లోకేశ్ రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో పోస్టు
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో లోకేశ్ కూడా రాజీనామా చేయాలని నెటిజన్ల డిమాండ్
నీట్ పేపర్ లీక్‌ను మించింది డీఎస్సీ కుంభకోణం అంటూ యువత ఫైర్
లోకేశ్ తన వైఫల్యాన్ని ఒప్పుకుని పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్
లేదంటే ఏపీలోనూ కాక్రోచ్‌లు కదం తొక్కుతాయంటూ హెచ్చరిక
సాక్షి, అమరావతి: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ఎప్పుడు రాజీనామా చేస్తారంటూ యువత ఆయన్ను ప్రశ్నిస్తోంది. విద్యా శాఖలో ముఖ్యంగా డీఎస్సీ నిర్వహణలో చోటుచేసుకున్న పరిణామాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు, నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో అర్హతలు, రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు, వివిధ ఉత్తర్వుల మధ్య ఉన్న వ్యత్యాసాలను ప్రస్తావిస్తూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. పతకాలు సాధించిన వారిని కాదని, కేవలం పాల్గొన్న వారికి పోస్టులు ఎలా కట్టబెట్టారని విస్తుపోతున్నారు. నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, భారీ కుంభకోణం జరిగిందని తూర్పారబడుతున్నారు. ఇందుకు సాకులు చెప్పకుండా లోకేశ్ బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో డీఎస్సీ నియామకాల్లో తలెత్తిన వివాదాలను పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.
లోకేశ్ తన వైఫల్యాన్ని అంగీకరించి పదవి నుంచి తప్పుకోవాలని కొందరు డిమాండ్ చేస్తుండగా.. ఆయన రాజీనామా చేయకపోతే రాష్ట్రంలోనూ నిరసనలు ఉధృతమవుతాయని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కాక్రోచ్‌లు ఏపీలోనూ కదంతొక్కుతాయి’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరోవైపు.. లోకేశ్‌ను కాపాడటానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను రంగంలోకి దించి ఈ అంశాన్ని డైవర్ట్ చేస్తారేమోనని చంద్రబాబు ప్రభుత్వంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.


