గర్భం దాల్చిన పదోతరగతి బాలిక
పోలీసుల అదుపులో నిందితుడు బొంబాయి బాబు
ఇంకొందరు కూడా బాలికపై అత్యాచారం చేసినట్లు పోలీసులకు చెప్పిన నిందితుడు
శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం
సాక్షి, పుట్టపర్తి/గోరంట్ల: శ్రీసత్యసాయి జిల్లాలో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం దళిత బాలికపై అత్యాచారం జరిగింది. పదోతరగతి చదువుతున్న ఆ బాలిక ప్రస్తుతం ఐదునెలల గర్భంతో ఉన్నట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు బొంబాయి బాబు (55)ను గోరంట్ల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓ గ్రామానికి చెందిన బొంబాయి బాబు అదే కాలనీలోకి చెందిన దళిత బాలికను మాయమాటలతో లొంగదీసుకున్నాడు.
అనారోగ్యంగా ఉన్న బాలికను హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా ఐదునెలల గర్భిణి అని వైద్యులు నిర్ధారించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు గోరంట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బొంబాయి బాబుపై పోక్సో కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం మరిన్ని సెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉందని గోరంట్ల సీఐ బోయ శేఖర్ చెప్పారు. తనతోపాటు ఇంకొందరు ఆ బాలికపై అత్యాచారం చేశారని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. మద్యం మత్తులో ఉన్న బొంబాయి బాబు ఆ వ్యక్తులు ఎవరనేది చెప్పలేదని, అతడిని మరోసారి విచారిస్తామని పోలీసులు తెలిపారు.


