ప్రేమా.. తల్లిదండ్రులా..? | Physiotherapy student commits suicide | Sakshi
Sakshi News home page

ప్రేమా.. తల్లిదండ్రులా..?

Feb 26 2026 2:42 AM | Updated on Feb 26 2026 2:42 AM

Physiotherapy student commits suicide

తేల్చుకోలేక ఫిజియోథెరపీ విద్యార్థిని ఆత్మహత్య 

పెదగంట్యాడ:  ప్రేమించిన వ్యక్తి ఒకవైపు. తల్లిదండ్రులు మరోవైపు. ఎవరు కా­వా­లో తేల్చుకోలేక తన ఆవేదనను సూసైడ్‌ నోట్‌లో రాసి, ఒక ఫిజియోథెరపీ వి­ద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఇది. న్యూపోర్టు పోలీ­సులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన పైడి సత్యం కుటుంబం విశాఖ వుడా కాలనీలోని వినాయకనగర్‌లో నివసిస్తోంది. హెచ్‌పీసీఎల్‌లో సబ్‌ కాంట్రా­క్ట్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. 

పెద్ద కుమార్తె పైడి రజిని (20) మధురవాడలోని ఓ కళాశాలలో ఫిజియోథెరపీ రెండో సంవత్సరం చదువుతోంది. ప్రిపరేషన్‌ హాలీడేస్‌ ఇవ్వడంతో ఇంటికొచ్చింది. సత్యం భార్య, చిన్న కుమార్తె బుధవారం శ్రీకాకుళంలోని స్వగ్రామానికి వెళ్లారు. కుమారుడిని స్కూల్‌ ఆటో ఎక్కించి, సత్యం డ్యూటీకి వెళ్లాడు. 

అనంతరం కుమార్తె రజినీకి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో ఆందోళన చెంది, ఎదురింటివారికి ఫోన్‌ చేశాడు. వారు డోర్‌ కొట్టినా తీయకపోవడంతో.. కిటికీలోంచి చూడగా రజిని చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న సత్యం హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. డోర్‌ పగులగొట్టి లోపలకి వెళ్లారు. అప్పటికే రజిని చనిపోయింది. ఇంట్లో రజిని సూసైడ్‌ నోట్‌ దొరికింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

సూసైడ్‌ నోట్‌లో రజినీ ఆవేదన: డాడీ.. మమ్మీ.. నాకు ఏమీ తెలియడం లేదు. నేను తప్పు చేశా. లవ్‌ చేశా. నేను మిమ్మల్ని మోసం చేయడం కరెక్ట్‌ అనిపించలేదు. అందుకే ఆ అబ్బాయిని వదిలేశా. కానీ.. అతనితోనే నాకు ఉండాలని ఉంది. కానీ నాకు వద్దు. ఎందుకంటే మీరే ఇంపార్టెంట్‌ నాకు. నేను మీ కోసం ఏమీ చేయలేకపోయా. కానీ తప్పు అయితే చేయాలని అనుకోవట్లేదు.  నేనే లేకపోతే తప్పు అవ్వదు కదా.  అందుకే బై.  చెల్లి, తమ్ముడు జాగ్రత్త.

Advertisement
 
Advertisement
Advertisement