దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్న కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రంలో 3.45 లక్షలమంది బాలికలకు వ్యాక్సిన్
దీంతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షణ
సాక్షి, అమరావతి: గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ నివారణకు దేశంలో 14 ఏళ్లు నిండిన బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ) వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది. ఈ పంపిణీని ఈ నెల 28న దేశవ్యాప్తంగా కేంద్ర ఆరోగ్యశాఖ ప్రారంభించనుంది. రాష్ట్రంలోని 3.45 లక్షలమంది బాలికలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. గ్రామ/వార్డు సచివాలయాల శాఖ సమాచారం ప్రకారం అత్యధికంగా కర్నూలు జిల్లాలో 23,957 మంది, అత్యల్పంగా పోలవరం జిల్లాలో 2,777 మంది బాలికలు ఉన్నారు.
1,683 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటికే వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. 0.5 ఎంఎల్ వ్యాక్సిన్‌ను ఇంజక్షన్ రూపంలో ఇస్తారు. సుమారు మూడు నెలలు జరిగే వ్యాక్సిన్ డ్రైవ్‌కు తొలివిడత కింద కేంద్రం నుంచి 1,90,890 డోసుల వ్యాక్సిన్ వెయిల్స్ రాష్ట్రానికి చేరుకున్నాయి. వ్యాక్సిన్ ఇచ్చే ముందు తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి తప్పనిసరి అని నిబంధన ఉంది. పీహెచ్‌సీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సిన్ పంపిణీ వివరాలను యూవిన్ డిజిటల్ పోర్టల్‌లో నమోదు చేస్తారు.
వైఎస్ జగన్ హయాంలో కీలక ముందడుగు
రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే కీలక ముందడుగు పడింది. ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను తెచ్చారు. క్యాన్సర్‌ను ప్రారంభదశలోనే గుర్తించి ప్రాణాపాయాన్ని తప్పించడంతో పాటు, చికిత్స వ్యయాలకు అడ్డుకట్ట వేసేదిశగా అడుగులు వేశారు. ఇందులో భాగంగా సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమానికి అప్పట్లో శ్రీకారం చుట్టారు.
పైలెట్ ప్రాజెక్టుగా పలు జిల్లాల్లో స్క్రీనింగ్ కూడా చేశారు. 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేపట్టేందుకు విశాఖలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రితో ఎంవోయూ కుదుర్చుకుని వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే గ్రామాల్లో వైద్యసేవలు అందించే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, వైద్యులకు శిక్షణనిచ్చారు. సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభించడానికి సర్వం సన్నద్ధం చేసిన సమయంలోనే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో స్క్రీనింగ్ వాయిదా పడింది.
ఎన్నికల తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (సీడీ–ఎన్‌సీడీ–3.0) సర్వేలో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్ అంటూ హడావుడి చేసింది. స్క్రీనింగ్ నిర్వహణలో ఘోరంగా విఫలం అయింది. వైద్యశాఖ తప్పులతడకగా స్క్రీనింగ్ చేపట్టడంతో మరోమారు స్క్రీనింగ్ చేయాల్సి వచ్చింది.


