అధైర్య పడొద్దు.. వచ్చేది మన ప్రభుత్వమే | Ys Jagan Mohan Reddy Special pujas at the inauguration of the new idol | Sakshi
Sakshi News home page

అధైర్య పడొద్దు.. వచ్చేది మన ప్రభుత్వమే

Feb 26 2026 2:23 AM | Updated on Feb 26 2026 3:18 AM

Ys Jagan Mohan Reddy Special pujas at the inauguration of the new idol

వైఎస్సార్‌సీపీ శ్రేణులకు వైఎస్‌ జగన్‌ భరోసా 

టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలి 

పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలి 

కష్టాలు ఎల్లకాలం ఉండవు.. అందరికీ మంచి జరుగుతుంది 

చంద్రబాబు ప్రభుత్వ తీరు దారుణం 

కష్టకాలంలో కార్యకర్తలకు నేతలు అండగా నిలవాలని పిలుపు

సాక్షి ప్రతినిధి కడప :  ‘ఎవరూ అధైర్య పడొద్దు.. మంచి రోజులు వస్తాయి.. సమస్యలు శాశ్వతం కాదు.. వచ్చేది మన ప్రభుత్వమే.. అప్పుడు అందరికీ మంచి జరుగుతుంది’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు భరోసా కల్పించారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 

వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో మమేకమయ్యారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ.. బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ ధైర్యం చెప్పారు. 

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని.. అకారణంగా దాడులు చేస్తోందని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్‌ జగన్‌ వద్ద వాపోయారు. అందుకు ఆయన స్పందిస్తూ ఎవరూ అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం తీరు దారుణంగా ఉందని, హింసాత్మక రాజకీయాలకు పాల్పడటం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్ట కాలంలో కార్యకర్తలకు అండగా నిలబడాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు.  

అశేష జనసందోహానికి అభివాదం చేస్తున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

సమస్యలు వింటూ.. ధైర్యం చెబుతూ.. 
వివిధ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు వైఎస్‌ జగన్‌ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలు విన్న ఆయన స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డికి సూచించారు. ప్రభుత్వం నుంచి తమకు ఒక్క మేలు కూడా జరగలేదని వచ్చిన వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. 

అన్ని వర్గాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్‌ జగన్‌.. వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అనంతరం అనారోగ్యంతో బాధ పడుతున్న దివంగత వైఎస్‌ రాజారెడ్డి సోదరి కమలమ్మను ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ ఈశ్వరయ్యను కూడా ఆయన నివాసంలో పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. 



నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు
వేంపల్లె మండలం నందిపల్లిలోని శ్రీ నందీశ్వర ఆలయంలో నిర్వహించిన నూతన విగ్రహ ప్రతిష్ఠ (శ్రీ పార్వతీ దేవి సమేత మహా నందీశ్వర స్వామి), కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి హోమాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 

భక్తి శ్రద్ధలతో స్వామి వారికి అర్చన, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి పెంపొందుతుందని చెప్పారు. 

గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం మరింత విస్తరిస్తుందని తెలిపారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ చైర్మన్‌ మారం శ్రీకాంత్‌ రెడ్డి, కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమని, శ్రీ నందీశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement