బాబు ప్రభుత్వానికి ఉపాధ్యాయుల హెచ్చరిక
ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలపై ఇంకెన్నాళ్లు మౌనం?
ప్రభుత్వం ఇదే తీరులో ఉంటే అసెంబ్లీ ముట్టడి తప్పదు
ఒత్తిడి పెంచే విధానాలు రద్దు చేయాలి..
ఆర్థిక ప్రయోజనాలు వెంటనే విడుదల చేయాలి
12వ పీఆర్సీ వెంటనే నియమించాలి.. 30 శాతం ఐఆర్ ప్రకటించాలి
4 పెండింగ్ డీఏల్లో కనీసం రెండింటిని వెంటనే ఇవ్వాలి
రూ.35 వేల కోట్ల పెండింగ్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలి
ఉపాధ్యాయుల మహాధర్నాతో దద్దరిల్లిన విజయవాడ
సాక్షి, అమరావతి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని ఉపాధ్యాయులు మండిపడ్డారు. తమకు ఇస్తానన్న ఆర్థిక ప్రయోజనాల విషయంలోనూ దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు దాటుతున్నా నిర్లిప్తత ప్రదర్శిస్తోందని, తమ సమస్యలపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ‘చలో అసెంబ్లీ’ చేపట్టక తప్పదని హెచ్చరించారు. తమ ప్రయోజనాలను విస్మరిస్తే అధికారం నుంచి దించుతామని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఏపీ ఎస్టీయూ) ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో ఉపాధ్యాయులు మూడో దశ మహా ధర్నాకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన ఉపాధ్యాయులు తమ సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ కదం తొక్కారు. ‘సమర శంఖం’ పేరుతో నిర్వహించిన ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, ఎల్.సాయిశ్రీనివాస్‌తో పాటు మాజీ ఎమ్మెల్సీలు, ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, తర్వాత వాటిని విస్మరించి, ఉద్యోగులను పట్టించుకోకుండా గాలికి వదిలేయడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఎంటీఎస్, కాంట్రాక్టు ఉపాధ్యాయులకు సరైన వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐఎస్టీఎఫ్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి జి.సదానంద్ గౌడ్, జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సు«దీర్ బాబు మాట్లాడుతూ.. ఉద్యమాలు, పోరాటాల ద్వారా సాధించుకున్న ప్రయోజనాలకు మంగళం పాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులను పరాయి వారిగా చూడడం ప్రభుత్వానికి తగదన్నారు.
హైస్కూల్ ప్లస్‌లు నిర్వీర్యం
20 నెలల కాలంలో విద్యా రంగాన్ని పూర్తిగా దిగజార్చారని, బాలికల విద్యను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం హైసూ్కల్ ప్లస్‌లను ప్రారంభిస్తే.. ఈ ప్రభుత్వం వాటిల్లో ఉపాధ్యాయులను లేకుండా చేసిందని ఉపాధ్యాయ నేతలు మండిపడ్డారు. సమరశంఖం ఉద్యమానికి సంఘీభావం ప్రకటించిన ఏపీ జేఏపీ చైర్మన్, ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ.. సమస్యలపై రాజీలేని పోరాటం చేసి సాధించుకోవాలన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జరిగే పోరాటాలకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ ధర్నాలో ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమణ, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లె రవీంద్రనాథ్, ఎస్టీయూ అనుబంధ సంఘాల నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన ఉపాధ్యాయులు భారీగా పాల్గొన్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవే..
» వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలి. 30 శాతం ఐఆర్ ప్రకటించాలి.
» నాలుగు పెండింగ్ డీఏల్లో కనీసం రెండింటిని వెంటనే ప్రకటించాలి. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాల్సిందే.
» ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన రూ.35 వేల కోట్ల పెండింగ్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలి. పే స్లిప్పుల్లో ఆ వివరాలు పొందుపరచాలి.
» ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షన్ ప్రయోజనాలు చెల్లించకుండా వేధించడం ఆపాలి. ఉద్యోగ విరమణ చేసిన మరుసటి రోజే పెన్షన్ ప్రయోజనాలను చెల్లించాలి.
» ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అన్ని రకాల వ్యాధులకు, అన్ని ఆస్పత్రుల్లో అనుమతించాలి.
» అర్థం లేని పనులు, యాప్‌ల భారం తగ్గించాలి. ఆదివారం కూడా పని చేయించడం ఆపాలి.
» కేజీబీవీలు, సమగ్రశిక్ష, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ తదితర పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.
» కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి.
» కారుణ్య నియామకాలను జిల్లా యూనిట్‌గా చేపట్టి, అర్హులైన వారందరికీ జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలి.

ఒక్క హామీ అమలు చేయలేదు
కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి 20 నెలలైనా ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. హమీలన్నీ అమలు చేస్తామని, ఉపాధ్యాయులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు కల్ల»ొల్లి మాటలు చెప్పి అధికారాన్ని చేపట్టారు. ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత నాలుగు డీఏలు ఇవ్వాల్సి ఉంది. వాటి గురించి ప్రస్తావనే లేదు. ప్రభుత్వం వీటిపై తక్షణం స్పందించి, పరిష్కారానికి రోడ్డు మ్యాప్ ప్రకటించాలి. – మల్లు రఘునాథరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఎస్టీయూ
ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
రాష్ట్రంలో ప్రభుత్వం పెడుతున్న ఒత్తిడిని భరించలేక ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొంత మంది ప్రయాణాల్లో ప్రమాదాలకు గురవుతున్నారు. కొంత మంది అధికారులు సైతాన్‌లా వ్యవహరిస్తూ ఉపాధ్యాయులను అధిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. డెప్యూటీ సీఎం సైతం అనేక వాగ్దానాలు చేశారు. ఆయన సైతం అమలుకు ముందుకు రావటం లేదు. ఉపాధ్యాయుల ఆవేదనను ప్రభుత్వం గమనించాలి. లేదంటే అన్ని సంఘాలను కలుపుకొని అసెంబ్లీని ముట్టడిస్తాం – ఎల్ సాయి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ ఎస్టీయూ
బడ్జెట్‌లో ఒక్క పైసా లేదు
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌లో ఉద్యోగ, ఉపాధ్యా యులకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి ఒక్క పైసా కూడా కేటాయింపు చూపించలేదు. పక్కన తెలంగాణలో ప్రతి నెలా బకాయిలు చెల్లిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉపాధ్యాయుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు ఉపాధ్యాయులకిచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. – సీహెచ్ జోసఫ్ సుదీర్‌బాబు, రాష్ట్ర నేత, ఏపీ ఎస్టీయూ


