బెజవాడలో కదం తొక్కిన చిరుద్యోగులు
సర్కారు తీరుకు నిరసనగా రాష్ట్రస్థాయి ధర్నా
బాబు పాలనపై వెలుగు వీవోఏ, డ్వాక్రా యానిమేటర్లు మెప్మా ఆర్పీల కన్నెర్ర
ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్
రెండేళ్ల బకాయిలు చెల్లించాలని నినాదాలు
అధికారపార్టీ అడ్డగోలు వేధింపులు, అక్రమ తొలగింపులపై చిరుద్యోగులు నిరసన గళమెత్తారు. రాష్ట్ర నలుమూలల
నుంచీ తరలివచ్చి బెజవాడలో కదంతొక్కారు. రాష్ట్రస్థాయి ధర్నాలో చంద్రబాబు సర్కారు దుర్నీతిపై ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు అమలు చేయాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని దిక్కులుపిక్కటిల్లేలా నినదించారు.
సాక్షి, అమరావతి/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : క్షేత్రస్థాయిలో పొదుపు సంఘాల కార్యక్రమాలను పర్యవేక్షించే గ్రామ సమాఖ్య సహాయకులు (వెలుగు వీవోఏ – డ్వాక్రా యానిమేటర్లు), మెప్మా రిసోర్స్ పర్సన్లు (ఆర్‌పీ)లు బుధవారం విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నా చేపట్టారు. అధికార పార్టీ నేతల పెత్తనం పెరగడంతో పాటు నిబంధనలకు విరుద్ధ కార్యక్రమాల పేరిట వేధింపులు, అక్రమ తొలగింపులను నిరసించారు. తొలుత రాష్ట్ర నలుమూలల నుంచీ తరలివచ్చిన ఉద్యోగులు విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌కు చేరుకున్నారు.
బాబు సర్కారుకు వ్యతిరేకంగా వారు చేసిన నినాదాలతో ధర్నాచౌక్ దద్దరిల్లింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు కనీస వేతనాలు వర్తింపజేయాలని, అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో వీవోఏ–యానిమేటర్లతో పాటు ఆర్పీలకు ఇచ్చే నెలవారీ వేతనం రూ.8వేలు, రూ.పదివేలు ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీస వేతనాలు రూ.26 వేల చొప్పున చెల్లించాలని.. హెచ్‌ఆర్ పాలసీ అమలు, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం, అర్హులైన వారికి పదోన్నతులు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వీవోఏ – యానిమేటర్లకు స్త్రీనిధి ప్రోత్సాహకాలు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, ఒక్కొక్కరికీ రూ. 30 వేల నుంచి రూ.లక్ష వరకు రావాల్సి ఉందని వివరించారు. ఆ బకాయిలు వెంటనే చెల్లించాలని నినదించారు. 60 ఏళ్లు నిండిన వీఓఏలకు నిలుపుదల చేసిన వేతనాలు చెల్లించాలని, మెప్మా ఆర్‌పీలకు గ్రేడింగ్ విధానం రద్దుచేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు హామీ ఇచి్చన మేరకు మహిళలు పొదుపు సంఘాల ద్వారా తీసుకునే రుణాలపై రూ.10 లక్షల వరకు వడ్డీ రాయితీలు చెల్లించాలని, మహిళా మార్టులు, స్వావలంబన, అభయహస్తం నగదును పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని కోరారు. చిరుద్యోగుల ధర్నాకు సీపీఎం నేత వి. శ్రీనివాసరావు సంఘీభావం ప్రకటించారు.
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు మద్దతుగా పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్ర స్థాయి ధర్నా అనంతరం యూనియన్ ప్రతినిధులు సెర్ప్ సీఈవో వాకాటి కరుణ, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్‌లను కలిసి
వినతిపత్రాలను అందజేశారు.
అంగన్‌వాడీల వినూత్న నిరసన
ఏలూరు (టూటౌన్): ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్, హెల్పర్ పోస్టులు భర్తీ చేయాలని, అంగన్‌వాడీల వేతనాలు పెంచాలని కోరుతూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద తలపెట్టిన నిరాహార దీక్షలు రెండోరోజు బుధవారం కొనసాగాయి. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది అంగన్‌వాడీలు తరలివచ్చారు.
కనీస వేతనం రూ.26,000, సంక్షేమ పథకాల అమలు, యాప్స్ అన్నీ కలిపి ఒకే యాప్‌గా మార్చాలని, మెనూ చార్జీలు పెంచాలని పెద్దపెట్టున నినదించారు. మోకాళ్లపై నిలిచి నిరసన గళం వినిపించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.సుభాషిణి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రవికుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ , ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి.భారతి పాల్గొన్నారు.


