మయన్మార్‌లోని సైబర్ నేరస్తుల కార్యాలయం
సైబర్ నేరస్తుల చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్నాం
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలే మమ్మల్ని రక్షించాలి
సాక్షితో మయన్మార్ బాధితుల ఆవేదన
తాడేపల్లి రూరల్: మయన్మార్‌లో నరకం చవిచూస్తున్నామని, సైబర్ నేరస్తుల చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలే తమను రక్షించాలని వేడుకున్నారు. ఉద్యోగాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి మయన్మార్ వెళ్లి అక్కడ సైబర్ నేరస్తుల చేతిలో చిక్కుకున్న బాధితులు ఆదివారం వాట్సాప్ కాల్ ద్వారా ‘సాక్షి’తో తమ కష్టాలు చెప్పుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, అనంతపురం, విశాఖ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన బాధితులతోపాటు తెలంగాణకు చెందిన మొత్తం 24 మంది సాక్షితో మాట్లాడారు. కేజీఎఫ్ సినిమాలో మాదిరి తమను బంధించి 18 గంటలు వెట్టిచాకిరీ చేయిస్తున్నారని, సైబర్ నేరాలు చేయాలని చిత్రహింసలు పెడుతున్నారని కన్నీరుమున్నీరయ్యారు. పనిచేసే సమయంలో చిన్న కునుకు తీసినా సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా కొడుతున్నారని, భారీగా ఫైన్లు వేస్తున్నారని చెప్పారు.ఫైన్ కట్టకపోతే గుంజీలు తీయించి చిత్ర హింసలు పెట్టి జీతాల్లో కట్ చేస్తున్నారని ఆవేదన చెందారు.
యువతులను అసభ్యంగా తాకుతూ నరకం చూపుతున్నారని గోడు వెళ్లబోసుకున్నారు. తిండి కూడా పెట్టకుండా వేధిస్తున్నారని వివరించారు. భారత్‌కు వెళ్లాలంటే భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రోదించారు. తమకు ఫోన్‌లు కూడా ఇవ్వడం లేదని, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ అమ్మాయి సెక్యూరిటీని మభ్యపెట్టి ఫోన్ ఇస్తే దాని ద్వారా మాట్లాడుతున్నామని వివరించారు. జీతంలో రూ.20వేలే చేతికి ఇస్తున్నారని, తిండికీ డబ్బులు తీసుకుంటున్నారని, రెండు ఆఫ్‌లెగ్ చికెన్ జాయింట్లకు రూ.600. ఒక యాపిల్ పండుకు రూ.150, ఒక అరటిపండుకి రూ.60 వసూలు చేస్తున్నారని భోరుమన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలే రక్షించాలని వేడుకున్నారు. వందలమంది బాధితులున్నారని, తమ బాధలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.


