రూ.16కోట్ల కష్టాన్ని జయించిన పసిమొగ్గ | Financial assistance for baby punarvika treatment | Sakshi
Sakshi News home page

రూ.16కోట్ల కష్టాన్ని జయించిన పసిమొగ్గ

Feb 26 2026 4:46 AM | Updated on Feb 26 2026 4:46 AM

Financial assistance for baby punarvika treatment

మానవతావాదుల స్పందన... రూ.కోట్ల సహాయం

కేంద్ర సహాయం రూ.50 లక్షలు

త్వరలో చికిత్స ప్రారంభం

వెల్దుర్తి: మానవతావాదుల స్పందనతో పసిమొగ్గకు వచ్చిన రూ.16 కోట్ల కష్టం కేవలం మూడు నెలల్లో తొలగిపోయింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణానికి చెందిన సురేశ్, పుష్పావతి దంపతుల కుమార్తె పునర్వికశ్రీ. పుట్టుకతోనే జన్యు సంబంధిత వెన్నెముక కండరాల వ్యాధికి గురైంది. పుట్టినప్పటి నుంచి కదలలేని స్థితి. రెండేళ్లలోపు రూ.16 కోట్ల ఇంజక్షన్‌ ఇస్తే మామూలు స్థితికి చేరుకుంటుందని వైద్యులు తెలిపారు.  పాప 8 నెలల వయసులో.. డిసెంబర్‌ 2025లో పేద తండ్రి సురేశ్‌ తన పాపను కాపాడమంటూ చేసిన అభ్యర్థన మానవతావా­దులను కదిలించింది.  

సాక్షి కథనంతో వెల్లివిరిసిన దాతృత్వం 
సాక్షిలో డిసెంబర్‌ 8వ తేదీ  ‘పసిమొగ్గకు రూ.16కోట్ల కష్టం’ శీర్షికన కథనం వెలువడింది.  ఈ కథనానికి స్వచ్ఛంద సంస్థలు, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్‌ మీడియాలు, వివిధ వర్గాలు సైతం విరివిగా స్పందించాయి. పాప సహాయానికి ‘సేవ్‌ పునర్విక’ అంటూ అర్థించాయి. దీంతో మూడు నెలల్లోనే చిన్న చిన్న విరాళాలే పెద్ద మొత్తంగా పాప చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందింది. పునర్విక చికిత్సకు కేంద్ర ఆరోగ్య శాఖ రూ.50 లక్షలు ప్రకటించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. ఇందుకు సహకరించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.

విరాళాలు ఇక వద్దు 
నేను కోరినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలు, దాతల సమీకరణల ద్వారా  అలాగే ప్రత్యక్షంగా నా అకౌంట్‌కు వచ్చిన మొత్తం రూ.9 కోట్లకు మించిపోయింది. దీంతో త్వరలో పాపకు చికిత్స ప్రారంభం కానుంది.  ఆర్థిక సహాయం చేసిన వారందరికీ  కృతజ్ఞతలు. ఇకపై విరాళాలు వద్దు. చికిత్స ప్రారంభించిన తరువాత వివరాలు తెలుపుతాను.     – సురేశ్, పునర్వికశ్రీ తండ్రి

Advertisement
 
Advertisement
Advertisement