టన్నుల్లో చంద్రబాబు అబద్ధాలు.. వెలిగొండలో క్రెడిట్‌ చోరీ | Chandrababu Naidu lies on the Veligonda project | Sakshi
Sakshi News home page

టన్నుల్లో చంద్రబాబు అబద్ధాలు.. వెలిగొండలో క్రెడిట్‌ చోరీ

Feb 26 2026 3:17 AM | Updated on Feb 26 2026 3:17 AM

Chandrababu Naidu lies on the Veligonda project

వెలిగొండ ప్రాజెక్టును పరుగులు పెట్టించానంటూ మార్కాపురం సభలో సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు

2014­–19 మధ్య ధరల సర్దుబాటుతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది రూ.630.57 కోట్లు 

వైఎస్సార్‌ హయాంలోనే ప్రాజెక్టుకురూ.3,581.58 కోట్ల ఖర్చు

నల్లమల సాగర్‌తో పాటు సొరంగాల్లో చాలా వరకు పనులు పూర్తి 

కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ రికార్డు సమయంలో ఆసియాలోనే అతి పెద్ద సొరంగాలను పూర్తి చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

రూ.992 కోట్లతో పునరావాసం కల్పించి 2024 సీజన్‌లో  శ్రీశైలం నుంచి నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలించేలా ప్రణాళిక

వైఎస్‌ జగన్‌కు పేరొస్తుందనే దుగ్ధతోనే పునరావాసం కల్పించకుండా, వెలిగొండకు కృష్ణా జలాలు ఇవ్వకుండా 21 నెలలుగా జాప్యం చేస్తున్న బాబు సర్కారు

2014–19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉండగా వెలిగొండ సొరంగాల్లో తవ్వింది కేవలం 6.686 కి.మీ.

వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో వెలిగొండ టన్నెల్‌లో జరిగిన పనులు 30.901 కి.మీ. 

మరి చిత్తశుద్ధితో పనులు చేసిందెవరు..? కోవిడ్‌లోనూ పరుగులు తీయించిందెవరు..? టన్నులు టన్నులు అబద్ధాలు చెబుతోంది ఎవరు..?

సాక్షి, అమరావతి: మరో ‘క్రెడిట్‌’ చోరీకి సిద్ధమైన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మార్కా­పురం సభ వేదికగా వెలి‘కొండంత’ అసత్యాలు వల్లె వేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు 1996లో తానే శంకుస్థాపన చేశానని.. 2014–19 మధ్య పనులను పరుగులు పెట్టించానని.. కానీ 2019–24 మధ్య పనులు మూలన పడ్డాయని తనకు అలవాటైన రీతిలో అలవోకగా అబద్ధాలు చెప్పుకొచ్చారు. నిజానికి 1996 నుంచి 2004 వరకూ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వెలిగొండ పనులకు చేసిన వ్యయం అక్షరాలా రూ.పది లక్షలు మాత్రమే. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్ల కోసం ఖర్చు చేసిందే. 

ఇక 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం పనుల పేరుతో కాంట్రాక్టర్లకు రూ.630.57 కోట్లు దోచిపెట్టింది. జీవో 22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు) వర్తింపజేసి కాంట్రా­క్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు దోచిపెట్టారని కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) నివేదికలో కడిగిపారేయడమే అందుకు తార్కాణం. అలాంటి అవినీతి బాగోతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి రోజుకు సగటున 10 మీటర్ల పొడవున సొరంగం తవ్వేందుకు టీబీఎం (టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌) మరమ్మతుల పేరుతో కాంట్రాక్టర్లకు రూ.68.44 కోట్లను ఇచ్చేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు. 

కానీ మరమ్మతులు చేయకపోవడం వల్ల టీబీఎంలు రోజుకు సగటున ఒకటి రెండు మీటర్ల పొడవున కూడా సొరంగాలను తవ్విన దాఖలాలు లేకపోవడం గమనార్హం..! ఇక సొరంగాలను నల్లమలసాగర్‌ను అనుసంధానం చేసే ఫీడర్‌ కెనాల్‌లో చేసిన పనులూ నాసిరకమే. 2017.. 2018.. 2019.. ఇలా వెలిగొండను పూర్తి చేస్తామంటూ ఎప్పటికప్పుడు చంద్రబాబు ముహూర్తాలు మార్చుకుంటూ వచ్చారు. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించి మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి అధిక ధరలకు మరో కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారు. 

అనంతరం కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారని సాగునీటిరంగ నిపుణులు, రైతులు అప్పట్లో తీవ్ర స్థాయిలో ఆక్షేపించడం గమనార్హం. గతేడాది కురిసిన వర్షాలకు ఫీడర్‌ కెనాల్‌ బలహీనంగా ఉన్న చోట్ల కోతకు గురవడంతో ఇప్పుడు దానికి రిటైనింగ్‌ వాల్, కాంక్రీట్‌ లైనింగ్‌ పనులకు రూ.456 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేశారు. ఆ పనులను తనకు అత్యంత సన్నిహితుడైన గన్నమనేని దొర­య్యకు చెందిన జీడీఆర్‌ ప్రాజెక్ట్స్‌కు కట్టబెట్టారు. 

రూ.992 కోట్లతో పునరావాసం కల్పించి ఉంటే.. 2024 ఆగస్టులోనే నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలు
దశాబ్దాల స్వప్నం వెలిగొండ సాకారమైందని.. శ్రీశైలం నుంచి జంట సొరంగాల ద్వారా కృష్ణా జలాలు నల్లమలసాగర్‌కు చేరడంతో తమ కష్టాలు కడతేరుతాయనుకున్న ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్‌ కడప జిల్లాల ప్రజల ఆశలను చంద్రబా­బు ప్రభుత్వం అడియాశలు చేసింది. ఈ ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన జంట సొరంగాలను (ఆసి­యా­లోనే అతి పొడవైనవి) రికార్డు సమయంలో నాటి సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి చేసి 2024 మార్చి 6న జాతికి అంకితం చేశారు. నల్లమలసాగర్‌లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి 2024 నాటికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది. 

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద నిర్వాసితు­లకు పరిహారం చెల్లించింది. రూ.992 కోట్లు వ్య­యం చేసి పునరావాసం కల్పించింది. 2024 సీజన్‌­లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు తరలించి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. కేవలం వైఎస్‌ జగన్‌కు మంచి పేరొస్తుందనే దుగ్ధతోనే నల్ల­మ­లసాగర్‌ నిర్వాసిత కుటుంబాలకు 21 నెలలుగా పునరావాసం కల్పించకుండా చంద్రబాబు సర్కార్‌ జాప్యం చేస్తోందని సాగు నీటి నిపుణులు, రైతులు, రైతు సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు. 

శ్రీశైలం ప్రా­జెక్టులోకి 2024–25లో 1,439 టీఎంసీలు, 2025­–26లో 1,936.79 టీఎంసీల ప్రవాహం రాగా.. ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి 2024­–25లో 848.96 టీఎంసీలు, 2025–26లో 1,652.­12 టీఎంసీలు కలిశాయని గుర్తు చేస్తున్నారు. అదే చంద్రబాబు సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే 2024–25తోపాటు 2025–26­లోనూ కృష్ణా వరదను ఒడిసి పట్టి నల్లమలసాగర్‌కు తరలించి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే అవకాశం ఉండేదని స్పష్టం చేస్తున్నారు.  

కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూరికార్డు వేగంతో జంట సొరంగాలు పూర్తి
» వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని పాదయా­త్రలో హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్య­త­లు చేపట్టిన వెంటనే ఆ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా మ­హమ్మారి ప్రభావం వల్ల పనులు చేయలేని పరి­స్థితి. అయినా సరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిలోమీటర్ల పనులను 2019 నవంబర్‌లో ప్రారంభించి కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. 

2014–19 మధ్య టీడీపీ సర్కార్‌ హయాంలో మొదటి సొరంగం రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్సార్‌సీపీ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి మొదటి సారంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేసే హెడ్‌ రెగ్యులేటర్‌ పనులను వైఎస్‌ జగన్‌ 2021లోనే పూర్తి చేయించారు. 

»  రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచి పెట్టారు. వాటిని రద్దు చేసిన వైఎస్‌ జగన్‌.. రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి, టీడీపీ సర్కార్‌ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు 7.698 కిలోమీటర్ల సొరంగం పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమా­లను ప్రజల ముందు పెట్టారు. 

రెండో సొరంగంలో టీబీఎం (టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌)కు కాలం చెల్లడంతో రోజుకు ఒక మీటర్‌ కూడా పని జరగడం కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేసి రికార్డు సమయంలో 7.685 కి.మీల పొడవున సొరంగం తవ్వకం పనులను 2024 జనవరి 21 నాటికి పూర్తి చేయించారు. 

హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు కూడా పూర్తి చేశారు. శ్రీశైలానికి వరద వచ్చేలోగా రెండో సొరంగం నుంచి టీబీఎంను బయటకు తీయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్‌ రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్‌ జగన్‌ హయాంలో రోజుకు 7.25 మీటర్లు (టీబీఎం ద్వారా 1.45, మనుషుల ద్వారా 6.80 మీటర్లు) తవ్వడం గమనార్హం. 

» ఇక 2014–19లో టీడీపీ సర్కార్‌ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన తీగలేరు కాలువను నల్లమల సాగర్‌కు అనుసంధానం చేసేలా సొరంగం, హెడ్‌ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువను నల్లమల­సాగర్‌కు అనుసంధానం చేసేలా సొరంగం తవ్వ­కం పనులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించింది. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు తరలించి.. ఆయకట్టు­కు నీళ్లందించడానికి లైన్‌ క్లియర్‌ చేశారు. 

2019­–24 మధ్య కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టుకు రూ.1,046.46 కోట్లను వైఎస్సా­ర్‌సీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకు­ని శరవేగంగా పూర్తి చేయించింది. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరాకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది.

‘కొండంత’ కలను సాకారం చేసిన వైఎస్సార్‌..
» శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 45 రోజుల్లో రోజుకు 85 క్యూమెక్కులు (3,001 క్యూసెక్కులు) చొప్పున తరలించే సామర్థ్యంతో 7 మీటర్ల వ్యాసం, 18.80 కి.మీల పొడవుతో సొరంగం తవ్వి.. వెలిగొండ కొండల్లో నిర్మించే నల్లమల­సాగర్‌కు తరలించి.. ప్రకాశం జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీళ్లు అందించాలని 1993–94లో డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపొందించారు. కానీ.. 2004 వరకు ఈ ప్రాజెక్టు పనులను ఎవరూ చేపట్టలేదు.

»  జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజె­క్టుకు రూ.3,581.58 కోట్లు ఖర్చు చేసి.. నల్లమల సాగర్‌తోపాటు సొరంగాల్లో చాలా వరకు పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్‌కు అనుసంధానం చేసేలా 21.8 కి.మీల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్‌ ఛానల్, తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్‌ పనులను చేపట్టారు

»  మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్య­తలు స్వీకరించాక నదీ జలాలను మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఈ క్రమంలో వెలిగొండ ప్రాజెక్టు డీపీఆర్‌ను సమూలంగా మార్చేశారు. కృష్ణా నదికి వరద రోజులు క్రమేణ తగ్గుతున్న నేప­థ్యంలో.. శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోనే రోజుకు 11,584 క్యూసెక్కులు చొప్పున 43.50 టీఎంసీలను తరలించేలా జంట సొరంగాలు (మొదటిది 85 క్యూమెక్కుల సామర్థ్యం, రెండోది 243 క్యూమెక్కుల సామర్థ్యం) తవ్వి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్‌లో నిల్వ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 

తద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్‌ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. ఆ మూడు జిల్లాల్లో 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004 అక్టోబర్‌ 27న పనులకు శ్రీకారం చుట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement