల్లో ఇథలీన్‌ గ్లైకాల్‌ కలిసిందంటూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. అధికారుల దర్యాప్తులోనూ ఇదే వెల్లడైనట్టు ఎంపీ పురందేశ్వరి సహా ఎమ్మెల్యేలు, కూటమి ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ల్యాబ్‌ రిపోర్టులు అందకముందే ఇలాంటి ప్రచారం విస్తృతం చేయడం వెనుక ఏదో ఆంతర్యం దాగుందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

పొరపాటుగా కల్తీ జరిగిందని, ఇందులో ప్రభుత్వ పాత్ర లేదని చెప్పేందుకే కూలెంట్‌ వాదన తెరపైకి తెచ్చారన్న ఆరోపణలున్నాయి. తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాలన్న ఉద్దేశంతో కూలెంట్‌ లీకేజీ ప్రచారం చేస్తున్నారన్న అనుమానాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఘటన వెలుగు చూసిన వెంటనే అధికారులు బాధితుల రక్తంలో యూరియా, క్రియాటినిన్‌ అవశేషాలు ఉన్నాయని చెప్పారు.  వైద్యుల నివేదికల్లోనూ ఇదే స్పష్టమైనట్టు వెల్లడించారు. తాజాగా ఇథలీన్‌ గ్లైకాల్‌ కలిసిందంటూ ప్రచారం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement