2024– 25 ‘కాగ్’ గణాంకాల సాక్షిగా వాస్తవాలు బహిర్గతం
సొంత పన్నుల ఆదాయాల్లో 22వ స్థానానికి పడిపోయిన ఆంధ్రప్రదేశ్
బిహార్ లాంటి రాష్ట్రాల్లో పన్ను ఆదాయ వృద్ధి 18 శాతమైతే ఏపీలో 1.97కి పరిమితం
రూ.60,285 కోట్ల రెవెన్యూ లోటుతో దేశంలోనే మొదటిస్థానంలో ఏపీ
రెండేళ్లలో చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు రూ.3,59,157 కోట్లు.. జీఎస్‌డీపీలో పడిపోతున్న రాష్ట్ర జీఎస్టీ ఆదాయం
రెండేళ్లలో 2.20 శాతం నుంచి 1.90 శాతానికి పతనం
కేంద్రం వెల్లడించిన ప్రకారం రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు రూ.6,962 కోట్లే
ఇదే సమయంలో బాబు సర్కారు కప్పం వసూళ్లతో వెళ్లిపోయిన పెట్టుబడులు రూ.6,215 కోట్లు
రెండేళ్లలో రాష్ట్రంలో మూతపడ్డ ఎంఎస్‌ఎంఈల సంఖ్య 4,520
ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇండెక్స్‌లో 8వ స్థానానికి పడిపోయిన ఏపీ
రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో 26వ స్థానానికి పడిపోయిన రాష్ట్ర పోలీసు వ్యవస్థ
సాక్షి, అమరావతి: గత రెండేళ్లుగా అప్పు చేయనిదే పూట గడవని దుస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సొంత పన్నుల ఆదాయంలో బిహార్, జార్ఖండ్ కంటే దారుణంగా దిగజారిపోయిందని కేంద్ర ఆడిటింగ్ సంస్థ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక వెల్లడించింది. 2024– 25 ఏపీ సొంత పన్నుల ఆదాయంలో వృద్ధి కేవలం 1.97 శాతానికే పరిమితమైంది. అదే బిహార్ లాంటి రాష్ట్రాల్లో పన్ను ఆదాయ వృద్ధి 18 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాల పరంగా మేఘాలయ, త్రిపుర, సిక్కిం, కేరళ కంటే తక్కువగా 22వ స్థానానికి పరిమితమైనట్లు కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు రెండేళ్లలోనే ఏపీ అప్పులు మాత్రం ఏకంగా రూ.3,59,157 కోట్లకు ఎగబాకాయి. ద్రవ్య, రెవెన్యూ లోటు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
రెండేళ్లలో రాష్ట్రంలోకి రూ.29 లక్షల కోట్ల పెట్టుబడులు పోటెత్తాయని చంద్రబాబు సర్కారు నమ్మబలికినా అందులో ఏమాత్రం నిజం లేదని, వచ్చినవి రూ.6,962 కోట్లేనని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే రెడ్‌బుక్ వేధింపులు, కప్పం కట్టలేక రెండేళ్లలో ఏపీ నుంచి బయటకు వెళ్లిపోయిన కంపెనీల పెట్టుబడుల విలువ ఏకంగా రూ.6,215 కోట్లు కావడం గమనార్హం. ఇక రెండేళ్ల క్రితం వరకు సులభతర వాణిజ్యంలో మొదటి స్థానంలో నిలబడటం ద్వారా పెట్టుబడులను ఆకర్షించిన ఏపీ ఇప్పుడు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇండెక్స్‌లో ఏకంగా ఎనిమిదవ స్థానానికి పడిపోయింది. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగం గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి దేశంలో 36 రాష్ట్రాలు ఉంటే పోలీస్ వ్యవస్థ పనితీరులో మన రాష్ట్రం 26వ స్థానంలో ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కొలమానంగా భావించే కొన్ని వ్యవస్థలు గత రెండేళ్లలో ఎంత దారుణంగా పతనమయ్యాయో ఒకసారి పరిశీలిస్తే.. 
జీఎస్‌డీపీలో తగ్గిపోయిన జీఎస్టీ వాటా
రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయి.. లక్షలాది మందికి ఉపాధి లభించింది... రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు రాష్ట్రంలో ప్రతి నెలా నమోదవుతున్న జీఎస్టీ గణాంకాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. గత రెండేళ్లుగా మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో జీఎస్టీ వాటా గణనీయంగా పడిపోతుండటమే దీనికి నిదర్శనం. స్వయంగా కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 2023–24లో రాష్ట్ర జీఎస్‌డీపీలో 2.20 శాతంగా ఉన్న జీఎస్టీ గడిచిన రెండేళ్ల కాలంలో 30 బేసిస్ పాయింట్లు తగ్గి 1.90 శాతానికి పడిపోయింది. 2025–26లో జీఎస్‌డీపీ రూ.17,62,357 కోట్లుగా ఉంటే అందులో జీఎస్టీ రాబడి కేవలం 1.9 శాతం అంటే రూ.34,301 కోట్లు మాత్రమేనని కేంద్రమంత్రి లోక్‌సభలో వెల్లడించారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర జీఎస్టీ ఆదాయంలో ఎటువంటి వృద్ధి నమోదు కాకపోవడమే దీనికి ప్రధాన కారణం. సంపద సృష్టిస్తే జీఎసీడీపీలో జీఎస్టీ వాటా పెరగాలి కానీ ఎందుకు తగ్గిందని ఆర్థికవేత్తలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 
అంతా అప్పులే.. ఆస్తుల్లేవ్
రెండేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దొరికిన చోటల్లా అప్పులు చేయడమేగానీ ఆస్తుల కల్పన ఊసే మరిచారు. అన్ని అప్పులు చేస్తున్నా సంక్షేమాన్ని ప్రజలకు అందించడం లేదు. రెండేళ్లలో చంద్రబాబు సర్కారు బడ్జెట్ లోపల, బయట, రాజధాని పేరుతో చేసిన అప్పులు రూ.3,59,157 కోట్లకు చేరాయంటే ఏ స్థాయిలో అప్పులు చేస్తున్నారో ఊహించవచ్చు. అంటే రోజూ రూ.492 కోట్లు అప్పు చేయనిదే బాబు సర్కారుకు పూట గడవడం లేదు. సంపద సృష్టి మాటే లేదు. అప్పులతో పాటు నిత్యం చేబదుళ్లు, ఓడీలతో పాలన కొనసాగుతోంది. 
శాంతి భద్రతల్లో 26వ స్థానం
రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది. రాష్ట్ర పోలీసుల పనితీరు దేశవ్యాప్తంగా కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 36 రాష్ట్రాలతో పోలిస్తే 26వ స్థానంలో ఉన్నట్లు కేంద్ర హోంశాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. పోలీసు సంస్కరణలు, నేర, న్యాయ చట్టాల అమల్లో రాష్ట్రం దేశంలోనే అట్టడుగు స్థాయికి పడిపోయిందనే విషయాన్ని ఈ నివేదిక కళ్లకు కట్టినట్లు చూపించింది. కీలకమైన శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల కట్టడి, సమగ్ర దర్యాప్తు విషయంలో ఏపీ పోలీసుల పనితీరు అత్యంత నాసిరకంగా ఉంది. ఈ విభాగంలో మొత్తం 45 పాయింట్లకు గాను రాష్ట్రానికి కేవలం 29.88 పాయింట్లే వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే అక్రమ కేసులు బనాయించడం, సోషల్ మీడియా యాక్టివిస్టులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం, కోర్టులు మొట్టికాయలు వేసినా పట్టించుకోకపోవడం లాంటి అంశాలలో కనుక ర్యాంకులు ప్రకటిస్తే మొదటి స్థానం దక్కేదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. 
ద్రవ్య, రెవెన్యూ లోటుల్లో అగ్రస్థానం
ద్రవ్య, రెవెన్యూ లోటులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్న విషయాన్ని కాగ్ కుండబద్ధలు కొట్టింది. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్ట నిబంధనలను ఉల్లంఘించి ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు తారస్థాయికి చేరుకుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ –5.09 శాతం ద్రవ్యలోటుతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు కాగ్ వెల్లడించింది. ఇదే సమయంలో రెవెన్యూలోటు ఏకంగా రూ. –60,285 కోట్లతో దేశంలో ఏ రాష్ట్రానికి అందనంత ఎత్తులో నిలిచింది. 2024–25లో భారీగా అప్పులు చేసిన ఆంధ్రప్రదేశ్ అందులో మూలధన వ్యయానికి కేవలం 27 శాతమే వ్యయం చేసినట్లు కాగ్ పేర్కొంది. చేసిన అప్పులను మూలధన వ్యయానికి కాకుండా ఇతర రెవెన్యూ వ్యయాలకు వెచ్చించటాన్ని బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక నిర్వహణ విధానం ఎంత దారుణంగా ఉందో వెల్లడవుతోంది. 
వచ్చినవి రూ.6,962 కోట్లే పోయినవి రూ.6,215 కోట్లు..
రాష్ట్రంలోకి రూ.29 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయి.. రెండేళ్లలో 24 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించేశామంటూ చంద్రబాబు సర్కారు చేసుకుంటున్న ప్రచారంలో డొల్లతనం పార్లమెంట్ సాక్షిగా బట్టబయలైంది. గత రెండేళ్లలో ఏపీకి కేవలం రూ.6,962 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులు మాత్రమే వచ్చినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది. డీపీఐఐటీ, ఇన్వెస్ట్ ఇండియా లెక్కల ప్రకారం గత రెండేళ్లలో రాష్ట్రంలోకి మొత్తం పది ప్రాజెక్టులు రాగా అందులో రెండు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయని, మిగిలిన 8 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్‌ప్రసాద తాజాగా లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టుల మొత్తం పెట్టుబడి రూ.6,962 కోట్లని, వీటి ద్వారా సుమారు 22,167 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. ఇదే సమయంలో చంద్రబాబు సర్కారు కప్పం వసూళ్లకు తట్టుకోలేక ఏపీ నుంచి వెళ్లిపోయిన కోకోకోలా, జ్యూపిటర్, అజాద్ మొబిలిటీ, ఐస్పేస్, జిన్‌ఫ్రా లాంటి కంపెనీల పెట్టుబడులు రూ.6,215 కోట్లుగా ఉండటం గమనార్హం.
అంతేకాదు.. లోక్‌సభలో కేంద్రం మరో ప్రశ్నకు సమాధానమిస్తూ గడిచిన రెండేళ్లలో ఏపీలో 4,520 ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డాయని, తద్వారా 48,477 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండేళ్లలో 22,167 ఉద్యోగాలు వస్తే ఇదే సమయంలో 48,477 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అంటే ఈ రెండేళ్లలో కొత్తగా ఒక్క ఉద్యోగం రాకపోగా ఉన్న 26,310 మంది ఉద్యోగులను రాష్ట్రం కోల్పోయింది. 
పెట్టుబడుల స్నేహపూర్వక రాష్ట్రాల్లో 8వ స్థానం
రెండేళ్ల క్రితం దాకా పెట్టుబడుల ఆకర్షణలో మొదటిస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏకంగా ఎనిమిది మెట్లు దిగజారిపోయింది. పెట్టుబడిదారుల అభిప్రాయాలను సేకరించి ర్యాంకులను ప్రకటించడం మొదలు పెట్టిన 2019 నుంచి 2023 వరకు సులభతర వాణిజ్యంలో అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆ స్థానంలో తీసుకొచ్చిన ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇండెక్స్‌లో 8వ స్థానానికి పడిపోయింది. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 131 మంది పారిశ్రామికవేత్తల నుంచి ఎనిమిదికిపైగా రంగాల పనితీరు ఆధారంగా ఆ ర్యాంకులను ప్రకటించారు. పెట్టుబడుల స్నేహశీల రాష్ట్రాల ర్యాంకుల్లో గుజరాత్ 56.6 పాయింట్లతో మొదటిస్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ 48.7 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. ఎనిమిది రంగాల డేటా విశ్లేషణ ద్వారా ఏపీకి 26.5 పాయింట్లు వస్తే సర్వేలో 22.2 పాయింట్లు లభించాయి. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే వచ్చాయని, రెండేళ్లలో రూ.29 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేశాయంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం నిజమైతే పారిశ్రామికవేత్తలు అంత ఘోరమైన ర్యాంకు ఎందుకు ఇస్తారనే చర్చ సర్వత్రా జరుగుతోంది.


