సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగింది. భాకరాపురంలో క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ వద్ద వాపోయారు.

ఆయన స్పందిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదంటూ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్ సూచించారు.

ఆపన్నులకు అండగా..
వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైఎస్ జగన్ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సూచించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్ జగన్.. వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

దీంతో పాటు పులివెందుల పర్యటనలో అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్ రాజారెడ్డి సోదరి కమలమ్మను ఆమె ఉంటున్న జీసస్ ఛారిటీస్‌కు వెళ్ళి వైఎస్ జగన్ పరామర్శించారు, కమలమ్మ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న సింగిల్ విండో మాజీ ఛైర్మన్ ఈశ్వరయ్యను కూడా ఆయన నివాసంలో పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.


